కర్ణాటక క్వశ్చన్ మార్కులు...!

Update: 2018-05-21 15:30 GMT

కర్ణాటకం దేశ రాజకీయ యవనికపై అనేక ప్రశ్నలు రేకెత్తించింది. కొన్ని సందేహాలకు సమాధానాలు వెదికిపెట్టింది. మరికొన్ని అనుమానాలకు బీజం వేసింది. సందిగ్ధత,అనిశ్చితి జోడుగుర్రాలపై నడుస్తున్న రాజకీయాల్లో రేపేం జరుగుతుందో చెప్పలేని అయోమయం అంతర్నాటకంగా సాగిపోతూనే ఉంది. బేరసారాలు, క్యాంపు రాజకీయాలు, ప్రజాస్వామ్యానికి ప్రతిక్షణం కావలి కాసుకోవాల్సిన ఘట్టాలు అనేకం చోటు చేసుకున్నాయి. సంకీర్ణ సర్కారుల యుగంలో రేపటిభారతం ఎలా ఉండబోతోందనేందుకు ఒక ‘మచ్చ’తునకగా నిలిచింది. 36శాతం ఓట్లతో గద్దెనెక్క చూసిన కమలం వాడిపోయింది. కానీ పరస్పరం దుమ్మెత్తి పోసుకుని తలపడిన పక్షాలు మాన్యుఫాక్చర్డ్ మెజార్టీతో ముందుకొచ్చాయి. ఇది మూన్నాళ్లముచ్చటగా మిగులుతుందా? విబేదాల సంగతేమిటి? అన్నింటికంటే ముఖ్యంగా పదవుల పంపిణీ పొరపొచ్చాలు కల్పించదా?మేనిఫెస్టోల అమలు సంగతేమిటి? ఏమాత్రం అవకాశం వచ్చినా ఆరునెలల్లోపుగానే అటో ఇటో తేల్చేయాలని కాచుక్కూర్చున్న కమలం పార్టీ నుంచి తమ సభ్యులను కాపాడుకోవడమెలా? వంటి అనేక ప్రశ్నల మధ్యనే పదవీ స్వీకార ప్రమాణాలకు రంగం సిద్ధమైంది.

కాపలా ‘స్వామ్యం’...

నిజానికి ప్రజాస్వామ్యంలో ప్రజలంటే భయము, భక్తి ఉండాలి. తమపై మచ్చ పడితే ఎక్కడ తరిమికొడతారోననే భయముండాలి. తమను అందలమెక్కించారు కాబట్టి వారికిసేవ చేయాలనే భక్తి ఉండాలి. కానీ ఇప్పటి ప్రతినిధులకు రెండూ లేవు. ఓట్లను డబ్బులిచ్చి కొనుక్కుంటున్నాం కాబట్టి ప్రజలకు అడిగే హక్కు లేదని ఫిక్స్ అయిపోయారు. తమ పార్టీ ఎప్పుడు ఎవరితో కలుస్తుందో తెలియదు. అందుకే పార్టీసిద్దాంతాల పట్ల నమ్మకం, నాయకత్వం పట్ల విశ్వాసం అంతకంటే లేదు. అందుకే ఇప్పుడు కర్ణాటకలో కాపలా స్వామ్యం కొనసాగుతోంది. యడియూరప్ప దిగిపోయినప్పటికీ తమ ఎమ్మెల్యేలు చివరి వరకూ తమ వెంట ఉంటారనే నమ్మకం కాంగ్రెసు, జేడీఎస్ లకు లేదు. దాంతో హోటళ్లలోనూ, రిసార్టులలోనూ క్యాంపు పాలిటిక్స్ నడుపుతున్నారు. కుమారస్వామి విశ్వాసపరీక్ష నెగ్గేవరకూ వీరికీ అగ్నిపరీక్ష తప్పదట. ప్రజాస్వామ్యం పట్ల ఆయా పార్టీల నాయకత్వాలకు ఉన్న అంకితభావానికి ఇదో నిదర్శనం. జాతీయంగా ప్రతిష్ట దెబ్బతింటోందని గ్రహించి బీజేపీ పోటీ నుంచి తప్పుకుంది. అయినా తమ ఎమ్మెల్యేలపై రెండు పార్టీలకు గురి కుదరడం లేదు. ప్రభుత్వం ప్రమాణం చేసిన తర్వాత వీరంతా వివిధ కారణాలతో దూరం కారనే గ్యారంటీ ఏమిటి? పైపెచ్చు కేంద్రం నుంచి తగినంత మద్దతు ఉంటుంది. అసలే ఇప్పుడు ఏర్పాటవుతున్న ప్రభుత్వాన్నిపరస్పర విరుద్ధ శక్తుల కలయికగా చూడాలి. కాంగ్రెసు, జేడీఎస్ లు ప్రత్యర్థులుగా తలపడి మెజార్టీ సీట్లతో గెలిచాయి. కుల కుమ్ములాటలు, అంతర్గత అసంత్రుప్తులూ ఉండనే ఉన్నాయి. వీటన్నిటినీ అధిగమించి ఎంతకాలం సంఘీభావం చాటగలుగుతారనేది వేచిచూడాలి.

కాంగ్రెసుకు కొత్త పాఠం...

చిన్నాపెద్దా తేడాలేదు. టైమింగ్ ముఖ్యం. సరైన సమయంలో సరైన స్థానంలో ఉన్నవారికి అర్హతకు మించి అవకాశం దొరుకుతుంది. అదే రాజకీయం. కర్ణాటకలో జేడీఎస్ పరిస్థితి అదే. కేవలం 18శాతం ఓట్లతో ప్రజలు మూడో స్థానంలో ఆ పార్టీని కూర్చోబెట్టారు. ఒకరకంగా చూస్తే ప్రజలు తిరస్కరించారు. గతకాలం నాటి కాంగ్రెసు అయితే చీల్చి చెండాడి జేడీఎస్ ను నామరూపాల్లేకుండా చేసి అధికారం దక్కించుకునేది. కానీ బీజేపీ ప్రస్తుతం ఆ పాత్ర పోషణలో ఆరితేరిపోయింది. ఈ వాస్తవాన్ని గ్రహించడంతోనే కర్ణాటకలో జేడీఎస్ వంటి ప్రత్యర్థికి పగ్గాలిచ్చింది కాంగ్రెసు. చిన్నాచితక పార్టీలతో సైతం అవసరమైన సందర్భాల్లో రాజీపడితేనే జాతీయపార్టీగా తనమనుగడ స్థిరపడుతుందని తెలుసుకోగలిగింది. 2019 ప్రస్థానానికి అవసరమైన అనేక మెలకువలు, అణకువ, సంయమనం, సమీకరణలను నేర్పి పెట్టింది కర్ణాటక. పెద్దపార్టీగా పెత్తనం చేసే రోజులు పోయాయి. ఈ విషయంలో బీజేపీని చూసి చాలా నేర్చుకోవాలి. ఆ దిశలో కాంగ్రెసుకు కొత్త పాఠం నేర్పింది కన్నడ నాడు.

పనితీరే భవిష్యత్తు...

కాంగ్రెసుకు, బీజేపీకి ఒకటే తేడా నాయకత్వ సామర్ధ్యం. బీజేపీకి జాతీయస్థాయిలో బలమైన నాయకత్వం ఉంది. కాంగ్రెసుకు ఇది లోపించింది. కర్ణాటకలో చిన్నన్న పాత్రలో ఒదిగి పనిచేయడం చాలా కష్టమైన పనే. కానీ సంకీర్ణాలను నడపటంతో పార్టీ చక్కగా పనిచేస్తుందని నిరూపించుకోవాలంటే కర్ణాటక ప్రయోగాన్ని విజయవంతం చేయాలి. ట్రబుల్ షూటర్ గా సభ్యులెవరూ చెదిరిపోకుండా కాపాడిన డీకేశివకుమార్ వంటివారిని పెద్ద పదవులతో సంతృప్తపరచాల్సి ఉంటుంది. పరమేశ్వర వంటివారి పదవీ లాలసతనూ తీర్చాల్సి ఉంటుంది. దక్షిణ కర్ణాటకలో వొక్కలిగ మద్దతుతో జేడీఎస్, సొంతబలంతో కాంగ్రెసు గణనీయమైన సీట్లు తెచ్చుకున్నాయి. మిగిలిన ప్రాంతాలకు అన్యాయం జరగకుండానే ఇక్కడి వారికి కులాలవారీ మంత్రిపదవుల్లో అగ్రపీఠం ఇవ్వాల్సి ఉంటుంది. పాలసీల నుంచి పాలిటిక్స్ వరకూ జేడీఎస్ , కాంగ్రెసుల మధ్య ఏకాభిప్రాయం సాధించాలి. గతంలో ఈ రెండు పార్టీల సంకీర్ణం విఫలమైంది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. కర్ణాటకలో తమ పార్టీలు బతికి బట్టకట్టాలంటే ప్రభుత్వాన్ని కాపాడుకోవడం తప్పనిసరి. రోజువారీ జీవన్మరణ సమస్య. లేకపోతే కమలం కాటేస్తుంది. మళ్లీ కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది. ఈ ప్రాప్తకాలజ్ణతను గుర్తించి మసలుకుంటేనే 2019 నాటికి కర్ణాటకలో బీజేపీని నిలువరించగలుగుతాయి. దేశం మొత్తం ఇప్పుడు కర్ణాటక ప్రయోగం వైపు ఆసక్తిగా చూస్తోంది. ఈ పాలన సాఫీగా సాగితే దేశంలోనే కొత్త సమీకరణలకు నాంది పలుకుతుంది. లేకుంటే బీజేపీ భారీగా లాభపడుతుంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News