త్రిమూర్తుల చేతుల్లో కాశ్మీరం

Update: 2018-06-25 18:29 GMT

జమ్మూ కాశ్మీర్ గత కొద్దిరోజులుగా వార్తల్లో నలుగుతున్న అంశం. మెహబూబా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలన్న బీజేపీ అనూహ్య నిర్ణయంతో గవర్నర్ పాలన కూడా అనివార్యమైంది. రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. విమర్శలు, ప్రతి విమర్శలతో హోరెత్తింది. సున్నితమైన ఈ సరిహద్దు రాష్ట్రంలో గవర్నర్ పాలన కొత్తేమీ కాదు. గతంలో ఎన్నోసార్లు విధించారు. గత నలభై ఏళ్లలో గవర్నర్ పాలన విధించడం ఇది ఏడోసారి. ప్రస్తుత గవర్నర్ నరేందర్ నాధ్ వోహ్రా హయాంలో గవర్నర్ పాలన అమలు కావడం ఇది నాలుగోసారి. ప్రస్తుతం రాష్ట్ర పాలన వ్యవహారాలు గవర్నర్ వోహ్రా, కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం, గవర్నర్ నూతన సలహాదారుడు విజయ్ కుమార్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ ముగ్గురికి పాలన వ్యవహారాల్లో సమర్ధులని, పట్టుందన్న పేరుంది. రాష్ట్రానికి త్రిమూర్తుల్లా వీరిని పేర్కొనవచ్చు.

నీతి నిజాయితీలను....

గవర్నర్ వోహ్రాకు రాష్ట్రంపై సంపూర్ణ అవగాహన ఉంది. సుదీర్ఘ కాలంగా ఆయన రాజ్ భవన్ అధిపతిగా ఉన్నారు. 2008 జూన్ 25న యూపీఏ -1 ప్రభుత్వ హయాంలో నియమితులైన ఆయన మోదీ హయాంలో కూడా అదే స్థానంలో కొనసాగడం విశేషం. మోదీ ఢిల్లీ పగ్గాలు చేపట్టాక ఎంతోమంది గవర్నర్లను ఇంటి బాట పట్టించారు. కానీ వోహ్రాను మాత్రం కొనసాగించారు. ఆయన సమర్థత, నీతినిజాయితీలపై నమ్మకమే ఇందుకు కారణం. దేశంలో ఇంత సుదీర్ఘకాలం గవర్నర్ గా కొనసాగిన వ్యక్తి లేరు. 1936 మే 5న జన్మించిన వోహ్రా పంజాబ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. రాష్ట్రానికి 12వ గవర్నర్. జగ్ మోహన్ అనంతరం 18ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం నియమితులైన తొలి సివిల్ గవర్నర్. కాశ్మీర్ సున్నితమైన రాష్ట్రం కావడంతో సహజంగా పదవీ విరమణ చేసిన సైనిక, పోలీసు అధికారులను నియమిస్తుంటారు. సుదీర్ఘ పదవీకాలంలో వోహ్రా పలుకీలక పదవులను నిర్వహించారు. హోంశాఖ, రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. రక్షణ ఉత్పత్తుల కార్యదర్శిగా కూడా పనిచేశారు. దేశ రెండో అత్యున్న పౌర పురస్కారం ‘‘పద్మ విభూషణ్’’ ఆయనను వరించింది. పంజాబ్ యూనివర్సిటీలో ఆంగ్లంలో పీజీ చేసిన వోహ్రా అప్పట్లో యూనివర్సిటీ టాపర్ గా నిలిచారు. తాను చదివిన పంజాబ్ యూనివర్సిటీలోనే ఆయన కొంతకాలం అధ్యాపకుడిగా పనిచేయడం విశేషం. పంజాబ్ ప్రభుత్వంలో పరిశ్రమలు, ఆర్థిక, పట్టణాభివృద్ధి, సమాచార, పంచాయతీరాజ్ శాఖల కార్యదర్శిగా విశిష్ట సేవలను అందించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ గా పనిచేశారు. నాటి ప్రధాని ఐకే గుజ్రాల్ కు ముఖ్యకార్యదర్శిగా పనిచేసి ప్రభుత్వాన్ని నడపటంలో కీలక పాత్ర పోషించారు. 2003లో జమ్మూకాశ్మీర్ చర్చలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరుపున మధ్యవర్తిగా నియమితులయ్యారు. ఆయన సమర్థత, విశేష అనుభవం దృష్ట్యా మోదీ ప్రభుత్వానికి కాశ్మీర్ లో కళ్లు, చెవులుగా మారారు.

మన తెలుగోడే....

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బిబివ్యాస్ స్థానంలో నియమితులైన బీవీఆర్ సుబ్రమణ్యం రాష్ట్ర పాలన వ్యవహారాల్లో కీలకంగా మారనున్నారు. ఛత్తీస్ ఘడ్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన సుబ్రమణ్యంను కేంద్ర ప్రభుత్వం ఏరికోరి కాశ్మీర్ కు పంపింది. 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సుబ్రమణ్యం ఛత్తీస్ ఘడ్ హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతర్గత భద్రత వ్యవహారాల్లో ఆయనకు విశేష అనుభవం ఉంది. 2004-2008 మధ్య కాలంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు ప్రయివేట్ కార్యదర్శిగా పనిచేశారు. 2008 జూన్ నుంచి 2011 సెప్టంబరు వరకూ ప్రపంచ బ్యాంకులో పనిచేశారు. అనంతరం 2012లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కార్యాలయంలో సేవలందించారు. 2014 మేలో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ప్రధానమంత్రి కార్యాలయంలో 2015 మార్చి వరకూ పనిచేశారు. ఆ తర్వాత ఛత్తీస్ ఘడ్ కు వెళ్లారు. మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన సుబ్రమణ్యం ఆంధ్రప్రదేశ్ వాసి కావడం గర్వకారణం. నాటి ప్రధాని మన్మోహన్ ముఖ్య బృందంలో సి.రంగరాజన్ (ఆర్థికం), శివశంకర్ మీనన్ (విదేశాంగం), టీకేఏ నాయర్, పులోక్ ఛటర్జీ వంటి ఉద్దండులతో పాటు సుబ్రమణ్యం కూడా ఉండేవారు. వివాదరహితుడిగా పేరుంది. లండన్ లోని బిజినెస్ స్కూల్ లో మేనేజ్ మెంట్ డిగ్రీ పొందిన సుబ్రమణ్యం కొద్దికాలం ప్రపంచ బ్యాంకులో సైతం సేవలందించారు. మన్మోహన్ , మోదీల వద్ద పనిచేసిన ఆయన ఇద్దరి మన్ననలను అందుకున్నారు. ఆయన నిజాయితీకి నిదర్శనం.

వీరప్పన్ పనిపట్టి.....

ప్రస్తుత కాశ్మీర్ వ్యవహారాల్లో మూడో కీలక వ్యక్తి విజయకుమార్. విశ్రాంత ఐపీఎస్ అధికారి అయిన ఆయనను కేంద్రం గవర్నర్ సలహాదారుగా నియమించింది. తమిళనాడుకు చెందిన విజయకుమార్ అదే రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి అయినప్పటికీ సుదీర్ఘకాలం కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. గంధపు చెట్ల స్మగ్లర్ వీరప్పన్ ను అంతమొందించిన బృందానికి ఆయనే సారధి కావడం విశేషం. 1975 బ్యాచ్ కుచెందిన ఐపీఎస్ అధికారి అయిన ఆయన ఉమ్మడి ఏపీ డీజీపీగా పనిచేసిన ఏకే మొహంతికి బ్యాచ్ మేట్. కొంతకాలం చెన్నై పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. ఏపీ విభజన సమయంలో కూడా విజయ్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో నక్సలైట్లు విజృంభిస్తారని అప్పట్లో కొంతమంది ఆంధ్ర నాయకులు ప్రచారం చేశారు. ఇందులో వాస్తవం ఎంతో అధ్యయనం చేయమని అప్పట్లో కేంద్ర హోంశాఖ సలహాదారుడిగా ఉన్న విజయకుమార్ ను కేంద్రం కోరింది. క్షేత్రస్థాయిలో పరిశీలనతో పాటు, వివిధ శాఖల ఉన్నతాధికారులను కలసి అభిప్రాయలను సేకరించారు. అలాంటిది ఏమీ జరగదని విజయకుమార్ నివేదిక ఇచ్చాక రాష్ట్ర విభజనకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చే హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా, సీఆర్పీఎఫ్ కు డైరెక్టర్ జనరల్ గా, ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లోనూ ఆయన పనిచేశారు. సమర్థులైన సివిల్ సర్వీస్ అధికారులుగా, విశేష అనుభవం గల గవర్నర్ వోహ్రా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిబీవీఆర్ సుబ్రమణ్యం, గవర్నర్ సలహాదారు విజయ్ కుమార్ నేతృత్వంలో కశ్మీర్ లో పరిస్థితులు కుదుట పడాలని దేశం కోరుకుంటోంది. ఈ ప్రయత్నంలో వీరు విజయం సాధించాలని ‘‘తెలుగు పోస్ట్’’ కోరుకుంటుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News