ఒక్క నిర్ణయం…వారంతా దూరమేనా?

రాజ‌ధాని అమ‌రావ‌తిని ఇక్కడే పూర్తి స్థాయిలో కొన‌సాగించాల‌ని డిమాండ్ చేస్తున్న వారిలో మెజారిటీ వ‌ర్గం క‌మ్మ సామాజిక వ‌ర్గం. రాజ‌ధాని రైతుల పేరుతో ఆందోళ‌న సాగుతున్నప్పటికీ రైతుల [more]

Update: 2020-02-04 06:30 GMT

రాజ‌ధాని అమ‌రావ‌తిని ఇక్కడే పూర్తి స్థాయిలో కొన‌సాగించాల‌ని డిమాండ్ చేస్తున్న వారిలో మెజారిటీ వ‌ర్గం క‌మ్మ సామాజిక వ‌ర్గం. రాజ‌ధాని రైతుల పేరుతో ఆందోళ‌న సాగుతున్నప్పటికీ రైతుల పేరుతో ఈ ఉద్యమానికి ప్రధానంగా ద‌న్ను అందిస్తున్న సామాజిక వర్గం కూడా ఇదేన‌నేది నిర్వివాదాంశం. ఇక్కడ భూములు కొన్నవారు ఎక్కువ‌గా వారే ఉన్నారు. అదే స‌మ‌యంలో కొంత‌మేర‌కు భూముల‌ను రాజ‌ధాని కోసం ఇచ్చిన వారిలోనూ ఈ సామాజిక వ‌ర్గమే ఉంది. అదేవిధంగా చంద్రబాబు రాజ‌ధాని బాండ్లు అమ్మిన‌ప్పుడు కూడా ఈ వ‌ర్గానికి చెందిన వారు ఎక్కువ‌గా ఈ బాండ్లు కొనుగోలు చేశారు. ఇక‌, హ్యాపీనెస్ట్ వంటి కీల‌క ప్రాజెక్టులో దేశ‌విదేశాల్లో ఉన్న క‌మ్మ సామాజిక వ‌ర్గమే ఎక్కువ‌గా వీటిని సొంతం చేసుకుంది.

ఇచ్చిందీ… కొన్నదీ…..

ఈ కార‌ణంగానే రాజ‌ధాని అమ‌రావ‌తి రూపు రేఖ‌లు మారిపోయినా? లేక ఇక్కడ కేవ‌లం లెజిస్టేటివ్‌(శాస‌న‌) రాజ‌ధానిగా మాత్రమే ప‌నులు నిర్వహించినా ఇక్కడి భూముల‌కు ధ‌ర‌లు ప‌డిపోతాయ‌ని, ప్రభుత్వ కార్యక‌లాపాలు త‌గ్గిపోతే, జ‌న‌సంచారం కూడా ఇక్కడ త‌గ్గిపోతుంద‌ని ఫ‌లితంగా తాము కోట్లు పోసి కొన్న భూములు, భ‌వ‌నాలు కూడా ఎందుకూ కొర‌గాకుండా పోతాయని ఈ వ‌ర్గం ఎంతో భావిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే రాజ‌ధాని ఉద్యమాన్ని ఉధృతం చేయ‌డంలో క‌మ్మ సామాజిక వ‌ర్గం ప్రధాన భూమిక పోషిస్తోంద‌నేది వాస్తవం.

గత ఎన్నికల్లో ఓట్లేసినా….?

ఇక‌, ఇప్పుడు ఇది రాజ‌కీయ కోణంగా కూడా మారిన నేప‌థ్యంలో ఇక్కడి క‌మ్మ సామాజిక వ‌ర్గం, అధికార ప‌క్షం వైసీపీకి దూర‌మ‌వుతుందా ? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. రాష్ట్ర జ‌నాభాలో త‌క్కువ శాతంగా ఉన్న కమ్మ వ‌ర్గం రాజ‌కీయాల‌ను శాసిస్తూనే ఉంది. అందులో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వీళ్ల డామినేష‌న్ మ‌రింత ఎక్కువ‌. ఈ క్రమంలోనే జ‌గ‌న్ తీసుకున్న చ‌ర్యల‌తో ఈ వ‌ర్గం వైసీపీకి దూర‌మ‌య్యే ప‌రిస్థితి క‌నిపి స్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్తవానికి మొన్నటి ఎన్నిక‌ల్లో ఈ రెండు జిల్లాల్లో ఈ వ‌ర్గంలో కొంత మంది వైసీపీకి ఓట్లేశారు. అయితే ఇప్పుడు వీరిలో వైసీపీ, జ‌గ‌న్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమ‌వుతోంది.

అక్కడ దరిచేరుతారని…..

అయితే, అదే స‌మ‌యంలో విశాఖ‌లో క‌నుక రాజ‌ధాని ఏర్పడితే మంత్రి కొడాలి నాని చెప్పిన‌ట్టు ఇక్కడి క‌మ్మ వ‌ర్గం కూడా ల‌బ్ధి పొందే అవ‌కాశం మెండుగానే క‌నిపిస్తోంది. అంటే వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌హా ఆ పార్టీ సీనియ‌ర్ల అభిప్రాయం ప్రకారం రాజ‌ధాని ప్రాంతంలో క‌మ్మ వ‌ర్గం త‌మ‌కు దూర‌మైనా విశాఖ స‌హా ఇత‌ర ప్రాంతాల్లోని క‌మ్మ వ‌ర్గం చేరువ అవుతుంద‌ని వైసీపీ నేతలు భావిస్తున్నారు. కానీ, ఇప్పటి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల ప్రకారం క‌మ్మ వ‌ర్గంలో చీలిక వ‌స్తేనే త‌ప్ప ఈ త‌ర‌హా ప‌రిస్థితి ఉండ‌ద‌ని అంటున్నారు. మ‌రి వైసీపీ ఏవిధంగా క‌మ్మ సామాజిక వర్గం వారికి చేరువ అవుతుందో లేదో చూడాలి. ఏది ఏమైనా.. రాజ‌ధాని అంశం.. వైసీపీలో ఇంకా ర‌గులుతూనే ఉండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News