ఆనందంగా లేనట్లుందే

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప సులువుగానే బాధ్యతలను చేపట్టారు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అసమ్మతి, అసంతృప్తి యడ్యూరప్ప కు కలసి వచ్చాయి. విశ్వాస పరీక్షలోనూ యడ్యూరప్ప సులువుగానే గట్టెక్కగలిగారు. [more]

Update: 2019-07-30 17:30 GMT

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప సులువుగానే బాధ్యతలను చేపట్టారు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అసమ్మతి, అసంతృప్తి యడ్యూరప్ప కు కలసి వచ్చాయి. విశ్వాస పరీక్షలోనూ యడ్యూరప్ప సులువుగానే గట్టెక్కగలిగారు. ఈ విజయం యడ్యూరప్ప ది అనేదానికంటే ప్రత్యర్థి పార్టీల అసమర్థతే కారణమని చెప్పక తప్పదు. కాంగ్రెస్,జేడీఎస్ లు తమ ఎమ్మెల్యేల్లో గూడుకట్టుకుని ఉన్న అసమ్మతిని పసిగట్టినా వారిని బుజ్జగించలేకపోయింది. సర్దుబాటు చేసుకోలేకపోయింది. ఫలితంగా 17మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురయ్యారన్న సంతృప్తి మాత్రమే కాంగ్రెస్ కు మిగిలింది.

సులువుగా పదవి దక్కినా….

ఇక ముఖ్యమంత్రి యడ్యూరప్ప విషయానికొస్తే ఆయనకు కూడా పదవి చేపట్టినంత సులువుగా పాలన సాగించలేరన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ముందుగా మంత్రి వర్గ విస్తరణ యడ్యూరప్పకు సవాల్ గా మారనుంది. భారతీయ జనతా పార్టీలో ఇప్పటికే ఆశావహుల సంఖ్య ఎక్కువగా కనపడుతుంది. సీనియర్ నేత జగదీశ్ శెట్టర్ లాంటి నేతలు కూడా తనకు మంత్రి పదవి గ్యారంటీ అని బహిరంగంగా చెబుతున్నారు.

బీజేపీలో కుమ్ములాటలు….

ఇలా భారతీయ జనతా పార్టీలోనే మంత్రిపదవుల కోసం కొట్లాటలు స్టార్టయ్యాయి. కొందరికే మంత్రి పదవులు దక్కుతాయి. రాని వారిని బుజ్జగించాల్సిన బాధ్యత కూడా యడ్యూరప్ప పైనే ఉంది. పార్టీ కేంద్ర నాయకత్వం కొన్ని పేర్లు సిఫార్సులు చేసినప్పటికీ స్థానిక అవసరాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా యడ్యూరప్ప మంత్రి వర్గ విస్తరణ చేయాల్సి ఉంటుంది. దాదాపు యాభై మందికి పైగానే ఆశావహులు ఉన్నారు. ఇది ఆయనకు తలనొప్పిగా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

20కి మాత్రమే పరిమితమవుతారా…?

మరోవైపు యడ్యూరప్ప మంత్రి వర్గ విస్తరణ కొద్దిరోజుల్లో చేపట్టనున్నారు. 33 మంది వరకూ మంత్రి వర్గంలో చోటు కల్పించే అవకాశాలున్నప్పటికీ తొలి విడత అన్ని ఖాళీలను భర్తీ చేసే యోచనలో లేరు యడ్యూరప్ప. ఇందుకు ప్రధాన కారణం. తాను గద్దెనెక్కడానికి కారణమైన రెబల్ ఎమ్మెల్యేలకు కొన్ని పోస్టులు ఖాళీ గా ఉంచడమే. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు తొందరగా తేలి అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు అనుకూలంగా తీర్పు వస్తే వారిలో కొందరికి మంత్రిపదవులను ఖాయంగా ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసమే యడ్యూరప్ప మంత్రి వర్గ విస్తరణ 20లోపుకే పరిమితమయ్యే అవకాశముందని తెలుస్తోంది.

Tags:    

Similar News