కొంచెం వెయిట్ చేసి చెబుతా

మరో టీడీపీ ఎమ్మెల్యే పక్క చూపులు చూస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన కరణం బలరాం ఊగిసలాట మధ్య ఉన్నారు. వైసీపీ నుంచి కరణం బలరాంకు బంపర్ ఆఫర్ [more]

Update: 2019-11-22 06:30 GMT

మరో టీడీపీ ఎమ్మెల్యే పక్క చూపులు చూస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన కరణం బలరాం ఊగిసలాట మధ్య ఉన్నారు. వైసీపీ నుంచి కరణం బలరాంకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలిసింది. కరణం బలరాం రాజకీయంగా రిటైర్ అయి తన కుమారుడు వెంకటేష్ ను ఎమ్మెల్యేను చేద్దామనుకున్నారు. కానీ 2014 ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గం నుంచి కరణం వెంకటేష్ పోటీ చేసినా అది సాధ్యం కాలేదు. 2019 ఎన్నికల్లో అద్దంకి టిక్కెట్ గొట్టి పాటి రవికుమార్ కు ఇవ్వడంతో కరణం బలరాం స్వయంగా చీరాల నుంచి పోటీ చేయాల్సి వచ్చింది.

తప్పుకోవాలనుకుంటున్న…..

రాజకీయాల నుంచి తాను వైదొలగాలనుకున్న సమయంలో మరోసారి కరణం బలరాం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే కుమారుడి భవిష్యత్ పైనే ఆయన ఆందోళన. గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో ఉంటే వచ్చే ఎన్నికల్లోనూ కరణం వెంకటేష్ కు అద్దంకి టిక్కెట్ టీడీపీలో సాధ్యం కాదు. దీంతో కరణం వెంకటేష్ రాజకీయ భవిష్యత్ కోసం వైసీపీలోకి వెళ్లాలని కరణం బలరాం గట్టిగానే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కీలక చర్చలు….

ఇటీవల మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి మనవడి పుట్టిన రోజు వేడుకలకు హాజరైన కరణం బలరాం ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మంత్రి బాలినేనిలతో దాదాపు గంట సేపు ఏకాంతంగా సమావేశమయ్యారని చెబుతున్నారు. ఈ సందర్భంగా కరణం వెంకటేష్ కు ఒంగోలు మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇస్తామని కూడా వైసీపీ నుంచి ఆఫర్ ఇచ్చారని సమాచారం. ఒంగోలు నియోజకవర్గంలో తాను మరోసారి గెలవాలన్నా బలమైన కమ్మ సామాజికవర్గానికి చెందిన కరణం కుటుంబం తమకు అండగా ఉండాలని బాలినేని సయితం భావిస్తున్నారు.

కరణం వెంకటేష్ కు కీలక పదవి?

తొలుత ఒంగోలు మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇచ్చినా వచ్చే ఎన్నికల నాటికి కరణం వెంకటేష్ అద్దంకి నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి పోటీ చేసేందుకు తాము సహకరిస్తామని కూడా బాలినేని, మాగుంటలు కరణం బలరాంకు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే తాను ఆలోచించుకునేందుకు కొంత సమయం కావాలని కోరినట్లు తెలిసింది. టీడీపీలో జరుగుతున్న పరిణామలను కొంతకాలం గమనించిన తర్వాత వైసీపీలో చేరికపై నిర్ణయం తీసుకోవాలని కరణం బలరాం భావిస్తున్నారని తెలిసింది. మొత్తం మీద మరో టీడీపీ ఎమ్మెల్యే ఊగిసలాటలో ఉన్నా కొంతకాలం ఆగాక మారతారన్నది ప్రకాశం జిల్లాలో విన్పిస్తున్న టాక్.

Tags:    

Similar News