ఆయన కంటే ఈయనే బెటరా?

వైరస్ మహమ్మారి పై తెలుగు రాష్ట్రాల్లో టెస్ట్ ల నిర్వహణ చర్చనీయం అవుతుంది. తెలంగాణ లో తొలి నుంచి టెస్ట్ ల సంఖ్య తక్కువ చేస్తూ ఉంటే [more]

Update: 2020-06-26 16:30 GMT

వైరస్ మహమ్మారి పై తెలుగు రాష్ట్రాల్లో టెస్ట్ ల నిర్వహణ చర్చనీయం అవుతుంది. తెలంగాణ లో తొలి నుంచి టెస్ట్ ల సంఖ్య తక్కువ చేస్తూ ఉంటే దీనికి భిన్నంగా ఎపి లో మాత్రం దేశంలోనే అత్యధిక సంఖ్యలో వైరస్ పరీక్షలను చేయడం గమనార్హం. ఈ విచిత్ర పరిస్థితి పై ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం చర్చ నడుస్తుంది. కేంద్రం వైరస్ పరీక్షలకు సంబంధించి దేశమంతా ఒకే విధానం అమలు చేయకపోవడంతో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా వ్యవహారం మొదలు పెట్టాయి. తాజాగా కేసుల సంఖ్య గత వారం రోజులుగా తీవ్రంగా పెరుగుతుండగా తెలంగాణ లో ర్యాండమ్ టెస్ట్ లను నిలిపివేయడం మరోసారి వివాదాస్పదం అయ్యింది.

ఫలితాలు రాలేదని పరీక్షలు చేయరా …?

ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు రానందునే నిలిపి వేశామని తెలంగాణ వైద్య శాఖ ప్రకటించడం గందరగోళాన్ని మరింత పెంచేదిగానే ఉంది. పరీక్షలు ఏదో ఒక సమయంలో వస్తాయి. ఈలోగా వాటిని నిలిపేయడం దేనికోసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేసుల సంఖ్య తక్కువ చేసి చూపించాలని భావిస్తే రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకర స్థితికి చేరుకుంటాయన్న ఆందోళన తెలంగాణ హై కోర్ట్ సైతం వ్యక్తం చేసి పరీక్షలు పెంచాలని ఆదేశించింది అంటే అయోమయం ఏ స్థాయిలో ఉందో తేలిపోతుంది. వైరస్ ముమ్మరంగా ఉండటంతో వ్యాపార వర్గాలే హైదరాబాద్ లో స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించుకుని వ్యాపారాలు చేయలేం అని చేతులు ఎత్తేస్తున్న తీరు చూస్తే సర్కార్ తమ బాధ్యతలనుంచి క్రమంగా తప్పుకుని ప్రయివేట్ ఆసుపత్రుల చేతుల్లోకి ఇది పంపిస్తుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అప్పుడు ఆయన కోసం వెయిటింగ్ …

వైరస్ మహమ్మారి మొదలైన రోజుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పుడు మీడియా సమావేశం పెట్టి మాట్లాడతారా అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూసేవారు. సహజంగా మంచి మాటకారి కావడంతో కెసిఆర్ ఎప్పటికప్పుడు అప్ డేట్ సమాచారంతో ప్రజల్లో చైతన్యం పెంచారు. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ముఖ్యమంత్రి జగన్ కాలజ్ఞానం ముందే చెప్పేశారు. వైరస్ తో సహజీవనానికి సిద్ధం అయిపోవాలని ఆయన పిలుపు నివ్వడం తీవ్ర దుమారమే రేపింది. దీనికి తోడు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్ మీడియా ముందుకు వచ్చేవారే కాదు. ఇది కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది. కెసిఆర్ తో అంతా పోలిక చూస్తూ జగన్ సర్కార్ చేతల్లో పనితనం చూపించినా మాటల్లో అది కనపడక పెదవి విరిచేవారు.

జగన్ కరెక్ట్ అంటున్న జనం …

గతంలో కెసిఆర్ వైరస్ అంశంలో సూపర్ సూపర్ అన్న ప్రజలు ఇప్పుడు ఎపి ముఖ్యమంత్రి మొదటి నుంచి అనుసరించిన తీరే కరెక్ట్ అంటున్నారు. టెస్ట్ ల సంఖ్యలో ఎపి దేశంలో అగ్రగామిగా ఉండటం పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు దూర దృష్టితో ఎపి లో వైద్య రంగంపై జగన్ దృష్టి పెట్టడాన్ని అంతా అభినందిస్తున్నారు. జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను జగన్ మంజూరు చేయడాన్ని అంతా స్వాగతిస్తున్నారు. కేసులు ఎన్ని పెరిగినా ఎదుర్కొనేందుకు అన్ని జిల్లాల యంత్రాంగాన్ని జగన్ సన్నద్ధం చేసిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అధ్యయనం చేస్తున్నాయి. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ అనే మూడు పద్ధతులను ఎపి సర్కార్ అవలంబించడంతో వైరస్ కట్టడి లేదా ఎదుర్కోవడంలో తెలంగాణ కాన్నా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికైతే ముందు వరుసలో ఉండటం విశేషం.

Tags:    

Similar News