కౌసల్య కృష్ణమూర్తి మూవీ రివ్యూ

బ్యానర్‌: క్రియేటివ్‌ కమర్షియల్స్‌ నటీనటులు: ఐశ్వర్య రాజేశ్‌, రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌, ఝాన్సీ, వెన్నెల కిషోర్‌, శశాంక్‌, రవిప్రకాశ్‌ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్: దిబు నిన్నాన్‌ థామస్‌ సినిమాటోగ్రఫీ: [more]

Update: 2019-08-23 09:03 GMT

బ్యానర్‌: క్రియేటివ్‌ కమర్షియల్స్‌
నటీనటులు: ఐశ్వర్య రాజేశ్‌, రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌, ఝాన్సీ, వెన్నెల కిషోర్‌, శశాంక్‌, రవిప్రకాశ్‌ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: దిబు నిన్నాన్‌ థామస్‌
సినిమాటోగ్రఫీ: బి.ఆండ్ర్యూ
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత: కేఎ వల్లభ
దర్శకత్వం: భీమినేని శ్రీనివాసరావు

క్రికెట్ నేపథ్యంలో ఏ సినిమా వచ్చిన ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ప్రత్యక్ష ఉదాహరణలు.. బాలీవుడ్ లో వచ్చిన ‘ధోని’, తాజాగా టాలీవుడ్ లో వచ్చిన ‘మజిలీ, జెర్సీ’ సినిమాలే. క్రికెట్ నేపథ్యంలో సినిమా వస్తుంది అంటేనే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో క్రికెట్ ని ఆరాధించే అభిమానులను లెక్కపెట్టడం చాల కష్టం. తాజాగా తమిళంలో తెరకెక్కిన ‘కణ’ చిత్రాన్ని తెలుగులో ‘కౌశల్య కృష్ణమూర్తి’గా దర్శకుడు భీమినేని రీమేక్ చేశారు. ‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రంపై మొదటి నుండి మంచి అంచనాలున్నాయి. పోస్టర్ దగ్గరనుండి ట్రైలర్ వరకు ‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రంపై ఆసక్తిని పెంచాయి. తమిళ్‌లో కౌసల్య పాత్రను ఐశ్వర్య రాజేష్ చేస్తే.. కృష్ణమూర్తి పాత్రను సత్యరాజ్ చేరారు. ఇక తెలుగులో కౌసల్య పాత్రను యాజిటీజ్ గా ఐశ్వర్య రాజేష్ చేస్తే.. కృష్ణమూర్తి పాత్రని మాత్రం రాజేంద్ర ప్రసాద్ చేశారు. మరి ఎప్పుడూ కడుపుబ్బా నవ్వించే దర్శకుడు భీమినేని ఈ ‘కౌసల్య కృష్ణమూర్తి’ తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా రీమేక్ చెయ్యగలిగారా?లేదా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:
కృష్ణ‌మూర్తి (రాజేంద్ర‌ప్ర‌సాద్‌) క్రికెట్.. వ్యవసాయం అన్నా ప్రాణం. త‌న‌కు వ్య‌వ‌సాయం అంటే ఎంతిష్ట‌మో.. క్రికెట్ ఎంతిష్టమో.. కూతురు కౌసల్య (ఐశ్వర్య రాజేష్) అన్న అంతే ప్రాణం. ఇక క్రికెట్ లో ఇండియా ఓడిపోతే అస్స‌లు త‌ట్టుకోలేడు. తండ్రి కృష్ణమూర్తిని చూసి కూతురు కౌసల్య కూడా క్రికెట్‌పై మ‌క్కువ పెంచుకుంటుంది. చిన్నప్పటినుండి క్రికెట్ నే లోకంగా మార్చుకుంటుంది. ఇండియా త‌ర‌పున ఆడి, క‌ప్పు గెలిచి తండ్రి క‌ళ్ల‌లో ఆనందం చూడాల‌నుకుంటుంది. కానీ అమ్మాయిలకు ఆటల్లో ఎన్ని సమస్యలు ఎదురవుతాయి… అవి కౌసల్య కి అమ్మ (ఝాన్సీ) నుండే మొదలవుతాయి. మ‌గ‌పిల్ల‌ల‌తో ఆట‌లేంటి.. అంటూ ఎప్పుడూ కౌసల్య ని క్రికెట్ ఆడకుండా అడ్డుకుంటూ ఉంటుంది. అమ్మ తర్వాత ఊరు కూడా కౌసల్య ని చాలా వెటకారం చేస్తుంది. అయినప్పటికీ… వాట‌న్నింటినీ త‌ట్టుకుని క్రికెట‌ర్‌గా అడుగులు వేస్తుంది కౌసల్య‌. మరి తండ్రి కలను కౌసల్య ఏ విధంగా నెరవేర్చింది? క్రికెట్ లో ఉన్న సమస్యలను ఆధిగమించి సక్సెస్ సాధించిందా? సక్సెస్ కోసం కౌసల్య ఎలాంటి కష్టాలు పడింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల నటన:
కౌశల్య పాత్రకు ఐశ్వర్య రాజేశ్ ఎంపిక ఈ సినిమాకి బిగ్గెస్ట్‌ ప్లస్‌ పాయింట్. పల్లెటూరి అమ్మాయిగా డీ గ్లామరస్ పాత్రలో ఒదిగిపోయింది. నిజ‌మైన క్రికెట‌ర్‌లా క‌నిపించ‌డానికి త‌ను చాలా క‌ష్ట‌ప‌డింది. క్రికెటర్‌ పాత్ర చేస్తుంటే… దానిలోని మెళుకువలు తెలుసుకోవడానికి నాలుగైదు నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఐశ్వర్య.. శ్రమ, వర్క్ డెడికేషన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. రాజేంద్ర ప్ర‌సాద్ పాత్ర‌ని తీర్చిదిద్దిన విధానం, అందులో ఆయన న‌ట‌న త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. ఒక కూతురి కలను నిజం చేయడానికి తండ్రి పడే తపన ఆయనలో కనిపిస్తుంది. మరోవైపు దేశానికి అన్నం పెట్టే రైతు దుస్థితిని ఆయన పాత్ర ద్వారా కళ్లకు కట్టారు. త‌న అనుభ‌వాన్నంత‌టినీ రంగ‌రించి మ‌రీ రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో న‌టించారు. కౌసల్య తలి పాత్ర చేసిన ఝాన్సీ పాత్ర కూడా గుర్తిండిపోతుంది. ఇక తమిళ కణ లో క్రికెట్ కోచ్‌గా చేసిన శివ కార్తికేయన్ సీన్స్ తెలుగులో యాజిటీజ్ గా వాడడంతో.. ఆయన పాత్ర తెలుగు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అవుతుంది. ఇతర నటీనటులు వెన్నెల కిషోర్, రంగస్థలం మహేష్, విష్ణు టాక్సీవాలా హాలీవుడ్, రవిప్రకాష్ పరిధి మేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:
ఈమధ్యన తమిళ సినిమాలు ఎక్కువగా తెలుగులో రీమేక్ అవడం, హిట్ కొట్టడం చూస్తూనే ఉన్నాం. తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమాలను యాజిటీజ్ గా ఎలాంటి మార్పులు చెయ్యకుండా తెలుగు నేటివిటీకి దగ్గర రీమేక్ చేస్తే.. ఆ సినిమాతెలుగులోనూ హిట్ కొడుతోంది. తాజాగా భీమినేని తమిళంలో హిట్ అయిన కణ సినిమాని తెలుగులో కౌసల్య కృష్ణ మూర్తి గా రీమేక్ చేశారు. భీమినేని శ్రీనివాసరావు తమిళ కణ కథను పెద్దగా మార్పులు చేయకుండానే.. తెలుగు ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా సన్నివేశాలను చిత్రీకరించారు. ఒరిజినల్ కథను కిచిడీ చేయకుండా అనవరసమైన సన్నివేశాలను ఇరికించకుండా కథను సూటిగా మొదలుపెట్టాడు. ఓ సాధార‌ణ‌మైన అమ్మాయి, మారుమూల ప‌ల్లెటూరిలో పుట్టిన అమ్మాయి జాతీయ స్థాయి క్రికెట‌ర్‌గా ఎదిగిన వైనం స్ఫూర్తినిస్తుంది. తొలి స‌న్నివేశాలు స‌ర‌దాగా సాగిపోతూ, అక్క‌డ‌క్క‌డ ఎమోష‌న్‌తో మ‌న‌సుల్ని మెలిపెడుతూ సాగితే.. సెకండ్ హాఫ్ లో ఉత్కంఠ‌త చోటు చేసుకుంటుంది. కథ‌ని విడిచి వెళ్ల‌కుండా, క‌థ‌కు ఏం కావాలో అదే చేశారు.. చూపించారు. ఇక సినిమాలో అనవసరమైన హీరో – హీరోయిన్ లవ్ ట్రాక్ లేకుండా జాగ్రత్త పడ్డారు. అదుంటే.. కథ మొత్తం రివర్స్ అయ్యేది. ఇక క్రీడా నేపథ్యం ఉన్న కథలకు ఎలాంటి ముగింపు ఉంటుందో ఈ కథ కూడా అలాంటిదే. అయితే క్రీడా నేపథ్యం ఉన్న కథలో రైతు పడే ఇబ్బందుల్ని తెలియజేసి సందేశాత్మకంగా మలచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఎన్నో అవ‌మానాల్ని ఎదుర్కొన్న కౌస‌ల్య – విజేత‌గా నిల‌వ‌డం, తండ్రి క‌ల‌ను నెర‌వేర్చ‌డ‌మే క్లైమాక్స్‌.

సాంకేతికంగా… ముఖ్యంగా దిబూ నినాన్ థామస్ మ్యూజిక్ చిత్రానికి హెల్ప్ అయ్యింది. అంతేకాకుండా నేపథ్యం సంగీతం కూడా చక్కగా కుదిరింది బాగుంది. ఇక క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలకు సినిమాటోగ్రఫీ చాలా కీలకం. ఈ చిత్రంలో ఆండ్రూ కెమెరా పనితనం బాగుంది. సినిమాని రిచ్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. నిర్మాణ విలువలు కథానుసారంగా ఉన్నాయి.

రేటింగ్:2.75/5

Tags:    

Similar News