ఇద్దరిలో ఒకరికేనా?

కాంగ్రెస్ వైరస్ లాంటిదంటారు. ఆ పార్టీకి ఎన్నడూ నశించిపోయే గుణం లేదని రాజకీయ వర్గాల్లో అంటుంటారు. కష్ట సమయాల్లోనూ కాంగ్రెస్ పార్టీని ఆదుకునే వారు అనేక మంది [more]

Update: 2019-12-14 18:29 GMT

కాంగ్రెస్ వైరస్ లాంటిదంటారు. ఆ పార్టీకి ఎన్నడూ నశించిపోయే గుణం లేదని రాజకీయ వర్గాల్లో అంటుంటారు. కష్ట సమయాల్లోనూ కాంగ్రెస్ పార్టీని ఆదుకునే వారు అనేక మంది ముందుకు వస్తారు. కర్ణాటక కాంగ్రెస్ దాదాపు ఖతమయినట్లేనని ఆ పార్టీ నేతలు అంచనా వేసుకుంటున్నాయి. అందుకే తాము గెలిపించిన కాంగ్రెస్ ను కాదని రాజీనామా చేసి మరీ ఎమ్మెల్యేలు వెళ్లడంతోనే సంకీర్ణ సర్కార్ కూలిపోయిందన్న సంగతి అందరికీ తెలిసిందే.

మార్చాలనుకుంటున్న…..

కానీ ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం రెండే స్థానాల్లో విజయం సాధించింది. కర్ణాటకలో మొన్నటి వరకూ బలంగా ఉన్న కాంగ్రెస్ ఓటమి పాలు కావడంతో ఇక కాంగ్రెస్ పని అయిపోయిందనుకున్నారు. సీఎల్పీ పదవికి సిద్దరామయ్య, పీసీసీ చీఫ్ పదవికి దినేశ్ గుండూరావులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే దినేశ్ గుండూరావు రాజీనామాను అధిష్టానం ఆమోదించే అవకాశముంది.

సరైన నేత కోసం….

ఎందుకంటే పీసీపీ చీఫ్ పదవిలో ఉన్న దినేశ్ గుండూరావును మార్చాలని కొంతకాలంగా అధిష్టానం భావిస్తుంది. కొన్నాళ్ల క్రితమే ఈ ప్రతిపాదన వచ్చినా ఉప ఎన్నికలు ఉండటంతో దానిని వాయిదా వేశారు. అయితే ఇప్పడు ఆయనంతట ఆయనే రాజీనామా చేయడంతో దినేశ్ గుండూరావు రాజీనామాను కాంగ్రెస్ అధిష్టానం ఆమోదించనుంది. అయితే ఆయన స్థానంలో సరైన నేతను తేవాలన్నది కాంగ్రెస్ హైకమాండ్ యోచనగా ఉంది. దీనిపై స్పష్టమైన నివేదికను ఇవ్వాల్సిందిగా సోనియా గాంధీ పార్టీ కర్ణాటక ఇన్ ఛార్జి వేణుగోపాల్్ను కోరినట్లు తెలిసింది.

ఒక్కలిగ…లింగాయత్ లలో…..

ఇదిలా ఉండగా పీసీసీ చీఫ్ పదవి కోసం అనేక మంది పోటీ పడుతుండటం విశేషం. త్వరలోనే కేపీసీసీ చీఫ్ పదవిపై సోనియా నిర్ణయం తీసుకోనుండటంతో పార్టీ నేతలు ఇప్పటికే లాబీయింగ్ కోసం హస్తినకు ప్రయాణమయ్యారు. కర్ణాటకలో బలంగా ఉన్న ఒక్కలిగ, లింగాయత్ సామాజిక వర్గాలకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తున్నారు. డీకే శివకుమార్ ఒక్కలిగ సామాజికవర్గానికి చెందిన వారు. ఈయనతో పాటు లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన హెచ్.కె.పాటిల్ పేరు కూడా విన్పిస్తుంది. ఈయన పేరు సీఎల్పీ పదవికి విన్పిస్తున్నా ఆ పదవి నుంచి సిద్ధరామయ్యను తొలగించకూడదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఇలా అధికారంలో లేకపోయినా పదవుల కోసం పోటీ పడతారన్నది కాంగ్రెస్ లో సర్వసాధరణమని కర్ణాటక మరోసారి రుజువు చేస్తోంది.

Tags:    

Similar News