వాళ్లే ఇక కీ రోల్ అట… అందుకే ఈ ప్రయత్నాలు

కాపులు ఏపీలో బలమైన సామాజికవర్గం. వారు ప్రత్యక్షంగా, పరోక్షంగా వంద సీట్లలో తమ ప్రభావాన్ని చూపించగలరు, అంటే ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూడా కాపులే [more]

Update: 2020-08-13 03:30 GMT

కాపులు ఏపీలో బలమైన సామాజికవర్గం. వారు ప్రత్యక్షంగా, పరోక్షంగా వంద సీట్లలో తమ ప్రభావాన్ని చూపించగలరు, అంటే ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూడా కాపులే కీ రోల్ ప్లే చేయాలన్నమాట. అయితే వారెపుడూ బోయీలేనా, పల్లకీ ఎక్కేది లేదా. ఈ అసంతృప్తి సగటు కాపు జనంలో ఉంది. దాన్ని ఒడిసిపట్టుకోవాలని బీజేపీ చూస్తోంది. అందులో భాగమే సోము వీర్రాజుకి ఏపీ బీజేపీ కిరీటం. కాపులకు గ్రామర్ వీర్రాజు అయితే గ్రామర్ మెగా ఫ్యామిలీ. ఇక ఇంజన్ అనుకోవాలో, ఇంధనం అనుకోవాలో తెలియదు కానీ ఆయన ముద్రగడ పద్మనాభం. మొత్తానికి ఏపీలో కాపులను ఒకే గొడుకు కిందకు తేవడానికి రంగం సిధ్ధం అవుతోంది.

చిరు ఆశీస్సులేనా..?

మెగాస్టార్ రాజకీయం తెలిసిందే. ఆయన అందరి వాడుగా ఉండాలనుకుంటున్నారు. ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు. ఈ వయసులో తనకు రాజకీయాలు అవసరమా అని వైరాగ్యం వల్లించారు. అయితే మెగాస్టార్ తాను కాదనుకున్నా సినీ గ్లామర్ వల్ల కాపులకు ఐకాన్ గానే ఉన్నారు. కొన్ని వర్గాల వారికి ఆయన మీద ఇంకా నమ్మకం ఉంది. అందుకే సోము వీర్రాజు ముందుగా వెళ్ళి ఆయనకు ఓ దండం పెట్టేశారు. మీ ఆశీస్సులు కావాలని కోరారు. తమ్ముడి పవన్ కి నాకూ మీ దీవెనలు కావాలని తెలివిగానే రాజకీయ బాణం వేశారు. మెగాస్టార్ చిరంజీవి కాదనకుండా ఉంటారా. సరే అలాగే కానీయమన్నారు.

ఇంప్రెషన్ కోసమే…..

కాపులు ఇపుడు ఏపీలో చీలిపోయి ఉన్నారు. నిజానికి వారిని వైసీపీ కానీ టీడీపీ కానీ ఏమీ తక్కువ చేయలేదు. పదవులు ఇస్తున్నారు. నిధులు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలు అవుతున్నారు, కీలకమైన శాఖలు కూడా దక్కుతున్నాయి. రాజకీయ దర్జా బాగానే ఉంది. కానీ కాపులకు ముఖ్యమంత్రి పీఠం ఒక్కటి తప్ప అన్నీ దక్కుతున్నాయి. వారికి కూడా తెలుసు. అది కష్టమని, అందుకే ఉప ముఖ్యమంత్రి దాకా వచ్చామని మురిసిపోతున్నారు. అది టీడీపీ అయినా జగన్ జమానా అయినా డిప్యూటీ సీటు గ్యారంటీ, అదే తృప్తి అనుకుంటున్నారు. ఎందుకంటే కాపుల్లో ఐక్యత లేదు, వారిని ఒకే పార్టీ వైపుగా కూడగట్టడం కష్టంగా ఉంది. పైగా బలమైన రెండు ప్రాంతీయ పార్టీల మధ్య వారు విడిపోయారు. అందుకే వారిలో మనకో పార్టీ ఉంది అని చెప్పడానికి, ఇంప్రెషన్ కలిగించడానికి సోము వీర్రాజు వేసిన తెలివైన ఎత్తుగడే మెగాస్టార్ తో భేటీ వేయడం.

నమ్ముతారా…?

ఇదంతా బాగానే ఉంది కానీ కాపులు ఈ మాత్రానికే నమ్ముతారా అన్నది పెద్ద డౌట్. ఏపీ రాజకీయాల్లో బీజేపీ, జనసేన కూటమి బలమెంత అన్నది కూడా చూస్తారుగా. తెర ముందుకు వచ్చి యుధ్ధమే చేసినా కూడా మెగాస్టార్ కి దక్కింది అచ్చంగా 18 సీట్లు, ఇక జనసేన అంటూ ఏదో ఊపుతాడు అనుకుంటే రాజకీయ పవనం గట్టిగా వీచింది ఒక్కచోట మాత్రమే. సోము వీర్రాజుకే కాపుల మద్దతు ఉంటే ఇంతవరకూ ఒక్క చోట కూడ ఎందుకు డైరెక్ట్ ఎన్నికల్లో గెలవలేదు, ఇదీ ప్రశ్నగానే ఉంది. కాపుల నేత ముద్రగడ పద్మనాభం కూడా ఓటమి ఎరగని నేత కాదు, ఇక బీజేపీ విషయానికి వస్తే ఏపీకి ఏం చేసిందన్నది ఎపుడూ ముందుకు వచ్చే అతి పెద్ద ప్రశ్నగానే ఉంటుంది. ఇంతలా మైనస్సులు ఎన్నో ఉన్నా కూడా సోము తాను ఎందుకు వచ్చిందీ చెప్పేందుకు అన్నట్లుగా కాపుల చుట్టూ కధ నడిపిస్తున్నారు. అయితే కాపులకు 2009 ప్రజారాజ్యంతో పడిన చేదు అనుభవాలే గుర్తుకువస్తున్నాయట. ఇక వారిని ఆకట్టుకోవడం అంటే కత్తి మీద సామే. కానీ ఇది రాజకీయం. ఆశలు ఉంటాయి. దానికి తగిన వ్యూహలూ ఉంటాయి, చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News