బీజేపీకి బిగ్ ఇన్సిపిరేషనే కదా?

జగన్ ని ఏపీ బీజేపీ నేతలు మాత్రమే తిడతారు. బయటకు వెళ్తే మాత్రం ఆయన విధానాలకు కమలం పార్టీ నేతలే ఎర్ర తివాచీలు పరుస్తారు. ఇక జాతీయ [more]

Update: 2020-02-19 16:30 GMT

జగన్ ని ఏపీ బీజేపీ నేతలు మాత్రమే తిడతారు. బయటకు వెళ్తే మాత్రం ఆయన విధానాలకు కమలం పార్టీ నేతలే ఎర్ర తివాచీలు పరుస్తారు. ఇక జాతీయ స్థాయి నేతలైతే జగన్ చేసినది కరెక్ట్ అంటారు. మోడీ అయితే జగన్ కి నేనున్నాను గో ఎ హెడ్ అంటారు. మరి ఏపీలోని నాయకులకే, అందునా ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీ కండువా కప్పుకున్న నేతలకే జగన్ అంటే గుర్రుగా ఉంది. కారణమేంటో వారికే తెలియాలి. ఇదిలా ఉండగా జగన్ ఏపీలో అనుసరిస్తున్న విధానాలన్నీ పిచ్చి తుగ్లక్ చర్యలు అని కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారు గట్టిగానే కామెంట్స్ చేస్తున్నారు. కానీ జగన్ తీసుకున్న కొన్ని పాలనరమైన విధానాలు మాకు శిరోధార్యం అని అదే బీజేపీ ముఖ్యమంత్రులు అనుసరించడం విశేషం.

వికేంద్రీకరణకు ఓటు…

జగన్ మూడు రాజధానులు అంటున్నారు. దానికి అసెంబ్లీలో ఆమోదం వచ్చినా శాసనమండలిలో అడ్డుకట్ట పడింది. ఆ సంగతి అలా ఉంచితే పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం ఈ వికేంద్రీకరణ నిర్ణయాన్ని వేగంగా అమలుచేస్తోంది. ఏపీలో మాత్రం బీజేపీ నాయకులు జగన్ ది పిచ్చి చర్య అంటూ ఓ వైపు తిడుతూంటే కన్నడ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాత్రం ఏ రాజకీయ గడబిడ లేకుండా వికేంద్రీకరణ పనులు పూర్తి చేస్తున్నారు. ఓ విధంగా జగన్ స్పూర్తితో ఆయన ఈ వికేంద్రీకరణకు నడుం బిగించారనుకోవాలి

జిల్లాలకు తరలింపు …

కన్నడ రాజధాని బెంగుళూరు నుంచి పది కీలకమైన శాఖలకు చెందిన కమిషన్లను, మండళ్ళను వివిధ జిల్లాలకు తరలించడానికి యడ్యూరప్ప పచ్చ జెండా ఊపేశారు. వాటిని వివిధ జిల్లా కేంద్రాలలో నెలకొల్పడానికి రంగం సిధ్ధం అవుతోంది. ఒక్క నోటిఫికేషన్ తోనే యడ్యూరప్ప మొత్తం కధ నడిపించడం విశేషం. క‌ర్ణాట‌క‌లోని బెళ‌గావి, క‌ల‌బుర‌గి, ధార్వాడ త‌దిత‌ర జిల్లాల్లో క‌మిష‌న‌ర్ కార్యాల‌యాల‌ను, మండ‌ళ్లను ఏర్పాటు చేసేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఉత్తర కర్ణాటకలో?

అభివృధ్ధిని అన్ని చోట్లా విస్తరించాలన్న ఉద్దేశ్యంలో ఉత్తర క‌ర్ణాటకలోని అనేక జిల్లాలలో ఇపుడు ఈ శాఖలు ఏర్పాటు చేయనున్నారు. ఇలా అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగా తాజాగా కృష్ణా భాగ్య జ‌ల‌మండ‌లి ఆల‌మ‌ట్టిలో ఏర్పాటు కానుంది. అలాగే దావ‌ణ‌గెరెలో క‌ర్ణాట‌క నీరావ‌రి మండ‌లిని ఏర్పాటు చేస్తారని భోగట్టా. మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్‌, లోకాయుక్త‌, ఉప‌లోకాయుక్త కార్యాల‌యాలు ధార్వాడ‌లో ఏర్పాటు చేయ‌నున్నారు. అలాగే రాష్ట్ర స‌మాచార క‌మిష‌నర్ కార్యాల‌యాన్ని క‌లుబురిలో నెల‌కొల్పనున్నారు. దీని వల్ల అన్ని ప్రాంతాల ప్రజలకు ప్రగతి ఫలాలు అందుతాయని యడ్యూరప్ప భావిస్తున్నారుట. మరి అదే పని జగన్ చేస్తే మాత్రం ఏపీ నేతలకు పిచ్చి తుగ్లక్ చర్యగా కనిపిస్తోంది. అమరావతిలోనే అన్నీ ఉండాలని తెగ మారాం చేస్తున్నారు

ఆయనా కూడా….

ఇక జగన్ వికేంద్రీకరణ మంత్రాన్ని మరో రాష్ట్రం జార్ఖండ్ లో అమలు చేస్తామని అక్కడి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అంటున్నారు. ఆయన ఏకంగా అయిదు రాజధానులతో అభివృధ్ధిని మూల ప్రాంతాలకు తీసుకెళ్తానని అంటున్నారు. ఆయన కూడా బీజేపీ నేతల దృష్టిలో పిచ్చి తుగ్లక్ గా చెప్పుకోవాలేమో. ఇక ప్రైవేట్ విద్యుత్ ఒప్పందాలను జగన్ సమీక్ష జరిపితే ఓ స్థాయిలో గగ్గోలు పెట్టిన బీజేపీ పెద్దలు తమ సొంత రష్ట్రం యూపీలో బీజేపీ ముఖ్యమంత్రి అదిత్యనాధ్ యోగి అదే పని చేస్తే మాత్రం కిక్కురుమన‌డంలేదు. మొత్తానికి రాజకీయంగా ఏపీ బీజేపీ నేతలు విభేదిస్తున్నా జగన్ మంచి నిర్ణయాలు చేపడుతున్నారు కాబట్టే మిగిలిన రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారనుకోవాలేమో.

Tags:    

Similar News