ధరిత్రి సిగలో..చరిత్ర పుటలో..!

Update: 2018-05-06 15:30 GMT

తమతోపాటు చరిత్రను సృష్టించేవారు కొందరుంటారు. తాము చనిపోయిన తర్వాత చరిత్రను తిరగరాసేవారు అత్యంత అరుదు. వారే యుగపురుషులు. సర్వకాలసర్వావస్థలకు వర్తించే సార్వజనీన సిద్ధాంతాలను ప్రతిపాదిస్తారు. కారల్ మార్క్స్ ఆ కోవకు చెందినవాడే. తన యోచన ప్రపంచభావనగా, తన పేరే సిద్దాంతంగా మానవస్వేచ్ఛకు మరోరూపమై నిలిచిన వ్యక్తి మార్క్స్. ప్రజలే చరిత్ర చోదకులంటూ ఉద్ఘాటించిన ఉక్కుపిండం. పీడిత తాడిత శ్రామిక జనుల కోసం విముక్తి గీతం ఆలాపించిన భావ విప్లవయోధుడు. తాను జీవించి ఉన్న కాలంలో సాధించిన విజయాలు తక్కువే. కానీ ఆ తర్వాత కాలంలో పదండి ముందుకు పదండి తోసుకు అంటూ ప్రపంచగమనాన్ని మార్చేసింది ఆయన సైద్దాంతిక బలం. ఆయన ద్విశతాబ్ది పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటోంది ప్రపంచం.

కాలానికి కాగడా...

కారల్ మార్క్స్ ను కాలగతిని పట్టి చూపిన వ్యక్తిగా పేర్కొంటారు. 19వ శతాబ్దం తొలి అర్ధభాగం నాటికి ఉన్న సామాజిక పరిస్థితులపై అధ్యయనం చేసి భవిష్యత్తుకు ఉపకరించే ఒక చారిత్రక కోణాన్ని ఆయన ఆవిష్కరించగలిగారు. ఒక రకంగా చెప్పాలంటే ఆధునిక కాలజ్ఞాని . కానీ ఆయన కాలజ్ఞానం ఆలోచనల మీద ఆధారపడింది కాదు, ఆచరణ మీద ప్రేరేపితమైనది. ఉత్పత్తి మీద ఆధిపత్యం సాధించిన సంపన్నవర్గాలు నిరంతరం సంపదను పెంచుకుంటూ పోతారు. మిగిలిన వారికి శ్రమే పెట్టుబడిగా మారుతుంది. కాయకష్టం చేస్తేనే కడుపు నిండుతుంది. ఈ దోపిడి కి చరమగీతం పాడి సంపద సమ పంపిణీ జరగాలంటే శ్రామిక విప్లవం రావాలనేదే మార్క్స్ మూల సూత్రం. ఆయన జీవించి ఉన్న కాలంలో ఇది పుస్తకాలకే పరిమితమైంది. అక్కడక్కడా ప్రకంపనలు రేకెత్తించగలిగినా విప్లవాలను సాఫల్యం చేయలేకపోయింది. 1917లో సోవియట్ విప్లవం మార్క్సిజానికి ఆచరణాత్మక గౌరవాన్ని తెచ్చిపెట్టింది. వర్గ విభజన, దోపిడీ, శ్రమశక్తికి సరైన గుర్తింపు లేకపోవడం, రాజ్యాధికారం, పెట్టుబడి దారీ విధానం వంటి అనేకాంశాల్లో ప్రజల్లో అవగాహన పెరగడానికి మార్క్సిజం దోహదం చేసింది. మొదటి ప్రపంచయుద్దం, రెండో ప్రపంచయుద్దం చారిత్రక పరిణామాల్లో రాజకీయ భౌగోళిక ముఖచిత్రం మారడానికి బలమైన పునాదులు వేసింది . తూర్పు, ఐరోపా దేశాల నుంచి చైనా, క్యూబాల వరకూ భావజాలం విస్తరించడం , రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం ఒక బలమైన మార్పునకు దోహదం చేసింది. రాజకీయ చిత్రపటంలో 20 శతాబ్దం మధ్య భాగంలో ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థగా ప్రపంచనీరాజనాలు అందుకొంది. కమ్యూనిస్టు ప్రణాళిక, పెట్టుబడి వంటి అధ్యయనాత్మక కోణాలతో మార్క్స్, ఏంగెల్స్ వంటివారు వేసిన పునాదులే ఇందుకు కారణం.

సంపద ....సమకాలీనం...

మార్క్సిజం నేటి కాలానికి తగినది కాదు. కాలం చెల్లింది. సందర్బరహితం అనే వారు చాలామందే ఉన్నారు. కానీ తార్కిక నిరూపణలతో అది అసత్యం. నేటి కాలానికీ అనువర్తిస్తుందని చెప్పేందుకు తగిన ప్రాతిపదిక సిద్దాంతాల్లోనే దాగి ఉంది. ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యం కలిగిన వారు సంపదను పెంచుకుంటూ మిగిలిన వారి శ్రమను దోపిడీ చేస్తున్నారనేది మౌలిక అంశం. 2017లో ఆక్స్ ఫామ్ సర్వే ప్రపంచంలోని 82 శాతం ఉత్పత్తిపై 1 శాతం ప్రజలు అధికారం కలిగి ఉన్నారని నిర్ద్వంద్వంగా తేల్చింది. మనభారత దేశం విషయానికొస్తే అంబానీలు, అదానీలు ఏటేటా సంపదలో ఎలా పెరిగిపోతున్నారో అందరికీ తెలిసిందే. ఇక్కడ కూడా 65 శాతం సంపద 17 శాతం ప్రజల అధీనంలోనే ఉంది. వీటన్నిటిని అన్వయించుకుని చూస్తే మార్క్స్ సిద్దాంతాలు నేటికీ సత్యప్రమాణాలన్న అంశం స్పష్టంగానే తేటతెల్లమవుతోంది. అయితే గతంలో పారిశ్రామికీకరణ నేపథ్యంలో ఉత్పత్తి అన్న పదమే వినిపించేది. ఇప్పుడు రూపు మారి దానికి సేవల రంగం కూడా తోడైంది. పేరు మారిందే తప్ప ఇందులోనూ బడా కార్పొరేట్లే శ్రమదోపిడీ చేస్తూ సంపదను పోగేసుకుంటున్నారు. అందుకే మార్క్స్ మథనం నేటికీ నూటికి నూరుపాళ్ల నిజం. మార్క్సిజం అంటే పరిస్థితుల విశ్లేషణ అంటాడు లెనిన్ ఒకానొక సందర్బంలో. మారుతున్న పరిస్థితులను మదింపు చేసుకుంటూ సిద్దాంతాన్ని అన్వయించుకోవడమే అది.

కమ్యూనిజం కష్టం...ప్రజలకే పట్టం

నిజానికి మార్క్స్ ప్రపంచమంతా కమ్యూనిజం కమ్ముకోవాలని కలలు కన్నాడు. ఇది దుర్లభమేనని చెప్పాలి. పెట్టుబడి దారీ విధానం వ్యాపార థృక్పథం తో కూడినది. చేసిన పని , లాభాలు దానికి ప్రధానం. సోషలిజం సామ్యవాద సమాజం. అందరూ బాగుండాలి. సమానపనికి సమానవేతనం. సొంతఆస్తి లేని సంపద పంపిణీ వంటివి దీనికి ఆదర్శ సూత్రాలు. బలమైన కమ్యూనిస్టు దేశంగా పేరు పొందిన చైనా కూడా పేరుకే తప్ప ప్రభుత్వ పెట్టుబడి దారీ విధానాన్ని అమలు చేస్తోందనే విమర్శ ఉంది. చైనా సర్కారు చేస్తున్న ప్రకటనల్లోనే సోషలిజం అమలు చేసే దశలో ఉన్నామంటూ పేర్కొంటారు. సోషలిజం కంటే ఉత్క్రుష్టమైన దశ కమ్యూనిజం. సోషలిజం అందరినీ సమానంగా చూస్తుంది. కానీ కమ్యూనిజం వ్యక్తులుగా, వ్యవస్థగా కమ్యూనిటీ అవసరాలను గుర్తించాలంటుంది. వాటిని నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అంటుంది. ఉదాహరణకు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పనిచేస్తే అతనికి న్యాయబద్దంగా ఎంతటి వేతనం రావాలో అంత చెల్లించడమే సోషలిజం. అయితే కమ్యూనిజంలో అతని కుటుంబంలో మిగిలిన నలుగురు పనిచేయలేకపోయినా వారి అవసరాలను సైతం గుర్తించాలి. వాటిని తీర్చాలి. పనిచేసిన వ్యక్తితో సమానంగా అంతే స్థాయిలో వారి అవసరాలనూ అడ్రస్ చేయాల్సిన బాధ్యత సర్కారు తీసుకోవాలంటుంది. ఇంతటి ఉదాత్తమైన ఆదర్శ భావాలు ఆచరణ సాధ్యం కాకపోవడం వల్లే కమ్యూనిజాన్ని అమలు చేయగలమని కరడుగట్టిన కమ్యూనిస్టులే చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రపంచం పెట్టుబడి దారీ విధానాలతో విసిగిపోయి కొత్తదనం కోసం తపిస్తోంది. అందుకే ఇటీవలికాలంలో కమ్యూనిజం, సోషలిజంపై అధ్యయనాలు ఊపందుకున్నాయి. మాంద్య పరిస్థితుల నివారణకు మరో ప్రత్యామ్నాయ మార్గం కమ్యూనిజంలో దొరుకుతుందేమోననే అన్వేషణ మొదలైంది. ‘సిద్ధాంతం లేని ఆచరణ గుడ్డిది. ఆచరణ లేని సిద్దాంతం కుంటిది.’ అన్న మార్క్స్ మాటలు మాత్రం సర్వకాల సర్వావస్థలకు వర్తించే సార్వజనీన సత్యాలు...!

 

ఎడిటోరియల్ డెస్క్

Similar News