కన్నాకు ఇప్పుడు అర్ధమైపోయిందా ?

కన్నా లక్ష్మీనారాయణ. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా మోయలేని భారాన్నే ఇప్పటిదాకా మోస్తూ వచ్చారు. ఆయనకు ఎవరు సహకరిస్తున్నారో తెలియదు కానీ సొంత పార్టీలోనే వ్యతిరేకులు మాత్రం [more]

Update: 2020-07-25 13:30 GMT

కన్నా లక్ష్మీనారాయణ. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా మోయలేని భారాన్నే ఇప్పటిదాకా మోస్తూ వచ్చారు. ఆయనకు ఎవరు సహకరిస్తున్నారో తెలియదు కానీ సొంత పార్టీలోనే వ్యతిరేకులు మాత్రం పెద్ద సంఖ్యలో ఉన్నారన్నది బోధపడిపోతోంది. దీంతో ఇక తన లెక్కన తాను ముందుకు పోవడమే బెస్ట్ అని కన్నా భావిస్తున్నట్లుగా ఉంది. అందుకే ఆయన కేంద్ర పెద్దల అభిప్రాయానికి భిన్నంగా, పార్టీ నేతల ఆలోచనలను కూడా పక్కన పెట్టి మరీ మూడు రాజధానుల విషయంలో గవర్నర్ కి లేఖ రాశారు. ఆ లేఖలో అచ్చం టీడీపీ అధినేత చంద్రబాబు వాడిన పదజాలం ఉండడం విశేషం. వీటిని బట్టి చూస్తూంటే కన్నా లక్ష్మీనారాయణ తన రూట్ సెపరేట్ అని చెబుతున్నారా అన్న చర్చ సాగుతోంది.

కుర్చీ దిగాలా ….

కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి ఏం చేశారు అన్నది కనుక ఆలోచిస్తే ఇసుమంత అని కూడా లేదు అంటారు కరడు కట్టిన కమలనాధులు, అదే జనంలో పెద్దగా లేని మాజీ బీజేపీ ప్రెసిడెంట్ కంభంపాటి హరిబాబు అయితే తనకున్న సామాజికవర్గం లింకులో మరోటో పెట్టుకుని టీడీపీతో దోస్తీ కట్టి కొన్ని సీట్లు అయినా ఏపీ బీజేపీకి తెచ్చాను అనిపించుకున్నారు. తాను కూడా ప్రతిష్టాత్మకమైన విశాఖ ఎంపీ సీట్లో గెలిచారు. మరి కన్నా లక్ష్మీనారాయణ ఆద్వర్యంలో 2019 ఎన్నికలకు వెళ్తే నోటా కంటే తక్కువ ఓట్లు పార్టీకి వచ్చాయి. దాంతోనే కన్నా లక్ష్మీనారాయణ సీన్ కాలిందని అంటూ వచ్చారు.

ఉత్తరాంధ్రా అంతే……

ఇక కన్నా లక్ష్మీనారాయణకు ఉత్తరాంధ్రా బీజేపీ నాయకుల నుంచి ఎపుడూ పెద్దగా సపోర్టు లేదు. హరిబాబుని దించి ఆయన గద్దెనెక్కడంతో ఆయన వర్గం అంతా సైలెంట్ గానే ఉంటోంది. ఇక ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ వంటి వారు కన్నా లక్ష్మీనారాయణ పోకడల పట్ల లోలోపల రగులుతూనే ఉన్నారు. ఆయన అచ్చం టీడీపీ బాటలోనూ, మాటలోనూ ఉంటూ బీజేపీ స్టాండ్ ని అపహాస్యం చేస్తూ వచ్చారన్నది మాధవ్ లాంటి వారి భావన. ఇక మూడు రాజధానుల విషయంలో కూడా కన్నా లక్ష్మీనారాయణ ఏపీ యావత్తుకు సంబంధించిన బీజేపీ నేతగా వ్యవహరించలేదని ఆ పార్టీ నాయకులు గుర్రు మీద ఉన్నారు. ఉత్తరాంధ్రాకు రాజధాని ఇస్తామని వైసీపీ ప్రతిపాదిస్తోంది. దానికి విరుధ్ధంగా కన్నా మాట్లాడకుండా ఉండాల్సింది అని ఉత్తరాంధ్రా బీజేపీ నాయకుల ఆలోచన. బీజేపీకి చిన్న రాష్ట్రాలు, వికేంద్రీకరణ అంటే మక్కువ. ఆ సంగతి తెలిసి కూడా కన్నా లక్ష్మీనారాయణ సొంత స్టాండ్ తీసుకుంటున్నారని కాషాయం పార్టీలో మండుతున్న నేతలు ఉన్నారు.

ఆయన అలా ….

ఇక కన్నా లక్ష్మీనారాయణ మూడు రాజధానులు వద్దు, అమరాతి ఒక్కటే రాజధానిగా ఉండాలని ఎపుడైతే లేఖ రాసారో ఆ మరుక్షణం బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ రాయలసీమకు న్యాయ రాజధానిని సమర్ధించారు. అంతే కాదు మరింత వికేంద్రీకరణ జరగాలని ఆయన కోరుకుంటున్నారు. అంటే రాయలసీమ నేతల మనోభావాలు కానీ ఉత్తరాంధ్ర నేతల ఆలోచనలు కానీ పట్టించుకోకుండా కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుకు వత్తాసుగా రాజకీయం చేస్తున్నారా అన్న అనుమానాలు సొంత పార్టీలోనే కలుగుతున్నాయట. ఇవన్నీ ఇలా ఉంటే కన్నా లక్ష్మీనారాయణ భవిష్యత్తు రాజకీయాలకు బాటలు వేసుకోవడానికే ఇలా చేస్తున్నారని అంటున్నారు. ఆయనకు బీజేపీలో ప్రాధాన్యత తగ్గడంతోనే తనదైన రాజకీయం చేస్తున్నారని కూడా విశ్లేషిస్తున్నారు. మొత్తానికి కన్నాకు బీజేపీలో అంతా ఇపుడు అర్ధమవుతోందని కూడా చెబుతున్నారు.

Tags:    

Similar News