మరో ఛాన్స్ ఉంటుందా? డౌటేనటగా?

జాతీయ పార్టీ బీజేపీకి రాష్ట్రంలో అధ్యక్షుడిగా ఉన్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ప‌ద‌వీ కాలం రెండేళ్లు పూర్తి చేసుకుంది. 2018 మేలో అనూహ్యంగా ఈ ప‌ద‌విని చేప‌ట్టిన క‌న్నా.. [more]

Update: 2020-05-23 06:30 GMT

జాతీయ పార్టీ బీజేపీకి రాష్ట్రంలో అధ్యక్షుడిగా ఉన్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ప‌ద‌వీ కాలం రెండేళ్లు పూర్తి చేసుకుంది. 2018 మేలో అనూహ్యంగా ఈ ప‌ద‌విని చేప‌ట్టిన క‌న్నా.. పెద్ద ల‌క్ష్యం పెట్టుకునే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావ‌డ‌మే త‌న ధ్యేయ‌మ‌ని అప్పట్లో ఆయ‌న ప్రక‌టించారు. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణను అస‌లు ఈ ప‌ద‌విలో కూర్చోబెట్టడం వెనుక కూడా ఏదో రాజ‌కీయ వ్యూహం ఉంద‌నే ప్రచారం జ‌రిగింది అప్పటి వ‌ర‌కు కాంగ్రెస్‌లో ఉన్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వైసీపీలోకి వెళ్తేందుకు ప్రయ‌త్నిస్తున్న స‌మ‌యంలో అనూహ్యంగా బీజేపీ బాట ప‌ట్టారు.

రెండేళ్ల కాలంలో….

క‌ట్ చేస్తే.. ఇప్పుడు రెండేళ్ల కాలం అయిపోయింది. వాస్తవానికి జాతీయ పార్టీలో అధ్యక్ష ప‌ద‌వి రెండేళ్ల వ‌ర‌కే ప‌రిమితం. ఈ నేప‌థ్యంలో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణను మారుస్తారా ? గ‌తంలో విశాఖ మాజీ ఎంపీ హ‌రిబాబును కొన‌సాగించిన‌ట్టు మ‌రో ఛాన్స్ ఇస్తారా ? అనేది చూడాలి. ఈ విష‌యం ప‌క్కన పెడితే.. క‌న్నా ఈ రెండేళ్ల కాలంలో పా ర్టీని ఏమేర‌కు ముందుకు తీసుకు వెళ్లారు? పార్టీ ల‌క్ష్యాన్ని సాధించే క్రమంలో ఆయ‌న వేసుకున్న వ్యూహాలు ఫ‌లించాయా? అనే విష‌యాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. నిజానికి ఏ పార్టీలో అయినా వెన‌క్కి తిరిగి చూ సుకోవ‌డం అనేది కామ‌న్‌. ఇప్పుడు ఇదే విష‌యంపై క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ప‌నితీరు చూస్తే మిశ్రమ స్పంద‌నే సొంత పార్టీ వ‌ర్గాల్లో వ్యక్తమ‌వుతోంది.

లౌక్యం లేకపోవడంతో…

ఈ రెండేళ్ల కాలంలో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వ్యవ‌హ‌రించిన తీరును రెండు ర‌కాలుగా చూడాలి. ఒక‌టి రాష్ట్రంలో అధికార పార్టీపై ఆయ‌న చేసిన పోరాటం. రెండు .. కేంద్రంలో బీజేపీ నేత‌ల‌తో ఆయ‌న అనుస‌రించిన విధానం. ఈ రెండు విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. ఆయ‌న ఎక్కడో లైన్ త‌ప్పార‌నే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. కేంద్రంలోని నేత‌ల‌తో గ‌తంలో ఉన్న హ‌రిబాబు నెరిపిన సంబంధాల‌ను, లౌక్యాన్ని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కొన‌సాగించ‌లేక పోయార‌న‌డంలో సందేహం లేదు. ఏపీ రాజ‌కీయాల్లో బీజేపీ ప‌రంగా మూడున్నర ద‌శాబ్దాలుగా కీల‌కంగా ఉన్న ముఖ్యంగా ఉప‌రాష్ట్రప‌తిగా ఉన్న వెంక‌య్యతో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణకు పెద్దగా స‌త్సంబంధాలు లేవు. వెంక‌య్య ఉప రాష్ట్రప‌తిగా ఉన్నా ఏపీ బీజేపీలో ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం ఎక్కువ‌గానే ఉంది. ఇప్పట‌కీ వాళ్లు ఏపీ బీజేపీ ప‌గ్గాల‌ను త‌మ గుప్పెట్లో పెట్టుకునేందుకు చేయ‌ని ప్రయ‌త్నాలు లేవు.

పార్టీని ముందుకు నడిపించడంలో…

అదే స‌మ‌యంలో పార్టీని ముందుకు న‌డిపించ‌డంలోనూ ఆయ‌న నేత‌ల‌ను ఏక‌తాటిపై తీసుకురాలేక పోయారు. త‌న‌పైనే వ‌చ్చిన విమ‌ర్శల‌ను ఆయ‌న తోసిపుచ్చుకోలేక పోయారు. అదే స‌మ‌యంలో వైసీపీపై పోరాటంలో ఎక్కువ‌గా ఆయ‌న టీడీపీ అనుస‌రిస్తున్నార‌నే వాద‌న కూడా ఉంది. మ‌రీ ముఖ్యంగా రాజ‌ధాని మార్పు విష‌యంలో అనుస‌రించిన వైఖ‌రి కూడా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణకు ప్లస్ కాలేదు. మోడీ శంకుస్థాప‌న చేసిన ప్రాంతంలో ఆయ‌న నిరాహార దీక్ష చేసినా.. అది కూడా ఆయ‌న‌కు క‌లిసిరాలేదు. కేంద్రం రాజ‌ధాని విష‌యాన్ని రాష్ట్రానికే వ‌దిలేస్తున్నట్టు ప్రక‌టించినా.. తాను మాత్రం పోరాడ‌తాన‌ని ప్రక‌టించి అభాసుపాల‌య్యారు. జీవీఎల్ వంటి కీల‌క‌నేత‌పై ఆధిప‌త్య ధోర‌ణిని ప్రద‌ర్శించారు.

సొంత సామాజికవర్గాన్ని ….

ఇక‌, పార్టీలోని సామాజిక వ‌ర్గాల వారీగా చూసుకుంటే.. క‌మ్మ, క్షత్రియ వ‌ర్గాల‌ను క‌లుపుకొని వెళ్లడంలోనూ క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ విఫ‌ల‌మ‌య్యారు. వారి ఆధిప‌త్యమే నేటికీ ఏపీ బీజేపీలో న‌డుస్తోంది. ఇక‌, కాపు వ‌ర్గానికి చెందిన నాయ‌కుడే అయినప్పటికీ.. ఆ వ‌ర్గాన్ని కూడా త‌న‌వైపు తిప్పుకోవ‌డంలో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఫెయిల‌య్యార‌నే వాద‌న ఉంది. బీజేపీలో ఇప్పుడు మెజార్టీ వ‌ర్గాలు జ‌న‌సేన‌, వైసీపీ బాట‌లో న‌డిచేందుకు ఆస‌క్తితో ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. ఈ రెండేళ్ల కాలంలో పార్టీ స‌భ్యత్వాల‌ను పెంచుతాన‌ని పెంచ‌లేక పోయారు. ప్రతి ఇంటిపైనా బీజేపీ జెండా ఎగ‌రేస్తాన‌ని చేసిన ప్రక‌ట‌న కూడా సుష్క ప్రక‌ట‌న‌గానే మిగిలిపోయింది. ఇలా మొత్తంగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఈ రెండేళ్ల కాలంలో సాధించింది ఏమీలేద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News