కాపుల రాజకీయ కల

రాష్ట్రంలో కమ్మ, రెడ్డి తర్వాత తమదే అధికారం అని కాపులు గత మూడు, నాలుగు దశాబ్దాలుగా కలలు కంటున్నారు. కొంతమేర ప్రయత్నాలు కూడా చేశారు. అయితే అవి [more]

Update: 2020-01-17 13:30 GMT

రాష్ట్రంలో కమ్మ, రెడ్డి తర్వాత తమదే అధికారం అని కాపులు గత మూడు, నాలుగు దశాబ్దాలుగా కలలు కంటున్నారు. కొంతమేర ప్రయత్నాలు కూడా చేశారు. అయితే అవి ప్రతిసారీ కలలుగానే మిగిలిపోతున్నాయి. రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా ఆ రెండు సామజిక వర్గాల తర్వాత స్థానంలో ఉన్న అత్యధిక జనాభా కలిగిన సామాజిక సమూహం కాపులే. కానీ, గత వైఫల్యాలను విశ్లేషించి, ప్రస్తుత పరిణామాలు పరిశీలించి చూస్తుంటే అధికారం అందిపుచ్చుకోవడంలో కాపులు విఫలం అవుతూనే ఉన్నారని అర్ధం అవుతోంది. ఇప్పుడు జరుగుతోంది చివరి ప్రయత్నం.

1980వ దశకంలోనే…..

1980దశకంలో “కాపునాడు” ఏర్పాటయింది. విజయవాడలో హింసా రాజకీయాలు తీవ్రస్థాయిలో ఉన్నకాలంలో రాష్ట్రంలో “తెలుగుదేశం పార్టీ” ఆవిర్భవించడం, దేవినేని నెహ్రూ తెలుగుదేశంలో చేరడంతో ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న వంగవీటి రంగాపై పోలీసు వత్తిడి పెరిగింది. టిడిపి అధికారంలోకి రావడం, టిడిపిలో దేవినేని నెహ్రూ ఉండడంతో రంగా కదలికలపై నిఘా పెరిగి, పోలీసు వత్తిడి కూడా తోడయ్యింది. దీంతో ప్రత్యామ్నాయం కోసం రంగా అనుచరులు, సలహాదారులు (సలహాదారుల్లో బ్రాహ్మణులు, ముస్లింలు కీలక పాత్ర పోషించారు) కాస్త తీవ్రంగా, లోతుగా ఆలోచించి రంగాను రక్షించుకోవడమే లక్ష్యంగా “కాపునాడు”ను ప్రతిపాదించారు. ప్రముఖ కాపునేత మిర్యాల వెంకట్రావు అధ్యక్షుడుగా “కాపునాడు” ప్రారంభం అయింది. ఒక దశలో రంగాను అరెస్టు చేయడం, ఆ తర్వాత వరంగల్ జైలుకు తరలించాలని పోలీసులు ప్రయత్నించడంతో, ఆ దారిలోనే “ఎన్ కౌంటర్” చేస్తారని భయపడ్డ రంగా అభిమానులు, రంగాను కాపాడుకునే క్రమంలో భాగంగా “కాపునాడు” పేరుతో ఒక మహాసభ తలపెట్టారు. పిళ్ళా వెంకటేశ్వర రావు ఆహ్వానసంఘం అధ్యక్షుడిగా కాపునాడు మహాసభ నిర్వహించారు. ఈ కాపునాడుకు కృష్ణా జిల్లాలోని కాపు పెద్దలు పేర్ని కృష్ణ మూర్తి, బూరగడ్డ నిరంజన రావు, సామినేని విశ్వనాధం, పండలనేని శ్రీమన్నారాయణ (చాలా పేర్లు గుర్తు లేవు. క్షమించాలి) వంటివారితో పాటు గోదావరి జిల్లాల నుండి చేగొండి హరిరామజోగయ్య, జక్కంపూడి రామమోహన్ రావు, తోట త్రిమూర్తులు, ముద్రగడ పద్మనాభం, ఇటు గుంటూరు నుండి కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు తోడ్పాటు అందించారు. అప్పటికే దివిసీమలో చల్లపల్లి రాజా కుటుంబంతో ఆధిపత్య పోరాటంలో పైచేయిగా ఉన్న మండలి వెంకట కృష్ణారావు కూడా తనవంతు చేయూత అందించడంతో కాపునాడు సభ, కాపునాడు ఉద్యమం విజయవంతం అయింది. ఈ పరిస్థితుల్లోనే జైల్లో ఉన్న రంగా రాజకీయాల్లోకి ప్రవేశించి విజయవాడ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్ గా స్వతంత్ర అభ్యర్థిగా జైలు నుండే గెలిచారు.

ఆలోచన మొదలయింది అప్పుడే….

ఈ గెలుపు తర్వాతే కాపుల్లో రాజకీయ ఆలోచన మొదలయింది. అంటే కాపులు అప్పటికి రాజకీయాల్లో లేరని కాదు. కన్నెగంటి హనుమంతు వంటి స్వాతంత్రోద్యమ వీరులు, “ఆంధ్ర కాళిదాసు” గా ప్రసిద్ధికెక్కిన త్రిపురాన వెంకట సూర్య ప్రసాదరావు దొర వంటి కవులతో పాటు అనేక రంగాల్లో కాపునేతలు పలువురు ఉండేవారు. రాజకీయాల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన రొక్కం లక్ష్మీ నరసింహం దొర 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర తొలి శాసన సభ స్పీకర్ గా పనిచేశారు. పైగా కాపునాడు ఆలోచన నాటికి మండలి వెంకట కృష్ణారావు రాష్ట్ర మంత్రిగా పనిచేసి విశేష గుర్తింపు పొందారు. అయినా అధికారం రెడ్డి కులం నుండి కమ్మ కులానికి బదిలీ అవగానే తర్వాత వంతు మాదే అనే భావం కాపునాడుతోనే మొదలైంది.

రంగాకు మద్దతుగా వైఎస్……

రాష్ట్ర కాంగ్రెస్ లో నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన రెడ్డి వంటి మహామహుల మధ్యలో తనకు తానుగా ఎదుగుతూ, తన వర్గం అంటూ ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విజయవాడలో ఎదుగుతున్న వంగవీటి రంగాకు మద్దతుగా నిలిచారు. ఆయన చొరవతో, కాపునాడు అండతో రంగా కాంగ్రెస్ పార్టీలో చేరి 1985లో జరిగిన ఎన్నికల్లో విజయవాడ తూర్పు (ఇప్పటి సెంట్రల్) నియోజకవర్గం నుండి గెలిచారు. ఆ తర్వాత 1988 డిసెంబర్ 26న ఆయన హత్య జరిగే వరకూ, ఆ తర్వాత కొన్నేళ్ళవరకూ విజయవాడ వేదికగా కాపు-కమ్మ వైరం కొనసాగింది.

రంగా హత్యానంతరం…..

రంగా హత్య తర్వాత కాపుల్లో పాలనపై ఆశ మళ్ళీ 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటినుండి పెరుగుతూ చివరికి సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి 2009 ఎన్నికలకు ముందు “ప్రజారాజ్యం” పేరుతో రాజకీయ పార్టీ పెట్టేవరకూ దారితీసింది. అయితే, తొలినాళ్ళలో కాపు నేతలకు అండగా ఉన్న రాజశేఖర్ రెడ్డి 2009 నాటికి అటువైపు ప్రత్యర్థిగా ఉండడంతో కమ్మ, రెడ్డి తర్వాత ఈ రాష్ట్రాన్ని ఏలేది తామే, అధికారం ఇక తమదే అనే కలలు ఫలించలేదు. పైగా రాజశేఖర్ రెడ్డికి కాపు నేతల్లో బలమైన అనుచరులు ఉండడం, వారెవరూ చిరంజీవి వైపు వెళ్ళకపోవడం కాపుల రాజకీయ కల చెదిరింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 18 స్థానాలు గెలుచుకున్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ చివరికి రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత 2011లో కాంగ్రెస్ లో విలీనం అయింది. ప్రజారాజ్యం ప్రస్థానంలో పాలకవర్గంగా మారబోతున్నామనే ఆశ కాపులో చాలా ఎక్కువగా ఉంది. ప్రజారాజ్యం పార్టీకోసం ఆస్తులు అమ్ముకున్న కాపు నేతలు అనేకమంది ఉన్నారు.

జనసేన ఆవిర్భవించినా…..

ఆ తర్వాత 2014 చిరంజీవి సోదరుడు, నటుడు పవన్ కళ్యాణ్ “జనసేన” పేరుతో మరో కొత్త పార్టీ ప్రారంభించినా కాపులు ఆయనను, ఆ పార్టీని పూర్తిగా విశ్వసించలేదు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా “కాపుల పార్టీ” అనే పేరురాకుండా జాగ్రత్తపడ్డారు. “వైసీపీ రెడ్డి పార్టీ. టిడిపి కమ్మ పార్టీ. మనం జనసేనను కాపు పార్టీ అని ప్రకటించుకుంటే మంచిది అని కొందరు సూచించినప్పటికీ పవన్ కళ్యాణ్ ఈ సూచనను అంగీకరించకపోవడంతో కమ్మ, రెడ్డి తర్వాత అధికారం తమకే బదిలీ అవుతుందని ఆశించిన కొందరు కాపునేతల ప్రయత్నం ఈసారి కూడా ఫలించలేదు. కొందరు కాపులు జనసేనకు మద్దతుగా నిలిచినప్పటికీ లక్ష్యం నిర్దేశించు కోవడంలో కాపులు కొంత వైఫల్యం చెందారు. ఆ వైఫల్యం కారణంగానే 2009లో ప్రజారాజ్యం, 2019లో జనసేన వైఫల్యం చవిచూశాయి.

ఇద్దరి కాంబినేషన్లలో……

ప్రజారాజ్యం, జనసేన సంగతి ఎలా ఉన్నా బిజెపి ద్వారా అయినా అధికారం తామే దక్కించుకోవాలని కాపుల్లోని కొందరు నేతలు ఇప్పుడు తాజాగా కొత్త పధకం సిద్ధం చేశారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా కన్నా లక్ష్మీనారాయణ కొనసాగుతుండడం, జనసేన వెనుక ఇంకా కొంతశాతం కాపు యువత ఉండడం 2024 ఎన్నికల నాటికి ఉపయోగకరంగా ఉంటుందని ఇప్పుడు ఆ సామాజిక వర్గం చేస్తున్న ఆలోచన. సరిగ్గా ఈ లెక్కలే బిజెపి అధినాయకత్వానికి కూడా చెప్పి తాత్కాలికంగా జీవీఎల్ వంటి వారి నోర్లు మూయించారు. కన్నా, పవన్ కాంబినేషన్లో రాష్ట్రంలోని కాపులు ఎప్పటినుండో కంటున్న అధికార బదిలీ కల సాకారమవుతుందని వారి ఆశ. అయితే ఎంతమేరకు ఈ ఇద్దరు కలిసి పనిచేయగలుగుతారు, ఎంతమేరకు టిడిపి, వైసీపీ విఫలం అవుతాయో చూడాలి. చంద్రబాబు, జగన్ వైఫల్యం చెందితేనే, లేదా ఈ ఇద్దరూ తమ పార్టీల్లోని కాపు నేతలను గుర్తించకపోతేనే వారు బిజెపి-జనసేన వైపు నడిచే అవకాశం ఉంది. అది జరుగుతుందో లేదో చూడాలి.

 

-గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News