కాసును ఇక కదిలించలేరటగా?

గుంటూరు జిల్లా ప‌ల్నాడులోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం గుర‌జాల‌. ఇక్కడ నుంచి గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో గెలిచిన వైసీపీ నాయ‌కుడు, సీనియ‌ర్ పొలిటిక‌ల్ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన కాసు [more]

Update: 2020-02-18 00:30 GMT

గుంటూరు జిల్లా ప‌ల్నాడులోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం గుర‌జాల‌. ఇక్కడ నుంచి గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో గెలిచిన వైసీపీ నాయ‌కుడు, సీనియ‌ర్ పొలిటిక‌ల్ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన కాసు మ‌హేష్ రెడ్డి. ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నార‌ట‌. త‌న నియోజ‌వ‌క‌ర్గంలో కొన్ని ద‌శాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని దాదాపు 20 గ్రామాల‌ను ఆయ‌న అభివృద్ధి చేయాల‌ని నిర్ణయించుకున్నారు. అది కూడా మోడ‌ల్ విలేజెస్‌గా అభివృద్ది చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. నిజానికి ఇక్కడ మూడు సార్లు టీడీపీ నాయ‌కుడు య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు విజయం సాధించారు. గుర‌జాల అంటేనే య‌ర‌ప‌తినేని కంచుకోట‌. రెండున్నర ద‌శాబ్దాల‌కు పైగా ఆయ‌న ఇక్కడ రాజ‌కీయాలు ఒంటి చేత్తో శాసిస్తున్నారు. కానీ, గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు.

బ్రాండ్ చూపిస్తూ….

ఈ క్రమంలో ఇక్కడ విజ‌యం సాధించిన కాసు మహేష్ రెడ్డి త‌న రాజ‌కీయ జీవితానికి మ‌రింత పునాదులు వేసుకోవాలని భావించి ఇప్పుడు అభివృద్ధి మంత్రం ప‌ఠిస్తున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఆయ‌న చూపంతా ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన న‌ర‌సారావుపేట‌పైనే ఉంది. అయితే త‌ప్పని ప‌రిస్థితుల్లోనే ఆయ‌న గుర‌జాల‌లో పోటీ చేసి గెలిచారు. ఇక ఇప్పుడు న‌ర‌సారావుపేట‌లో గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి బ‌లంగా పాతుకుపోవ‌డంతో కాసు మహేష్ రెడ్డి ఇక్కడ బలంగా ఎద‌గ‌క త‌ప్పని ప‌రిస్థితి. ఇది ఆయ‌న రాజ‌కీయ భ‌విష్యత్తుకు కీల‌కం. ఈ క్రమంలోనే నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న ఇప్పటికే త‌న బ్రాండ్ చూపిస్తున్నారు. అత్యంత వెనుక‌బ‌డిన 20 గ్రామాల‌ను ఆయ‌న ఎంపిక చేసుకున్నారు.

ప్రణాళిక ప్రకారం…..

వీటిలో జాన్‌పాడు, క‌ర‌ల్పాడు, కోణంకి, మాచ‌వ‌రం, మోర్లంపాడు, గామాల‌పాడు, ముత్యాలంపాడు, జంగ‌మేశ్వర‌పురం, అంబాపురం, పులి పాడు, గోగుల‌పాడు, తంగెడ‌, రామాపురం, కేశ‌నుప‌ల్లి, పిన్నెల్లి, రేగుల‌గ‌డ్డ, బ్రాహ్మణ‌ప‌ల్లి, తుమ్మల‌చెరువు వంటివి ఉన్నాయి. ఆయా గ్రామాల‌ను ఆధునీక‌రించ‌డంద్వారా ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వానికి మ‌ధ్య వార‌ధి ఏర్పాటు చేస్తామ‌ని అంటున్నారు. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే కాసు మ‌హేష్‌రెడ్డి ప్రణాళిక ప్రకారం ర‌హ‌దారుల‌ను ఆధునీక‌రించి, సిమెంట్లు రోడ్లు వేయ‌నున్నారు. అదేవిధంగా తాగునీటి పంపుల‌ను ఏర్పాటు చేయ‌డంతోపాటు ప్రతి ఇంటికీ పైపు లైను ద్వారా ఆర్‌వో నీటిని అందించ‌నున్నారు.

గ్రామ సమస్యలపై…..

అదేవిధంగా గ్రామాల్లో ప‌చ్చద‌నానికి కూడా ప్రాధాన్యం పెంచ‌నున్నారు. డ్రైనేజీల ను ఏర్పాటు చేసి మురుగునీటి పారుద‌ల‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముందు ఈ 20 గ్రామాల్లోనూ ప‌నుల‌ను పూర్తి చేసి త‌ర్వాత ద‌శ‌ల వారీగా నియోజ‌క‌వ‌ర్గంలోని మిగిలిన గ్రామాల్లోనూ అబివృద్ధి కార్యక్రమాల‌ను ముందుకు తీసుకువెళ్తామ‌ని కాసు మహేష్ రెడ్డి చెప్పారు. ఇక కాసు గుర‌జాల ఎమ్మెల్యే అయ్యాక నియోజ‌క‌వ‌ర్గంలో దాచేప‌ల్లి, గుర‌జాల‌ను న‌గ‌ర పంచాయ‌తీలుగా అప్ గ్రేడ్ చేయించారు. ఇప్పటికే నియోజ‌క‌వ‌ర్గంలో మునిసిపాల్టీగా ఉన్న పిడుగురాళ్లకు తోడు మ‌రో రెండు ప‌ట్టణాలు తోడయి న‌ట్లయ్యింది.

మెడికల్ కళాశాల ఏర్పాటు….

ఇక గుర‌జాల‌లో ఇప్పటికే మెడిక‌ల్ కాలేజ్ ఏర్పాటుకు రంగం సిద్ధమ‌వుతోంది. ఈ విష‌యంలో కాసు ప్రత్యేకంగా స‌క్సెస్ అయ్యారు. జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌లో ప‌ల్నాడు కేంద్రంగా ఉన్న గుర‌జాల‌ను జిల్లా కేంద్రంగా చేయాల‌ని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే కాసు మహేష్ రెడ్డి క్రేజ్ నియోజ‌క‌ వ‌ర్గంలో జెట్ రాకెట్ స్పీడ్‌లా పెరుగుతోంది. ఈ ప‌రిణామాలు అన్నీ రాజ‌కీయంగా కూడా ఆయ‌న‌కు ల‌బ్ధి చేకూర్చేలా ఉన్నాయి.

Tags:    

Similar News