సంప్రదాయానికి సిద్ధూ గండి కొడతారా?

Update: 2018-04-11 16:30 GMT

దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటక ఆదినుంచి కాంగ్రెస్ కు కంచుకోటగా నిలిచింది. 1983 వరకూ కాంగ్రెస్ ముఖ్యమంత్రులే ఇక్కడ చక్రం తిప్పారు. మొదటి ముఖ్యమంత్రి కె. చంగల్ రామ్ రెడ్డి నుంచి 1983 వరకూ హస్తం పార్టీ నాయకులే కన్నడ రాజ్యాన్ని పాలించారు. చెంగల్ రామ్ రెడ్డి తర్వాత హనుమంతయ్య, కె. మంజప్ప, నిజలింగప్ప, బీడీ జత్తి, ఎస్.ఆర్.కాంతి, వీరేంద్ర పాటిల్, దేవరాజ్ అర్స్, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. వీరిలో నిజలింగప్ప నాలుగుసార్లు సీఎంగా రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. జాతీయ స్థాయిలో పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలందించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన బి.డి. జత్తి అనంతరకాలంలో ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. వీరేంద్రపాటిల్ కూడా రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు రాష్ట్రంలో హస్తం పార్టీ హవా నడిచింది.

హస్తం పార్టీకి బ్రేకులు.....

1983 నుంచి పరిస్థితి తిరగబడింది. హస్తం పార్టీ హవాకు అడ్డంకులు ఏర్పడ్డాయి. రాష్ట్ర రాజకీయ చరిత్ర కూడా మారిపోయింది. అప్పటి నుంచి కొత్త సంప్రదాయం ప్రారంభమైంది. అధికార పార్టీ రెండోసారి గెలవడం కర్ణాటకలో అసాధ్యంగా మారిపోయింది. అధికార పార్టీ అపజయం పాలవ్వడం, విపక్ష: విజయం సాధించడం అప్పటి నుంచి ఆనవాయితీగా మారింది. అదే ఆనవాయితీ కమ్రం తప్పకుండా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి ఏమవుతోందన్న ప్రశ్న, ఉత్కంఠ కలగడం సహజం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారాన్ని కాపాడుకుంటుందా? లేదా? విపక్ష బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ ప్రస్థానాన్ని పరిశీలిస్తే అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తాయి. 1978లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి దేవరాజ్ అర్స్ సారథ్యంలో కాంగ్రెస్ విజయం సాధించింది. అనంతర కాలంలో పార్టీ అంతర్గత పరిస్థితుల కారణంగా ఆర్. గుండూరావు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.

ఇదే మలుపు తిప్పిన ఏడాది.....

రాష్ట్రానికి సంబంధించి 1983 కీలక సంవత్సరం. తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం అప్పుడు కొలువుదీరింది. రామకృష్ణ హెగ్డే సారథ్యంలో జనతాపార్టీ విజయం సాధించింది. 1984 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో నైతికంగా తాను ఓడిపోయానని భావించిన హెగ్డే 1985లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లి మళ్లీ సానుకూల ప్రజాతీర్పును పొందారు. 1988 వరకూ ఆయన పదవిలో కొనసాగారు. పార్టీ అంతర్గత పరిస్థితుల కారణంగా 1989లో హెగ్డే స్థానంలో ఎస్.ఆర్. బొమ్మై అధికార పగ్గాలు అందుకున్నారు. అనంతరం 1989 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార జనతా పార్టీని విపక్ష కాంగ్రెస్ ఓడించింది. సీనియర్ నాయకుడు వీరేంద్ర పాటిల్ ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత రోజుల్లో పార్టీ అంతర్గత పరిస్థితుల కారణంగా పాటిల్ స్థానంలో ఎస్. బంగారప్ప సీఎం అయ్యారు. అనంతరం ఆయన స్థానంలో వీరప్ప మొయిలీ ముఖ్యమంత్రి పగ్గాలు అందుకున్నారు. అనంతరకాలంలో మొయిలీ యూపీఏ మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. నిజానికి టేపుల కుంభకోణంలో అధిష్టానం ఆయనను పదవి నుంచి తప్పించింది. వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుడైన వీరప్ప మొయిలీ ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. తన కుమారుడికి టిక్కెట్ ఇప్పించుకునేందుకు పావులు కదుపుతున్నారు. అనంతరకాలంలో 1994లో జరిగిన అసెంబ్లలీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఓడిపోయింది. విపక్ష జనతాదళ్ హెచ్.డి. దేవెగౌడ సారథ్యంలో ఎన్నికలకు వెళ్లి విజయం సాధించింది. 1996లో జాతీయ రాజకీయాల్లో మార్పుల కారణంగా అనూహ్యంగా గౌడ ప్రధాని అయ్యారు. దీంతో ఆయన స్థానంలో జె.హెచ్. పటేల్ అధికార పగ్గాలు అందుకున్నారు. 1999 ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోవడం అన్న సంప్రదాయం మరోసారి నిరూపితమైంది. నాటి ఎన్నికల్లో అధికార జనతా దళ్ ఓడిపోగా ఎస్.ఎం కృష్ణ సారథ్యంలో విపక్ష కాంగ్రెస్ విజయ పతాకం ఎగుర వేసింది. ఒక్కలింగ సామాజిక వర్గానికి చెందిన కృష్ణ రాష్ట్ర అభివృద్ధికి, పార్టీ ప్రగతికి గట్టి బలమైన పునాదులు వేశారు. అనంతర కాలంలో అధిష్టానం ఆయనను మహారాష్ట్ర గవర్నర్ గా పంపింది. ఆయన స్థానంలో ధరం సింగ్ సీఎం అయ్యారు.

ఆనవాయితీగా వస్తున్న.....

అనంతర ఎన్నికల్లో ఆనవాయితీగా అధికార కాంగ్రెస్ ఓడిపోయింది. విపక్షాలయిన జనతాదళ్, బీజేపీ కూటమి విజయం సాధించింది. ఒప్పందంలో భాగంగా మొదట జనతాదళ్ (ఎస్) నాయకుడు కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత అధికార పగ్గాలు బీజేపీ నాయకుడు ‍యడ్యూరప్పకు లభించాయి. సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు ఏర్పడటంతో 2008లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. యడ్యూరప్ప సారథ్యంలో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లిన బీజేపీ సంపూర్ణ ఆధిక్యంతో విజయం సాధించింది. కానీ పార్టీ అంతర్గత రాజకీయాల కారణంగా అయిదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారాల్సి వచ్చింది. అవినీతి కుంభకోణాల్లో యడ్యూరప్ప పాత్రను లోకాయుక్త నిర్ధారించడంతో ఆయన జైలుకు వెళ్లారు. ఆయన స్థానంలో ఒక్కలింగ సామాజిక వర్గానికి చెందిన సదానంద గౌడ సీఎం అయ్యారు. అంతర్గ త రాజకీయాల కారణంగా కొద్ది రోజుల్లోనే గౌడ వైదొలగారు. ఆయన స్థానంలో జగదీశ్ షెట్టర్ ను బీజేపీ అధిష్టానం సీఎంను చేసింది. అవినీతి, ముఖ్యమంత్రుల మార్పు కారణంగా విసిగిపోయిన ప్రజలు 2013 ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించారు. ఎప్పటిలాగానే విపక్ష కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టారు. నాటి ఎన్నికల్లో సిద్ధరామయ్య సారథ్యంలో ఎన్నికలకు వెళ్లిన ప్రతిపక్షం అధికారాన్ని కైవసం చేసుకుంది. అధికార పార్టీ ఓడిపోవడం, విపక్షాలు గెలవడం ఆనవాయితీ గత మూడు దశాబ్దాలుగా క్రమం తప్పకుండా కొనసాగుతుంది. ఈసారి ఏమవుతుందో చూడాలి. అదే ఆనవాయితీ కొనసాగాలని బీజేపీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాట మాత్రం వాస్తవం.....!!!

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News