న్యాయం నిలిచింది...!

Update: 2018-05-18 14:30 GMT

కన్నడ బల పరీక్షలో ఎవరైనా నెగ్గవచ్చు. ఏ పార్టీ అయినా అధికారం చెలాయించవచ్చు. ప్రత్యర్థి అక్రమాలకు పాల్పడి పగ్గాలు దక్కించుకుందని ఆరోపించవచ్చు. రాజకీయ పార్టీలకు ఇది సహజం. సామదానభేదదండోపాయాలతో అధికారమే పరమావధిగా భావించే పార్టీలు తప్పులు, అక్రమాలకు పాల్పడటం కొత్తేమీ కాదు. ఒకనాటి కాంగ్రెసు నుంచి నేటి బీజేపీ వరకూ ఇదే తంతును అనుసరించాయి. అనుసరిస్తాయి. ప్రాంతీయపార్టీల్లోనూ తెలుగు దేశంమొదలు టీఆర్ఎస్ వరకూ తొక్కని అడ్డదారులేమీ లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఆయా పార్టీల విధేయతతో ఆ బురదలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. అన్నివ్యవస్థలూ అందులోభాగమై కొట్టుకుపోతున్నాయి. అటువంటి స్థితిలో సుప్రీం కోర్టు వెలువరించిన తాజా తీర్పు ప్రజాస్వామ్య హితైషులకు సంబరాన్నిచ్చింది. న్యాయవ్యవస్థ విలువలకు ప్రాణం పోసింది. రాజ్యాంగ గౌరవానికి రాచఠీవి కల్పించింది. కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారిన గవర్నర్లు తమ అధికారాలను దుర్వినియోగం చేయడం కొత్త ఉదంతమేమీ కాదు. తనకెందుకులే అని చూసీచూడనట్లుపోకుండా సకాలంలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుని దిద్దుబాటు చర్యలకు పూనుకోవడమే ఇక్కడ మలుపు. ప్రజాస్వామ్యానికి మేలుకొలుపు.

మోడీ ముందు చూపు.. వాజూభాయ్ ...

రాజ్యాంగ పదవులు అధిష్టించినా తామింకా పార్టీ సభ్యులమే అనుకుంటూ ఉంటారు కొందరు. అటువంటివారిలో గవర్నర్లదే మొదటి స్థానం. దేశంలో గవర్నర్ల వ్యవస్థ అక్రమాలపై ఏ చర్చ జరిగినా ఎన్టీరామారావును పక్కకి తప్పించిన రామ్ లాల్ ఉదంతాన్ని ముందుగా చెబుతుంటారు. ఆ కోవలో తాజా ఉదాహరణ వాజూబాయ్ వాలా. గుజరాత్కు చెందిన వాజూబాయ్ మోడీ, అమిత్ షాల ద్వయానికి అత్యంత ఆత్మీయుడు. గుజరాత్ లో మోడీ రంగప్రవేశం కోసం తన సీటును త్యాగం చేసి ఆ తర్వాత ప్రతిఫలాన్ని మంత్రి రూపంలో బహుమతిగా అందుకున్న వ్యక్తి . దేశ ప్రధానిగా మోడీ కొలువైన తర్వాత చాలా కీలకమైన పోస్టులోకి వస్తారని అందరూ అనుకున్నదే. 2012నుంచి 2014 వరకూ స్పీకర్ గానూ పనిచేశారాయన. వయసు , అనుభవం ద్రుష్టిలో పెట్టుకుని గవర్నర్ పదవిని ఇచ్చారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఆయన ను కర్ణాటకకు గవర్నర్ గా నియమించడమే ముందుచూపు. 2014 సెప్టెంబరులోనే మోడీ ప్రభుత్వం వాజూభాయ్ ను కర్ణాటక గవర్నర్ గా నియమించింది. బీజేపీ రాష్ట్ర శాఖ పైన, అక్కడి కాంగ్రెసు ప్రభుత్వంపైనా చెక్ పాయింట్ అని పార్టీ శాఖా నాయకులు ఆంతరంగికంగా చెప్పుకుంటూ ఉంటారు. పార్టీ పరమైన వ్యవహారాలు మోడీ, అమిత్ షా ల దృష్టికి అవసరమైన సందర్బాల్లో తీసుకెళుతూ ఉండేవారనే విమర్శలు, ఆరోపణలు కూడా ఉన్నాయి. అదే సమయంలో సిద్ధరామయ్య వంటి స్ట్రాంగ్ లీడర్ సీఎంగా ఉండటంతో అతని వ్యూహాలను పసిగట్టి కేంద్రానికి చెప్పడాన్ని తన బాధ్యతగా తీసుకునేవారంటారు. కన్నడ సీమపై కన్నేసిన మోడీ ఎంతో ముందుచూపుతోనే వాజుబాయ్ ను ఇక్కడ తన మనిషిగా పెట్టారనేది పార్టీ వర్గాల ప్రచారం. మెజార్టీ రాకపోయినా బీజేపీకి అవకాశం కల్పించే విషయంలో ఆ వ్యూహమే ఫలించింది. తన బాధ్యతను మోడీ మెచ్చుకునేలా నిర్వర్తించేశారు. రాజ్యాంగబద్ధత, న్యాయబద్ధత అన్నవి చెల్లని మాటలుగా రాజ్ భవన్ మరోసారి రుజువు చేసుకుంది. ఎన్నికలంటే మోడీ, అమిత్ షాలు ఎంతసీరియస్ గా ఉంటారనేదానికి ఇదో ఉదాహరణ. ప్రొటెం స్పీకర్ నియామకంలో సైతం గవర్నర్ తన విధేయతను చాటుకున్నారు. ఏదో రకంగా యడియూరప్ప సర్కారును నిలపాలనే ప్రయత్నానికి ఉడతాభక్తి చాటుకున్నారు.

చాచి కొట్టిన సుప్రీం ...

రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ను నేరుగా తప్పుపట్టకపోయినా ఆయన ప్రతిచర్యనూ సుప్రీం కోర్టు అనుమానాస్పదంగానే చూసింది. గవర్నర్ విచక్షణాధికారంలో జోక్యం చేసుకోకుండా సంయమనం పాటించింది. అదే సమయంలో గవర్నర్ తప్పుచేస్తే న్యాయసమీక్షకు అతీతం కాదని నిరూపించింది. నాలుగు విధాలుగా న్యాయస్థానం తన బాధ్యతను నిర్వర్తించింది. ప్రజాస్వామ్యం గెలవాలని భావించింది. 15 రోజుల గడువుతో బేరసారాలకు వెసులుబాటునిచ్చిన గవర్నర్ నిర్ణయాన్ని కుదించి ఒకరోజువ్యవధికే పరిమితం చేసింది. రాజ్యాంగం నీకు కల్పించిన అధికారాన్ని వినియోగించి పదవి కట్టబెడితే మాకు కల్పించిన అధికారంతో దానికి చెక్ పెడతామంది.విచక్షణాధికారాన్ని వివక్షాధికారంగా మార్చిన గవర్నర్ పరిధిని గుర్తు చేసినట్లే ఉంది తీర్పు. ముఖ్యమంత్రి యడియూరప్ప విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని కట్టడి చేసింది. ఆంగ్లో ఇండియన్ సభ్యుడిని నియమించి మెజార్టీ కి ఒక అంకె చేర్చుకోవాలనుకున్న ప్రయత్నానికి సుప్రీంకోర్టు గండి కొట్టింది. మరోవైపు రహస్య బ్యాలెట్ పద్ధతిలో ప్రభుత్వ బలనిరూపణ చేసుకుంటామని వక్రబుద్దిని బయటపెట్టిన బీజేపీ వాదననూ తోసిపుచ్చింది. మొత్తమ్మీద సుప్రీం కోర్టు రాజ్యాంగపరంగా తాను ఏమేరకు సహకరించగలదో అంతవరకూ న్యాయం చేసిందనే చెప్పాలి. మెజార్టీ, మైనార్టీ ప్రజాతీర్పుతో సంబంధం లేకుండా ఒంటెత్తు పోకడలతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలే ఉండాలన్నట్లుగా రెచ్చిపోతున్న బీజేపీకి ఒక చెంపపెట్టులాంటి తీర్పునిచ్చింది సుప్రీం. అత్యున్నత న్యాయస్థానం ఇటీవలి కాలంలో అనేక వివాదాల్లో నలుగుతోంది. సుప్రీం న్యాయమూర్తులే బయటికొచ్చి అంతా సజావుగా లేదంటూ రోడ్డెక్కుతున్నారు. ఇటువంటి సందర్భాలు న్యాయవ్యవస్థను మసకబార్చుతున్నాయి. ఇటువంటి తీర్పులు న్యాయస్థానాల పట్ల ప్రజావిశ్వాసాన్ని నిలబెడతాయి. తమ శాసనసభ్యులు చెల్లాచెదురుకాకుండా, ప్రలోభాలకుగురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా పార్టీలపై ఉంటుంది. రాజ్యాంగాన్ని నిర్వచించి రక్షించాల్సిన కర్తవ్యాన్ని సుప్రీం తలదాల్చడం హర్షణీయం. అభినందనీయం. ప్రజాస్వామ్య శక్తులకు అండ దొరికింది. గెలుపోటములు అనేవి తాత్కాలికం. రాజకీయాల్లో నేటి మిత్రులు రేపు శత్రువులు అవుతారు. నేటి శత్రువులు రేపటి మిత్రులుగా రూపుదాలుస్తారు. జెడీఎస్, కాంగ్రెసు, బీజేపీలు మూడూ గతంలో ఈ ఆట ఆడాయి. ప్రలోభాల పర్వంలో , పదవీ లాలసత్వంలో రాటుదేలాయి. కానీ న్యాయస్థానంపై మచ్చ పడితే అంత తొందరగా చెరగదు. ఎంత నిక్కచ్చిగా, నిజాయతీగా నిజం వైపు నిలబడ్డామన్నదే న్యాయస్థానాలకు ప్రామాణిక సూత్రం. దానిని నిలబెట్టుకున్న మన సుప్రీం కు శాల్యూట్ చేయాల్సిందే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News