తేలిపోతుందటగా….!!

కర్ణాటక రాజకీయాలు కీలక దశకు చేరుకున్నాయి. రెబల్ ఎమ్మెల్యేలు ముంబయి నుంచి నేరుగా బెంగళూరుకు చేరుకుని స్పీకర్ రమేష్ కుమార్ ను కలిశారు. ఈరోజు రాత్రి లోగా [more]

Update: 2019-07-11 16:30 GMT

కర్ణాటక రాజకీయాలు కీలక దశకు చేరుకున్నాయి. రెబల్ ఎమ్మెల్యేలు ముంబయి నుంచి నేరుగా బెంగళూరుకు చేరుకుని స్పీకర్ రమేష్ కుమార్ ను కలిశారు. ఈరోజు రాత్రి లోగా రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే స్పీకర్ రమేష్ కుమార్ మాత్రం రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడానికి తనకు కొంత సమయం కావాలని సుప్రీంకోర్టులో తిరిగి పిటీషన్ వేశారు. అయితే స్పీకర్ పిటీషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

సుప్రీంకోర్టు చెప్పడంతో….

కర్ణాటక రాజకీయాల్లో గవర్నర్ పాత్ర కీలకం కాబోతోంది. గవర్నర్ వాజూభాయి వాలా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే తమ రాజీనామాల విషయం తేల్చాలని పది మంది రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఐదుగురు రెబెల్ ఎమ్మెల్యేలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది.

రేపు కీలకం…..

మరోవైపు రేపటి నుంచి కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు హాజరుకావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. విప్ ను థిక్కరిస్తే వారిపై అనర్హత వేటు వేయాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ లు రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు లేఖ రాశాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేలు రేపటి అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.

మరోసారి రాజీనామాలు….

తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి ఈరోజు సాయంత్రం స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖలను మరోసారి రమేష్ కుమార్ కు ఇచ్చారు. స్పీకర్ నిర్ణయంపైనే ఇప్పుడు కర్ణాటకలోని సంకీర్ణ సర్కార్ భవితవ్యం ఆధారపడి ఉంది. రాజీనామాలపై రాజ్యాంగ బద్ధంగా నిర్ణయం తీసుకుంటామని రమేష్ కుమార్ చెప్పారు. ముఖ్యమంత్రి కుమారస్వామి తొలుత రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన తనతండ్రి దేవెగౌడతో రాత్రంతా చర్చలు జరిపిన తర్వాత మనసు మార్చుకున్నారు. చివరి క్షణం వరకూ తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని కుమారస్వామి చెప్పారు. మొత్తం మీద కర్ణాటక రాజకీయ డ్రామాకు రెండు మూడు రోజుల్లో తెరపడనుంది.

Tags:    

Similar News