మంత్రి రేసులో కరణమే ముందు ?

విశాఖ జిల్లాలో ఏకైక మంత్రిగా అవంతి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన కొత్తల్లో తడబడినా తన రూట్ ఏదో తెలుసుకున్నారు. దాంతో ఆయన మీద హై కమాండ్ కరుణ [more]

Update: 2020-08-28 13:30 GMT

విశాఖ జిల్లాలో ఏకైక మంత్రిగా అవంతి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన కొత్తల్లో తడబడినా తన రూట్ ఏదో తెలుసుకున్నారు. దాంతో ఆయన మీద హై కమాండ్ కరుణ ఇప్పటికైతే బాగానే ఉంది. టూరిజం మినిస్టర్ గా ఇపుడిపుడే అవంతి పని ప్రారభించారు. విశాఖ రాజధాని కావడంతో పెద్ద ఎత్తున పర్యాటక‌ రంగం అభివృధ్ధి చేయాలన్నది ప్రణాళిక. దానికి తగినట్లుగా యాక్షన్ ప్లాన్ తో అవంతి ముందుకు అడుగులేస్తున్నారు. విశాఖ ఓబెరాయ్ హొటల్స్ తరహాలో స్టార్ హొటల్స్, బీచ్ రిసార్ట్స్, ఎంటైర్టెన్మెంట్ స్పాట్స్, అమ్యూజ్మెంట్స్ పార్క్స్ ఇలా అవంతి శ్రీనివాస్ ప్రతిపాదనలు సిధ్ధం చేశారు.

ఆశీస్సులేనా ?

ఇవన్నీ పక్కన పెడితే రాజకీయంగా ఇపుడిపుడే అవంతి శ్రీనివాస్ బలపడుతున్నారు. ఆయన మొదట్లో విజయసాయిరెడ్డితో కొంత ఎడం పాటించినా ఇపుడు ఇద్దరూ ఒక్కటి అయ్యారని ప్రచారంలో ఉంది. దాంతో ఆయనకు జగన్ ఆశీస్సులు కూడా బాగానే ఉన్నాయని అంటున్నారు. తొలి రెండున్నరేళ్ళ తరువాత మంత్రులను మారుస్తారని ప్రచారం ఉన్నా విశాఖ సిటీకి సంబంధించి చూస్తే అవంతి శ్రీనివాస్ ఒక్కరే ఉన్నారు. పైగా రేపటి రోజున కొత్త జిల్లాలు రావడంతో అక్కడ నుంచి మరో మంత్రి ఉంటారు. ఈ పరిణామాలతో సేఫ్ జోన్లోనే అవంతి శ్రీనివాస్ ఉన్నట్లుగా అనుకోవాలి. ఆయన అయిదేళ్ల పాటు మంత్రిగా ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు.

గుడివాడ అలా……

ఆ మధ్య వరకూ విజయసాయిరెడ్డి శిష్యుడిగా ఉన్న గుడివాడ అమరనాధ్ తరువాత సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ శిబిరంలో తేలారు. దాంతో పాటు టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావుని వైసీపీలోకి తీసుకురావాలని కూడా బొత్స చేసిన యత్నాలకు గుడివాడ మద్దతు ఇచ్చారు. అవంతి శ్రీనివాస్ కి వ్యతిరేకంగా పావులు కదిపాను అనుకున్నారు కానీ విజయసాయిరెడ్డికే యాంటీ అవుతాను అని గుడివాడ భావించలేదు. ఈ పరిణామాలతో ఇపుడు గుడివాడ గోల్డెన్ చాన్స్ మిస్ చేసుకున్నారు అంటున్నారు. రెండున్నరేళ్ల తరువాత మంత్రి వర్గ విస్తరణలో రూరల్ జిల్లా నుంచి గుడివాడ పేరు కచ్చితంగా ఉంటుందని నిన్నటిదాకా అనుకున్నారు కానీ ఇపుడు ఆ ప్లేస్ లోకి చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ దూసుకు వచ్చేశారు.

గుడ్ లుక్స్ లో…..

సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న కరణం ధర్మశ్రీ కూడా బలమైన కాపు సామాజికవర్గానికే చెందిన వారు. పైగా ఆయన వైఎస్సార్ దీవెనలతో ఎమ్మెల్యే అయ్యారు. జగన్ అంటే వీర విధేయత చూపిస్తారు. విజయసాయిరెడ్డితో కూడా సాన్నిహిత్యం నెరపుతున్నారు. మరో వైపు అవంతి శ్రీనివాస్ తో కూడా బాగా ఉంటూ జిల్లాలో వైసీపీ బలమైన వాణిని వినిపిస్తూ వస్తున్నారు. ఈ సమీకరణల నేపధ్యంలో కరణం ధర్మశ్రీకే వచ్చే ఏడాది మంత్రి యోగం ఉందని తాజాగా టాక్. మొత్తం మీద చూసుకుంటే గుడివాడ చేసిన పొరపాట్లు కరణానికి రాచబాటగా మారుతునాయని అంటున్నారు.

Tags:    

Similar News