మనశ్శాంతి లేకుండా పాలన చేస్తున్నారా?

దేశంలో ఎక్కడా ఇలా ఉండదేమో, మీడియా అంటే బాధ్యతగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే ప్రజల గొంతుక వినిపించాలి. ప్రభుత్వం తప్పు చేస్తే అది ఎత్తి చూపించడమే పని [more]

Update: 2020-04-17 13:30 GMT

దేశంలో ఎక్కడా ఇలా ఉండదేమో, మీడియా అంటే బాధ్యతగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే ప్రజల గొంతుక వినిపించాలి. ప్రభుత్వం తప్పు చేస్తే అది ఎత్తి చూపించడమే పని కాదు ఎలా చేస్తే మంచి అవుతుందో కూడా చెప్పే నేర్పూ, ఓర్పు ఉండాలి. ఓ విధంగా చెప్పాలంటే న్యాయమూర్తి మాదిరిగా ఉండాలి. కానీ తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే ఓ సామాజిక వర్గం ఆధిపత్యంలో మెజారిటీ మీడియా ఉండడం వల్ల రాజకీయమే పరమావధిగా చేసుకుని బురద జల్లడం అలవాటుగా మారింది. తమ సామాజికవర్గం పెద్ద అధికారంలో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా రాతలు రాయడం వారికి అలవాటుగా మారిపోయింది.

ఇద్దరికీ ఇబ్బందులే….

తెలుగు రాజకీయాల్లో మీడియా అతి జోక్యం వల్ల ఇద్దరు ముఖ్యమంత్రులూ ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయాల్లో రాటు దేలిన కేసీఆర్ సైతం తన సహనం ఒక్కోసారి కోల్పోవాల్సివస్తోంది. ప్రజాస్వామ్య విరుధ్ధంగా హెచ్చరికలు కూడా జారీ చేయాల్సివస్తుందంటే దానికి ముఖ్యమంత్రిని తప్పుపట్టడం కంటే అంతదాకా పరిస్థితి తెచ్చుకుని తమ పరువు తీసుకుంటున్న మీడియా మోతుబరులను, కామందులను తప్పు పట్టాలి. ఈ మధ్యనే కేసీఆర్ కరోనా వైరస్ విషయంలో అవాస్తవాలు రాస్తున్న ఓ వర్గం మీడియాకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. శాపాలు కూడా పెట్టారు.

ముదిరిన రాతలు ……

ముఖ్యమంత్రులను పట్టుకుని సన్యాసులు అనడం కూడా తెలుగు మీడియాలోనే కనిపిస్తోంది. ఇది రాజ‌కీయ దన్నుతో వచ్చిన తెంపరితనంగానే చూడాలేమో. తమ పరిధులు మరచి అవాకులు చవాకులు రాస్తున్న ఈ మీడియా అధిపతులకు జనాల సమస్యల మీద శ్రధ్ధ ఉందని ఎందుకు భావించాలి. సొంత లాభం చూసుకుంటూ స్వీయ రాజకీయం చేసుకుంటూ కోట్లకు పడగలు ఎత్తిన మోతుబరి మీడియా పెద్ద మనుషులు ఎన్నికలో కోట్లాది ప్రజలు మెచ్చి ఇచ్చిన తీర్పుని పదే పదే పరిహసించడమే కాకుండా ఎన్నికైన ప్రభుత్వాల కాళ్ళకు అడుగడుగునా ముళ్ళను పెడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఈ విచ్చలవిడితనంతో పాలకులు పాలనలే చూసుకుంటారా లేక మీడియానే కంట్రోల్ చేస్తారా అన్నది ప్రతీసారీ పెద్ద సవాల్ గా మారుతోంది.

వదిలేయాలా…?

పొరుగున ఉన్న కర్నాటకలో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తన పాలన తాను చేసుకుంటున్నారు. ఆయన మీద విమర్శలు చేసేందుకు ప్రతిపక్షాలు ఉంటాయి కానీ నేరుగా దైనందిన రాజకీయాల్లోకి ఏ మీడియా పెద్ద మనిషీ జొరబడడంలేదు. ఇక జయలలిత సంపాదించిన అధికారాన్ని వారసులుగా అనుభవిస్తున్న అన్నాడీఎంకే సర్కార్ పెద్దలకు కూడా స్థానిక మీడియా నుంచి పెద్దగా బాధలు లేవు. అక్కడా రాజకీయ పార్టీలకు సొంత మీడియాలు ఉన్నా ఇంతలా హద్దులు దాటడంలేదు. అదే తీరున కేరళ, మహారాష్ట్ర, ఇంకా దేశంలో ఎక్కడ చూసుకున్న లోకల్ పాలిటిక్స్ లో మీడియా జోక్యం పెద్దగా కనబడదు. నచ్చని వారి కుర్చీలను కదిపేయడం, ఇష్టం వచ్చిన రాతలు రాయడం, కులాభిమానంతో పేట్రేగిపోవడం, రాష్ట్రాలను తమ జాగీరులుగా భావించి చెలరేగిపోవడం ఇవన్నీ తెలుగులోని కొన్ని వర్గాల మీడియా యాజమాన్యాలకు మాత్రమే పట్టిన జబ్బుగా చూడాలేమో. దీని వల్ల ఎన్నికలైన పాలకులు మనశ్శాంతిగా పాలించలేకపోతున్నారు. ఇలా రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ అసత్య వార్తలతో, అభూత కల్పనలతో వీర విహారం చేస్తున్న తప్పుడు రాతల ఓ సెక్షన్ మీడియాను కట్టడి చేసే అవసరం లేదా. చెప్పులోని రాయి, చెవిలోన జోరీగ మాదిరిగా అటు పాలకులూ, ఇటు ప్రజలూ భరించడమేనా?

Tags:    

Similar News