కన్నా ఆశించింది అదేనా? అది దక్కదా?

రాజ‌కీయాల్లోకి ఎప్పుడు వ‌చ్చామ‌న్నది కాదు.. ఎలా వ్యవ‌హ‌రిస్తున్నాం.. ఎలాంటి దూకుడు ప్రద‌ర్శిస్తున్నాం.. అన్నదే కీల‌కం. ప‌దవులు ఉండి కూడా దూకుడు లేకపోతే.. ఏం జ‌రుగుతుందో ఇప్పుడు ఏపీ [more]

Update: 2020-07-24 11:00 GMT

రాజ‌కీయాల్లోకి ఎప్పుడు వ‌చ్చామ‌న్నది కాదు.. ఎలా వ్యవ‌హ‌రిస్తున్నాం.. ఎలాంటి దూకుడు ప్రద‌ర్శిస్తున్నాం.. అన్నదే కీల‌కం. ప‌దవులు ఉండి కూడా దూకుడు లేకపోతే.. ఏం జ‌రుగుతుందో ఇప్పుడు ఏపీ బీజేపీలో స్పష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు పార్టీ నేత‌లు. అయితే, ఈ విష‌యాన్ని చాలా ర‌హ‌స్యంగా చ‌ర్చించుకుంటున్నారు. దీనికి కార‌ణం.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ చీఫ్‌గా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ రాష్ట్రంలో ప‌గ్గాలు చేప‌ట్టారు. ఆయ‌న కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డంతో రాష్ట్రంలో పార్టీ కొత్త పుంత‌లు తొక్కుతుంరని పార్టీ కేంద్ర నాయ‌క‌త్వం భావించింది. అంతేకాదు, త‌న పాత ప‌రిచ‌యాలు వినియోగించి పార్టీని బ‌లోపేతం చేస్తార‌ని కూడా అనుకుంది. అయితే, అలా జ‌ర‌గ‌లేదు. పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారింది.

రాజ్యసభ సీటు ఆశించి…..

కేంద్రంలోని బీజేపీ లైన్‌ను అందుకోవ‌డంలోనూ క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఫెయిల‌య్యార‌నే వాద‌న రాష్ట్ర పార్టీ నేత‌ల్లో బ‌లంగా ఉంది. ఇక‌, కాపు సామాజిక వ‌ర్గాన్నయినా.. బీజేపీవైపు మ‌ళ్లించే విష‌యంలోనూ క‌న్నా దూకుడు ప్రద‌ర్శించ‌లేక పోయారు. చాలా రోజుల త‌ర్వాత బీజేపీలో ఓ కీల‌క ప‌ద‌వి కాపు వ‌ర్గానికి వ‌చ్చింది. ఈ ప‌ద‌వితో రాష్ట్రం మొత్తాన్ని లీడ్ చేయ‌డంతో పాటు కాపుల్లోనూ మంచి ప‌ట్టు సాధించ‌వ‌చ్చు. అయితే క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఈ విష‌యంలో ఘోరంగా ఫెయిల్ అయ్యార‌నే చెప్పాలి. వాస్తవానికి క‌న్నా ఈ ప‌ద‌వి చేప‌ట్టడం వెన‌క ఆయ‌న రాజ్యస‌భ సీటు ఆశించేన‌న్న టాక్ ఉంది. అయితే ఇప్పుడు ఆ పార్టీ అధినాయ‌క‌త్వం మాత్రం క‌న్నాకు రాజ్య‌స‌భ సీటు ఇవ్వడం దండ‌గే అన్న అభిప్రాయంతో ఉంద‌ని ఆ పార్టీ వ‌ర్గాలే చ‌ర్చించుకుంటున్నాయి.

కన్నా కన్నా మిగిలిన నేతలు….

పైగా వ‌ల‌స నేత‌ల మ‌ధ్య క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఏపీ బీజేపీలో ఫోక‌స్ కావ‌డం లేదు. అదేస‌మ‌యంలో కేంద్రంలో మంచి ఫామ్‌లో ఉన్న నాయ‌కులతో క‌లిసిమెలిసి ప‌నిచేయ‌డంలోనూ ఆయ‌న విఫ‌ల‌మ‌య్యార‌నే వాద‌న ఉంది. ఈ నేప‌థ్యంలో.. ఆయ‌న‌తో క‌లిసి వ‌చ్చే నాయ‌కులు కూడా క‌రువ‌య్యారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ పుంజుకోలేద‌నే చెప్పాలి. ఇక‌, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కంటే.. కూడా చాలా త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన పార్టీ ఉపాధ్యక్ష ప‌ద‌విలో ఉన్న విష్ణువ‌ర్ధన్‌రెడ్డి మాత్రం దూకుడు గా ఉన్నారు. రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని పార్టీవైపు న‌డిపించే క్రమంలో ఆయ‌న దూకుడు ప్రద‌ర్శిస్తున్నార‌నే వాద‌న‌లు వినిపిస్తు న్నాయి. అదే స‌మ‌యంలో క‌న్నాను మించి పోయిన వేగంతో జ‌గ‌న్ ప్రభుత్వంపై విమ‌ర్శలు గుప్పిస్తున్నారు.

పార్టీ పెద్దల అనుమతితోనే….

విష‌యం ఏదైనా కూడా త‌న‌దైన రేంజ్‌లో ఆయ‌న దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. చాలా టీవీల‌ చ‌ర్చాకార్యక్రమాల్లోనూ బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తున్నారు. రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమం జ‌రిగినా.. త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని విమ‌ర్శల జోరు పెంచుతున్నారు. బ‌ల‌మైన గ‌ళంతో ప్రత్యర్థుల‌పై విరుచుకుప‌డుతున్నారు. అదేస‌మ‌యంలో పార్టీ నేత‌ల‌ను కూడా క‌లుపుకొని పోతున్నారు. కేంద్రంలోని పెద్దల క‌నుస‌న్నల్లో క‌లిసి ప‌నిచేస్తున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. అధ్యక్ష రేసులో విష్ణువ‌ర్థన్ రెడ్డి ఉన్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఈ ఏడాది చివ‌ర‌లో ఖ‌చ్చితంగా పార్టీ చీఫ్ ప‌ద‌వికి మార్పు ఖాయ‌మ‌ని.. వ‌స్తున్న సంకేతాల నేప‌థ్యంలో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కు విష్ణువ‌ర్ధన్ రెడ్డి పోటీ అవుతార‌ని, ప్రస్తుతం రాష్ట్రంలో జ‌గ‌న్ స‌హా రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెక్‌పెట్టాలంటే.. విష్ణువ‌ర్ధన్‌రెడ్డి కీల‌క‌మైన నాయ‌కుడ‌నే ప్రచారం జ‌రుగుతోంది. దీంతో క‌న్నా.. కింకర్తవ్యం అని త‌ల ప‌ట్టుకుంటున్నార‌ట‌!! మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News