కన్నా ఇక కామ్ అయిపోయినట్లేనా?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇక వివాదాలకు దూరంగా ఉండదలచుకున్నారా? ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు ఆలోచన చేయనున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. బీజేపీ జాతీయ [more]

Update: 2020-04-25 11:00 GMT

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇక వివాదాలకు దూరంగా ఉండదలచుకున్నారా? ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు ఆలోచన చేయనున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వీడియో కాన్ఫరెన్స్ అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిలో కొంత మార్పు కన్పిస్తోంది. వైసీపీపై దూకుడు కూడా కొంత తగ్గించినట్లే కనపడుతుంది. హైకమాండ్ ఆదేశాలతోనే కన్నా లక్ష్మీనారాయణ కామ్ అయిపోయారన్న వ్యాఖ్యలు పార్టీలోనూ విన్పిస్తున్నాయి.

యుద్ధానికి తెెరపడినట్లేనా?

గత వారం రోజుల నుంచి వైసీపీ, బీజేపీల మధ్య నడుస్తున్న మాటల యుద్ధానికి ఫుల్ స్టాప్ పడిందనే అనుకోవాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రోజుకో లేఖ రాస్తూ, రోజుకో ఆరోపణ చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. అమరావతి రాజధాని అంశం నుంచి శాసనమండలి రద్దు వరకూ ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ వస్తున్నారు. అనేక ఆందోళనలకు కూడా దిగారు. జగన్ ను తుగ్లక్ గా అభివర్ణిస్తూ ఆయన ఆరోపణలను ఇబ్బడి ముబ్బడిగా చేస్తూ వస్తున్నారు.

కిట్స్ కొనుగోళ్లలో….

కానీ కరోనా కిట్స్ కొనుగోళ్లలో కమీషన్లు దండుకున్నారంటూ కన్నా లక్ష్మీనారాయ‍ణ చేసిన వ్యాఖ్యలు వైసీపీకి మంట పుట్టించాయి. అప్పటి వరకూ పెదవి పట్టున బిగపట్టిన ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. విజయసాయిరెడ్డి నేరుగా కన్నా లక్ష్మీనారాయణపై ఆరోపణలు చేశారు. ఇరవై కోట్లకు టీడీపీకి అమ్ముడు పోయారన్నారు. దీనికి కన్నా లక్ష్మీనారాయణ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి లాగా తాను జైలుకు వెళ్లి రాలేదని బదులిచ్చారు. పరువునష్టం దావా కూడా వేశారు.

హై కమాండ్ జోక్యంతో…..

అయితే వైసీపీ, టీడీపీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎక్కువవుతుండటంతో బీజేపీ అధిష్టానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కిట్స్ కొనుగోలు విషయంలో అధిష్టానం కూడా వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించినట్లు తెలిసింది. నిరాధార ఆరోపణలు చేయవద్దని, ఏదైనా ఆరోపణలుంటే తమ దృష్టికి తీసుకు వచ్చిన తర్వాతనే, తమ అనుమతితోనే చేయాలని హైకమాండ్ గట్టిగా చెప్పడంతోనే కన్నా లక్ష్మీనారాయణ కామ్ అయిపోయారంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ తనపై ఆరోపణలు వచ్చినప్పుడు బీజేపీ నేతలు ఎవరూ తనకు అండగా నిలవకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మొత్తం మీద కన్నా లక్ష్మీనారాయణ అధిష్టానం ఆదేశాలతోనే మౌనంగా ఉంటున్నారన్నది పార్టీ వర్గాల సమాచారం.

Tags:    

Similar News