వికటించేలా ఉందే…?

నష్టాల్లో నిండా మునిగిన తెలంగాణ ఆర్టీసీ కి షాక్ ట్రీట్ మెంట్ సరైనదని గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయానికి వచ్చేశారు. దీనికోసం ఆయన మూడు రకాల వ్యూహాలతో [more]

Update: 2019-10-08 16:30 GMT

నష్టాల్లో నిండా మునిగిన తెలంగాణ ఆర్టీసీ కి షాక్ ట్రీట్ మెంట్ సరైనదని గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయానికి వచ్చేశారు. దీనికోసం ఆయన మూడు రకాల వ్యూహాలతో ఫార్ములా తెరపైకి తెచ్చారు. దీనిప్రకారం 50 శాతం ఆర్టీసీ బస్సులు, ముప్పై శాతం అద్దెబస్సులు, ఇరవై శాతం పూర్తిగా ప్రయివేట్ బస్సులు తో సంస్థ నిర్వహణ సాగుతుంది. ఇప్పటివరకు విధుల్లోకి రాని వారు ఉద్యోగులు కాదని తేల్చేశారు కేసీఆర్. ఇక విలీనం అయ్యాక యూనియన్లు అంటూ ఉండవని తనపై ఉద్యమిస్తున్నవారి కి చుక్కలు తప్పవన్న హెచ్చరికలు పంపారు. అలాగే సబ్సిడీ లు మాత్రం కొనసాగుతాయని ఆ సొమ్ము ప్రభుత్వం భర్తీ చేస్తుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు.

నిరంకుశత్వం అంటున్న అన్ని పార్టీలు …

కేసీఆర్ నిర్ణయాలపై మరోపక్క విపక్షాలన్నీ భగ్గుమంటున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ ఉద్యోగులకు ఇదేనా బాహుమానం అంటూ కాంగ్రెస్ నిలదీస్తుంది. బిజెపి మరింత ఘాటుగా విమర్శలు గుప్పిస్తుంది. కాలికి ముల్లుగుచ్చుకుంటే నోటితో తీస్తా అంటూ ఉద్యమంలో హామీలు గుప్పించిన కేసీఆర్ ఇప్పుడు గుండెల్లో గునపాలు గుచ్చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. యాభైవేలమంది కార్మికులకు వారి కుటుంబాలకు దసరా పండగ పూట సర్కార్ నోట్లో మట్టి కొట్టిందని విరుచుకుపడింది.

ప్రవేటీకరణకు తెరతీస్తారా …?

ప్రస్తుతానికి 50 శాతం ప్రభుత్వ బస్సులు, అద్దె బస్సులు, ప్రయివేట్ బస్సులు కలుపుకుంటే 50 శాతం నడుస్తాయి. అప్పటికి నష్టాల బాట నుంచి సంస్థ బయటపడకపోతే దశలవారీగా ప్రయివేట్ వారి చేతుల్లోకి టి ఆర్టీసీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అందుకే కేసీఆర్ ఒక పక్క విలీనం చేసేందుకు అంగీకరించి మరో పక్క ప్రయివేట్ వారికి పెద్ద పీట వేశారని స్పష్టం చేస్తున్నారు. సర్కార్ కి గుదిబండ గా మారిన సంస్థను వదిలించుకునే వ్యూహమే ఇది అని చెబుతున్నారు. చార్జీలు పెంచే నిర్ణయం నియంత్రణ కమిటీ చేతుల్లో ఉందని కేసీఆర్ ప్రకటించడం ద్వారా ఇకపై ప్రయాణికులకు వాతలు పెట్టడం కూడా గ్యారంటీ అన్నది విశ్లేషకుల అంచనా. మరి కేసీఆర్ తాజా వ్యూహం ఆయనను ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తుందా లేక నిండా ముంచుతుందా అన్నది వేచి చూడాలి .

Tags:    

Similar News