మఠాలు ఫలితాలను శాసించనున్నాయా?

Update: 2018-04-20 16:30 GMT

ఇరుగు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుల మధ్య ఒక వైరుధ్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. నాస్తిక వాదానికి కేంద్రంగా తమిళనాడు నిలవగా, ఆధ్యాత్మిక వాతావరణం పక్కనున్న కర్ణాటకలో విరాజిల్లుతోంది. తమిళనాడులోకూడా ఆధ్యాత్మిక వాతావరణం ఉన్నప్పటికీ కర్ణాటకతో పోలిస్తే తక్కువే. అక్కడ పార్టీలు ముఖ్యంగా ద్రవిడ పార్టీలు నాస్తికవాదానికి కట్టుబడి ఉన్నాయి. కర్ణాటకలో పరిస్థితి విభిన్నం. ఇక్కడ గుళ్లు, గోపురాలు, మఠాలు, పీఠాలకు కొదవలేదు. శృంగేరీ పీఠం, శారదాపీఠానికి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. వాటి అధిపతులకు ప్రతి ఒక్కరూ ప్రణమిల్లుతుంటారు. వారిని ఆరాధిస్తుంటారు.

ఎన్నికల సమయంలో వీటి ప్రభావం...

ఎన్నికల సమయంలో ఈ పరిస్థితి ఒకింత ఎక్కువే. ఢిల్లీ నుంచి గల్లీ స్థాయి నాయకుల వరకూ అందరూ ఆలయాల చుట్టూ అదే పనిగా తిరుగుతుంటారు. బీజేపీ అగ్రనేతలు నరేంద్రమోడీ, అమిత్ షాలు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా ఇటీవల కాలంలో రాష్ట్రాన్ని సందర్శించిన ప్రతిసారీ ఏదో ఒక పీఠానికి వెళుతుండటం గమనార్హం. రాష్ట్రంలో ప్రతి కులానికీ మఠాలున్నాయి. ప్రజలపై ఆయా మఠాధిపతులకు పట్టు ఎక్కువ. వీరు కేవలం పూజలు, పునస్కారాలకే పరిమితం కాదు. రాజకీయనాయకుల జాతకాలను కూడా తారుమారు చేసే శక్తి ఉంది. మఠాల సేవా కార్యక్రమాలు చేపడుతుండటం విశేషం. పెద్దయెత్తున అన్నదానం, విద్యాసంస్థలు, హాస్టళ్లు, అనాధ ఆశ్రమాలు, వైద్యసంస్థలను నడుపుతూ ప్రజలకు చేరువవుతుండటం సానుకూల పరిణామం.

మూడు సామాజిక వర్గాలకూ....

రాష్ట్రంలోని ప్రధాన సామాజిక వర్గాలైన లింగాయత్, ఒక్కలింగ, కురుబ సామాజిక వర్గాలకు ప్రత్యేక మఠాలున్నాయి. రాష్ట్రంలో చిన్న చితకా కలిపి సుమారు ఐదు వేల మఠాలున్నట్లు అంచనా. అతి పెద్ద కులమైన లింగాయత్ లకు ఎక్కువ సంఖ్యలో మఠాలున్నాయి. తుముకూరులోని సిద్ధగంగ మఠం అత్యంత ప్రాచీనమైనది. మఠాధిపతి స్వామి శివకుమారకు ప్రజల్లో మంచి పలుకుబడి ఉంది. లింగాయత్ లకు మైనార్టీ హోదా కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఇది స్వాగతించింది. రాహుల్ గాంధీ, అమిత్ షాలు దీనిని సందర్శించి స్వామీజీ ఆశీస్సులు పొందారు. రాష్ట్రంలో మరో బలమైన సామాజిక వర్గం ఒక్కలింగ. మాజీ ప్రధాని దేవెగౌడ ఈ సామాజిక వర్గానికి చెందిన వారే. మరో మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి ఎస్ఎం కృష్ణ కూడా ఈ వర్గం నాయకుడే. ఒక్కలింగలకు మాండ్యా జిల్లాలోని శ్రీ క్షేత్ర ఆదిచుంచనగిరి పేరుతో మఠం ఉంది. దేవెగౌడకు మొదటి నుంచి ఇది మద్దతు ఇస్తోంది. మఠాధిపతి స్వామి నిర్మాలానంద ఆశీస్సులు కోసం రోజూ పెద్ద సంఖ్యలో సందర్శిస్తుంటారు. తాజా ఎన్నికల్లో ఈ మఠం మద్దతు కోసం కాంగ్రెస్, బీజేపీ గట్టిగా కృషి చేస్తున్నాయి. వెనకబడి కురుబ సామాజిక వర్గానికి సైతం ప్రత్యేక మఠం ఉంది. హవేరీ జిల్లాలోని కగినెవె కనకగురు పీఠం ప్రసిద్ధి గాంచింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ సామాజిక వర్గానికి చెందిన వారే. ఈ మఠాధిపతి ఆశీస్సుల కారణంగానే ఆయన ముఖ్యమంత్రి అయ్యారని చెబుతుంటారు.

మాదిగలకూ ప్రత్యేకంగా.....

చిత్రదుర్గ పట్టణానికి పశ్చిమ దిశగా మరో లింగాయత్ మఠం ఉంి. ఇది 17వ శతాబ్దంలో ఏర్పాటు అయింది. చిత్ర దుర్గ పరిసరాల్లో దీనికి మంచిపేరుంది. శివమూర్తి మురుగ రాజేంద్ర స్వామి దీనికి అధిపతి. కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా భారీ ఎత్తున 150 విద్యాసంస్థలను ఈ మఠం నిర్వహించడం విశేషం. లింగాయత్ లకు చెందిన మరో మఠం సుత్తూరు మఠం. మైసూరు సమీపంలో ఉన్న ఈ మఠం అధిపతి శివరాత్రి దేశకేంద్రస్వామి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 300 విద్యాసంస్థలను నిర్వహిస్తూ విద్యాదానం చేస్తోంది. చిత్రదుర్గ జిల్లాలో మాదిగల కోసం మాచిదేవ మహాసంస్థాన్ మఠ్ పనిచేస్తోంది. మఠాధిపతి బసవ మాచిదేవ స్వామిజీ మాదిగలకు ఆరాధ్యుడు. దళితుల హక్కులు, సమస్యలపై ఆయన పోరాడతారు. చిత్రదుర్గ పరిసర ప్రాంతాల ఓటర్లపై ఈయన ప్రభావాన్ని అంత తేలిగ్గా తోసి పుచ్చలేం. ఇదే జిల్లాలోని సిరగెరె లోని తరలబాలు జగద్గురు బృహన్మఠ్. గచగ్ జిల్లాలోని తొంలద్వారామఠ్కు మంచి పేరు ప్రతిష్టలే ఉన్నాయి. వాటి మాటకు ప్రాధాన్యం ఉంది. మతం, రాజకీయం వేరు వేరని, రెంటికీ ముడి పెట్టరాదని నాయకులు వేదికలపై ప్రసంగాలు దంచేస్తుంటారు. కాని కర్ణాటకకు సంబంధించినంత వరకూ వాటిని వేరు చేసి చూడలేం. రెండూ కలగా పులగమయ్యాయి. పాలునీళ్లులా కలిసి పోయాయి. ఈ కలయిక మరింత చిక్కదనం అవుతుందే తప్ప పలుచనయ్యే అవకాశాలు సమీప భవిష్యత్తులో లేనట్లే....!!

Similar News