`కాపు` దూకుడు వెనుక రీజ‌న్ ఇదేనా..?

అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం వైసీపీలో ఏం జ‌రుగుతోంది ? ఇక్కడ పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంది ? వైసీపీ నేత‌ల్లో ఇదే చ‌ర్చ సాగు తోంది. దీనికి [more]

Update: 2020-03-30 13:30 GMT

అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం వైసీపీలో ఏం జ‌రుగుతోంది ? ఇక్కడ పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంది ? వైసీపీ నేత‌ల్లో ఇదే చ‌ర్చ సాగు తోంది. దీనికి ప్రధాన కార‌ణం..గ‌త ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి వైసీపీ త‌ర‌ఫున గెలిచిన కాపు రామచంద్రారెడ్డి తీవ్ర వివాదాస్పదం కావ‌డ‌మే. ఇప్పుడు ఆయ‌న‌పై చ‌ర్యల‌కు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ కూడా దృష్టి పెట్టింది. ఇటీవ‌ల స్థానిక ఎన్నిక‌ల‌ను వాయిదా వేస్తూ.. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ర‌మేశ్‌కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఆ త‌ర్వాత తీరిగ్గా స్పందించిన కాపు.. ర‌మేశ్‌ను వెధ‌వ అంటూ సంబోధించి మీడియాలో సంచ‌ల‌నం సృష్టించారు. నేరుగా త‌న‌ను దూషించిన ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసేందుకు క‌మిష‌న‌ర్ ర‌మేశ్ కుమార్ చ‌ర్యలు తీసుకుంటున్నారు.

ఏకగ్రీవం చేసుకోవాలని…..

ఇదే క‌నుక జ‌రిగి, ర‌మేశ్‌కుమార్ పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తే.. కాపు రామచంద్రారెడ్డిపై చ‌ర్య‌లు త‌ప్పవు. నిజానికి ఎంత వివాదాస్పద నాయ‌కులై నా వ్యక్తిగ‌త దూష‌ణ‌లు వ‌ద్దంటూ జ‌గ‌న్ ఆది నుంచి చెబుతున్నారు. అయితే, దీనికి విరుద్ధంగా కాపు ఒక్కసారిగా విజృంభించ డంపై చర్చ జ‌రుగుతోంది. కాపు ఇలా రెచ్చిపోవ‌డం వెనుక రెండు ప్రధాన కార‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాయ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గంలో మెజారిటీ స్థానాల‌ను ఏక‌గ్రీవం చేసుకునేందుకు కాపు రామచంద్రారెడ్డి ప్రయ‌త్నించారు.

జగన్ దృష్టిలో పడాలని……

త‌ద్వారా జ‌గ‌న్ దృష్టిలో ప‌డి వ‌చ్చే మంత్రి వ‌ర్గ విస్తర‌ణ‌లో చోటు సంపాయించాల‌ని అనుకున్నారు. అయితే ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌డంతో ఇది సాధ్యం కాలేద‌నే అక్కసు కాపు రామచంద్రారెడ్డిని వెంటాడుతోంది. మ‌రోప‌క్క, సొంత పార్టీలోనే కొంద‌రు రెడ్డి నేత‌ల‌కు, కాపు రామ‌చంద్రారెడ్డికి మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. జ‌గ‌న్ కు ఎంత స‌న్నిహితంగా ఉన్నప్పటికీ వీరు ఎంట్రీ కావ‌డంతో ఇప్పుడు కాపును ప‌క్కన‌పెట్టే చర్యలు తీసుకుంటార‌నే భావ‌న వ్యక్తమ‌వుతోంది. ఈ క్రమంలోనే టీడీపీకి ఇక్కడ బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న కాల్వ శ్రీనివాసుల‌ను పార్టీలో చేర్చుకునేందుకు యుద్ధప్రాతిప‌దిక‌న వ్యూహం ప్రకారం ప‌నులు జ‌రుగుతున్నాయి.

పక్కన పెడుతున్నారనేనా?

ఇటీవ‌ల స్థానిక ఎన్నిక‌ల నామినేష‌న్ సంద‌ర్భంగా జ‌రిగిన ఓ వివాదం లో నేరుగా కాల్వపైకి చెయ్యి విసిరేందుకు కాపు రామచంద్రారెడ్డి ప్రయ‌త్నించారు. దీనిని సొంత పార్టీ నేత‌లే త‌ప్పు ప‌డుతున్నారు. భౌతిక దాడుల‌కు ప్రయ‌త్నించ‌డం స‌రికాదంటూ.. జిల్లా ఇంచార్జ్ మంత్రి ఫోన్ చేసి మ‌రీ కాపును హెచ్చరించిన‌ట్టు తెలిసింది. ఈ ప‌రిణామాల‌తో త‌న‌ను ప‌క్కన పెడుతున్నార‌నే వాద‌న బ‌లంగా న‌మ్ముతున్న కాపు.. త‌న‌దూకుడు పెంచార‌ని అంటున్నారు. మ‌రి ఈ దూకుడు ఆయ‌న‌కు మేలు చేస్తుందో లేక‌.. ప‌క్కన కూర్చోబెడుతుందో చూడాలి. ఏదేమైనా.. కాపు ప్రభావం త‌గ్గించేందుకు రెడ్డి వ‌ర్గం ప్రయ‌త్నిస్తున్న మాట వాస్తవ‌మ‌ని అంటున్నారు వైసీపీలోని సీనియ‌ర్లు.

Tags:    

Similar News