కాపులు రగిలి పోతున్నారు..?

కాపులు అంటే కాపు కాసేవారని రాజకీయ జీవులు తమ పొలిటికల్ డిక్షనరీలో ఎపుడో రాసేసుకున్నారు. అయితే దన్నుగా నిలిచి కాపు కాసే వారే రివర్స్ అయితే బొమ్మ [more]

Update: 2020-11-21 00:30 GMT

కాపులు అంటే కాపు కాసేవారని రాజకీయ జీవులు తమ పొలిటికల్ డిక్షనరీలో ఎపుడో రాసేసుకున్నారు. అయితే దన్నుగా నిలిచి కాపు కాసే వారే రివర్స్ అయితే బొమ్మ తిరగబడుతుంది. కాపులను తక్కువగా చేసి చూస్తే సీన్ మొత్తం కాలుతుంది. అది తెలుగు సినీ వల్లభుడు, తెలుగు రాజకీయాలలో సంచలనాల ఘనాపాటి అన్న నందమూరికే తప్పింది కాదు. 1989 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కాపులే అసలైన కారణం. అంతవరకూ కాపులు సంఘటితం అయిన చరిత్ర లేదు. వంగవీటి రంగా దారుణ హత్య తరువాత కాపులు బలమైన ఓటు బ్యాంక్ గా ఏపీ రాజకీయాల్లో మారారు. నేతల రాతలను తిరగరాశారు.

నాడు రచ్చ చేసి…..

రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకూ నడచిన రాజకీయమంతా కాపులతోనే ముడిపడి ఉంది. కాపులను బీసీలో చేరుస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీని పట్టుకుని ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం అయిదేళ్ళూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు ఆ దెబ్బకు బాబు చాణక్య రాజకీయం కూడా చతికిలపడిపోయింది. అదే కాపులను నమ్ముకుని జనసేనాని పవన్ కూడా 2019 ఎన్నికల్లో సొంతగా పోటీకి దిగారంటే నాడు కాపుల హవా గురించి వేరే చెప్పనక్కరలేదు.

బీసీ హోరున పడి…..

ఇక కాపుల రాజకీయాన్ని మలుపు తిప్పిన నేతగా జగన్ ని చెప్పుకోవాలి. 2019 ఎన్నికలను కాపులు శాసిస్తారు అన్న భ్రమలను పూర్తిగా తొలగించి పై ఎత్తు వేసిన జగన్ బీసీల మంత్రం జపించారు. టీడీపీని అలా రెండిందాలా దెబ్బ తీశారు. కాపులనే కేంద్రీకృతం చేసుకుని ఏపీ రాజకీయాలు చేయాలనుకున్న కొన్ని పార్టీలకు, నాయకులకు కూడా జగన్ అలా ఝలక్ ఇచ్చేశారు. ఇక జగన్ ఊహించిన విధంగానే కాపు ఓట్లు బాగా చీలి ఎవరికి దక్కాల్సింది వారికి దక్కింది. మరో వైపు చూస్తే బీసీలను వైసీపీ వైపుగా లాగడం ద్వారా జగన్ సేఫ్ జోన్ లో నిలవడమే కాదు, బంపర్ విక్టరీ కొట్టారు. దెబ్బకు బాబు కూడా కాపు కార్డ్ వదిలేసి బీసీలకు పెద్ద పీట వేస్తే కాపు నాయకుడు ముద్రగడ ఏకంగా ఉద్యమం నుంచే తప్పుకున్నారు. ఇపుడు కాపులు ఏపీలో ప్రభావవంతమైన రాజకీయాలు చేయాలని మళ్ళీ చూస్తున్నారు.

వత్తిడి పెంచుతారా…?

టీడీపీలో చూసుకుంటే బీసీలకే పెద్ద పదవులు దక్కాయి. కాపు నేత కళా వెంకటరావు నుంచి లాగేసి మరీ బీసీ నేత అచ్చెన్నాయుడుకు పట్టం కట్టారు. మరో వైపు కాపు నేత గంటా శ్రీనివాసరావుని పక్కన పెట్టారు. ఇక వైసీపీలో తీసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాపులు రగులుతున్నారు. తమ అధికారాలు హరించివేస్తున్నారని భగ్గుమంటున్నారు. వారి వెనక బలమైన కాపు పెద్దలు ఉన్నారని అంటున్నారు. మొత్తానికి రాజకీయ జంక్షన్ లో ఇపుడు కాపులు ఉన్నారు. వారిని చేరదీసి ఏ పార్టీ అక్కున చేర్చుకుంటుందో చూడాలి. ఇప్పటికైతే ఏపీలో మూడవ ప్రత్యామ్యాయం అని ముందుకు వచ్చిన జనసేన, బీజేపీ కాపులను దువ్వుతున్నాయి. మరి ప్రధాన పార్టీలలో రగులుతున్న కాపు నేతలు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే అపుడు ఏపీ రాజకీయాలు రసకందాయంలో పడక తప్పదు.

Tags:    

Similar News