ఫుల్ స్టాప్ కాదు… కామా మాత్రమే…!!

అయిననూ ప్రయత్నించవలె అంటున్నారు యడ్యూరప్ప. ఆపరేషన్ కమల్ సక్సెస్ కాకపోవడంతోఆయన ఒకింత డీలా పడినా మరో ఛాన్స్ వస్తుందన్న ఆశతో ఉన్నారు. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో [more]

Update: 2019-01-18 17:30 GMT

అయిననూ ప్రయత్నించవలె అంటున్నారు యడ్యూరప్ప. ఆపరేషన్ కమల్ సక్సెస్ కాకపోవడంతోఆయన ఒకింత డీలా పడినా మరో ఛాన్స్ వస్తుందన్న ఆశతో ఉన్నారు. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో జరుగుతున్న హైడ్రామాకు ఫుల్ స్టాప్ పడలేదని,కామా మాత్రమేనంటున్నారు బీజేపీ నేతలు. యడ్యూరప్ప కూడా అదే ధీమాను తమ సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం. మొత్తం 13 నుంచి పదిహేను మంది వరకూ కాంగ్రెస్, జేడీఎస్ లలో అసంతృప్త నేతలు తమవైపు వస్తారనుకున్నారు. ఈ సంఖ్యకు తగ్గట్లుగానే యడ్యూరప్పకు స్వయంగా పదమూడు మంది ఎమ్మెల్యేలు ఫోన్లో హామీ ఇవ్వడంతో ఆయన హడావిడిగా ఆపరేషన్ ను ప్రారంభించారని చెబుతున్నారు.

అందుకే తంటా….

తొలుత స్వతంత్ర సభ్యులు ఇద్దరు నగేష్, శంకర్ లు సంకీర్ణ సర్కార్ కు మద్దతు ఉపసంహరిస్తూ గవర్నర్ కు లేఖ ఇవ్వడమే తంటా తెచ్చిపెట్టిందంటున్నారు. ఈ సంఘటనతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమయింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి కుమారస్వామి, పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి వేణుగోపాల్, మంత్రి డీకే శివకుమార్ లు నేరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లారు. మంత్రి పదవి కావాలనుకుంటే తమ పదవులను త్యాగంచేసి ఇస్తామని వారికి హామీ ఇచ్చారు. రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని వారికి సూచించారు.

సిద్ధూ జోక్యంతోనే….

బీజేపీలోకి వెళదామనుకున్న వారిలో ఎక్కువమంది ఉత్తర కర్ణాటకకు చెందిన శాసనసభ్యులే ఉండటం విశేషం. వీరితో నేరుగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడి ఒప్పించగలిగారు. పదవులు శాశ్వతం కాదని, రాజీకీయాల్లో తొందరపాటు నిర్ణయాలు తగవని వారికి క్లాసులు పీకారు. వారి భవిష్యత్తుపై సిద్ధరామయ్య గట్టిగా హామీ ఇవ్వడంతో దాదాపు ఉత్తర కర్ణాటక కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు తమ ఆలోచనను విరమించుకున్నట్లు చెబుతున్నారు. మంత్రి పదవి కాకుండా మిగిలిన నియోజకవర్గ సమస్యలన్నీ తానే దగ్గరుండి పరిష్కరిస్తానని సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. వారు కూడా ఎక్కువగా నియోజకవర్గ సమస్యలనే ఏకరవు పెట్టడంతో ప్రతి పనీ తాను చేయిస్తానని హామీ ఇవ్వడంతో వారంతా కమలం పార్టీలో చేరికకు విముఖత చూపారన్నది టాక్.

సమయం కోసం….

అయితే కాంగ్రెస్ ప్రస్తుతానికి గట్టున పడినా త్వరలోనే కొందరు ఎమ్మెల్యేలు తమకు గూటికి వస్తారన్న ఆశలో ఇప్పటికీ యడ్యూరప్ప ఉండటం విశేషం. తమంతట తాముగా వస్తేనే పార్టీలోకి చేర్చుకుంటామని యడ్యూరప్ప పైకి చెబుతున్నప్పటికీ తన ప్రయత్నాలు ముగిసిపోలేదని సంకేతాలనయితే ఇచ్చారు. కుమారస్వామి నియంత ధోరణికి, ఏకపక్ష నిర్ణయాలను నిరసిస్తూనే అనేక మంది కాంగ్రెస్ నేతలు తమ గూటికి వస్తారంటున్నారని యడ్యూరప్ప మరోసారి వ్యాఖ్యలు చేశారు. దీంతో అధికార పార్టీకి ప్రతిరోజూ నిద్రలేకుండా చేస్తున్నారు యడ్యూరప్ప. మరో ఛాన్స్ రాకపోతుందా? అని ఆశతో ఎదురుచూస్తున్నారు యడ్డీ. అంటే ఆపరేషన్ కమల్ కు ఫుల్ స్టాప్ పడలేదన్నది స్పష్టంగా అర్థమవుతుంది.

Tags:    

Similar News