Karne : కర్నెకు ఇక మంచిరోజులు లేనట్లేనా?

పార్టీలో సీనియర్ నేత కర్నె ప్రభాకర్ కు ఈసారి ఎమ్మెల్సీ పదవి దక్కే ఛాన్సు లేదు. అనేక సమీకరణాలు, కేసీఆర్ హామీలతో ఎమ్మెల్సీ పదవిని కేసీఆర్ ఇవ్వరనేది [more]

Update: 2021-11-06 09:30 GMT

పార్టీలో సీనియర్ నేత కర్నె ప్రభాకర్ కు ఈసారి ఎమ్మెల్సీ పదవి దక్కే ఛాన్సు లేదు. అనేక సమీకరణాలు, కేసీఆర్ హామీలతో ఎమ్మెల్సీ పదవిని కేసీఆర్ ఇవ్వరనేది పార్టీ నుంచి విన్పిస్తున్న టాక్. సీనియర్ నేతగా కర్నె ప్రభాకర్ ను ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించే అవకాశాలున్నాయని అంటున్నారు. మునుగోడు నియోజకవర్గం నుంచి కర్నె ప్రభాకర్ పోటీ చేస్తారని, అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోరన్నది కొందరి వాదనగా విన్పిస్తుంది.

కాంగ్రెస్ బలంగా…

కానీ కర్నె ప్రభాకర్ ను మునుగోడు నుంచి పోటీ చేయించే సాహసం చేయరన్నది కూడా విన్పిస్తుంది. మునుగోడు నియోజకవర్గం లో బలమైన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్ నుంచి మునుగోడు నుంచి పాల్వాయి గోవర్థన్ రెడ్డి నాలుగుసార్లు గెలిచారు. సీపీఐ ఐదుసార్లు, కాంగ్రెస్ ఐదుసార్లు మునుగోడు నుంచి విజయం సాధించాయి. టీఆర్ఎస్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది.

టీఆర్ఎస్ ఒకేసారి….

2014 ఎన్నికల్లో మునుగోడు నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ఆయన ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయనే మునుగోడు టీఆర్ఎస్ ఇన్ ఛార్జిగా ఉన్నారు. ఈసారి కాంగ్రెస్, కమ్యునిస్టులు కలసి ఇక్కడ పోటీ చేస్తే వారికే అడ్వాంటేజీ ఉంటుంది. మరోవైపు కర్నె ప్రభాకర్ కు ఇక్కడ ప్రత్యేకంగా వర్గం ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఎక్కువ సార్లు రెడ్డి సామాజికవర్గం నేతలే గెలిచారు.

టిక్కెట్ కూడా కష్టమే….

మరోవైపు కర్నాటి విద్యాసాగర్ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యాసాగర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మనిషిగా పేరుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి గాని, కర్నాటి విద్యాసాగర్ కు కాని టిక్కెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. దీంతో కర్నె ప్రభాకర్ మాజీ ఎమ్మెల్సీగానే మిగిలిపోవాల్సి ఉంటుందంటున్నారు. ఆయనకు పార్టీలో కీలక పదవి ఇచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

Similar News