కనుమూరి కంట్రోల్ లోకి వచ్చినట్లేనా?

ప‌ట్టుబ‌ట్టి సీటు ద‌క్కించుకుని న‌ర‌సాపురం నుంచి విజ‌యం సాధించిన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పన‌క్కర‌లేదు. లాక్‌డౌన్‌కు ముందు ఆయ‌న నిత్యం మీడియాలో క‌నిపించేవారు. త‌న‌కు దేశ [more]

Update: 2020-04-29 03:30 GMT

ప‌ట్టుబ‌ట్టి సీటు ద‌క్కించుకుని న‌ర‌సాపురం నుంచి విజ‌యం సాధించిన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పన‌క్కర‌లేదు. లాక్‌డౌన్‌కు ముందు ఆయ‌న నిత్యం మీడియాలో క‌నిపించేవారు. త‌న‌కు దేశ వ్యాప్తంగా అంద‌రూ తెలుస‌ని, రాష్ట్రంలోనూ త‌న‌ను మించిన నాయ‌కుడు లేడ‌ని ఆయ‌న ప్రత్యక్షంగానో.. ప‌రోక్షంగానే చెప్పక‌నే చెప్పేవారు. రాష్ట్రంలోను, కేంద్రంలోను చాక‌చ‌క్యంగా వార్తల్లో ఉండేవారు. ఒకానొక ద‌శ‌లో తెలుగు మీడియంపై ఆయ‌న పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు దుమారం రేప‌డం,రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ్యతిరేకంగా త‌న వాయిస్ వినిపించ‌డంతో ఆయ‌న తీవ్ర వివాదంలో కూరుకున్న విష‌యం తెలిసిందే.

ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ…..

అటు పార్టీ ప‌రంగా కూడా జ‌గ‌న్‌ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టేలా వ్యవ‌హ‌రిస్తూ ఉండేవారు. గ‌తంలో ఆయ‌న బీజేపీలో ప‌నిచేయ‌డంతో ఇటు విజ‌య‌సాయి లాంటి వాళ్లకంటే కూడా ర‌ఘురామ ‌కృష్ణంరాజుకే అమిత్ షా, మోడీ అపాయింట్‌మెంట్లు చిటుక్కున ద‌క్కేవి. ఇది కూడా వైసీపీలో పెద్ద దుమారంగా మార‌డంతో చివ‌ర‌కు జ‌గ‌న్ ఆయ‌న ఎంపీగా ఉన్న న‌ర‌సాపురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేత‌ల‌కు ర‌ఘురామ‌కృష్ణంరాజుకు పెద్ద ప్రయార్టీ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పిన‌ట్టు పార్టీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ న‌డుస్తోంది.

పార్టీ నేతలు కూడా….

స‌రే! ఇప్పుడు క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఎంపీలు త‌మ త‌మ స్థాయిలో ప్రజ‌ల‌కు ఏదైనా చేయాల‌ని ముందుకు వ‌స్తున్నారు. టీడీపీ ఎంపీలు ఇద్దరూ కూడా ప్రభుత్వానికి నేరుగా ఇవ్వక‌పోయినా.. ఏదో ఒక రూపంలో సాయం అందించారు. వైసీపీ ఎంపీలు కూడా త‌మ వంతు సాయం చేస్తున్నా రు. ఇప్పటికే చాలా మంది ఎంపీలు ముందుకు వ‌చ్చి ఎంపీ లాడ్స్ నుంచి ప్రభుత్వానికి స‌హ‌కారం అందించారు. మ‌రి ఈ నేప‌థ్యంలో ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు ఊసు ఎక్కడా వినిపించ‌డం లేదు. పోనీ.. గోప్యంగా ఏమై నా చేస్తున్నారా ? అంటే.. నిత్యం ప్రచారం కోరుకునే ఆయ‌నకు ఇది సాధ్యమేనా ? అనే వాద‌న కూడా ఉంది. ఇక ఆయ‌న పార్టీ నేత‌ల‌తో క‌లిసి చేద్దామ‌న్నా వాళ్లు ప‌ట్టించుకునే ప‌రిస్థితి కూడా క‌న‌ప‌డ‌డం లేదు.

కరోనా సమయంలో…..

నిత్యం ఏదో ఒక విష‌యంతో ర‌ఘురామ‌కృష్ణంరాజు సంచ‌ల‌నం సృష్టించేవారు. కానీ, ఇప్పుడు ప్రజ‌లు క‌ష్టాల్లో ఉన్న సమ‌యంలో మాత్రం ఎక్కడా అడ్రస్ కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న గురించి పెద్ద ఎత్తున చ‌ర్చే జ‌రుగుతోంది. ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు ఎక్కడ‌? అనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి న‌ర‌సాపురంలో ఓడిన వారు ఎలాగూ ప‌ట్టించుకోవ‌డం లేదు. పోనీ గెలిచిన ఎంపీ గారైనా త‌మ ‌కు అండ‌గా ఉంటార‌ని ఇక్కడి పేద‌లు అనుకున్నారు. కానీ, ఆయ‌న కూడా స‌మ‌యం చూసి సైలెంట్ అయిపోవ‌డం ఏమాత్రం బాగోలేద‌నే వాద‌న భారీగానే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. జగన్ ఇచ్చిన షాక్ లతోనే ఆయన కంట్రోల్ అయినట్లు చెప్పుకుంటున్నారు. అందుకే ఆయన వార్తల్లోకి ఎక్కడానికి ఇష్టపడటం లేదు.

Tags:    

Similar News