ఆడలేక మద్దెలోడు అన్నట్లుగా ఉందిగా?

మధ్యప్రదేశ్ లో రాజకీయాలకు కొదవేమీ లేదు. జ్యోతిరాదిత్య సింధియా దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కుప్ప కూలిపోయింది. 21 మంది ఎమ్మెల్యేలు సింధియా వెంట వెళ్లడంతో కమల్ [more]

Update: 2020-04-16 17:30 GMT

మధ్యప్రదేశ్ లో రాజకీయాలకు కొదవేమీ లేదు. జ్యోతిరాదిత్య సింధియా దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కుప్ప కూలిపోయింది. 21 మంది ఎమ్మెల్యేలు సింధియా వెంట వెళ్లడంతో కమల్ నాధ్ సర్కార్ ప్రమాదంలో పడింది. అయినా కొన్నాళ్లు తాత్సారం చేయడానికి అసెంబ్లీని కరోనా వైరస్ ఉండటంతో వాయిదా వేశారు. అయితే బీజేపీ సుప్రీంకోర్టుకు వెళ్లి బలపరీక్షకు అనుమతి తెచ్చుకుంది. దీంతో కమల్ నాధ్ ముందుగానే రాజీనామా చేశారు.

కరోనా నేపథ్యంలో…..

శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. ఆయన బలపరీక్షను కూడా వెంటనే నిర్వహించడంతో మరో ఆరు నెలల పాటు ఇబ్బంది లేదు. ఇక దాదాపు 25 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆరు నెలల్లోపు వీటిని ఎన్నికల కమిషన్ నిర్వహించాల్సి ఉంటుంది. అయితే మధ్యప్రదేశ్ లోనూ కరోనా విజృంభిస్తుంది. కరోనా ప్రభావం మరో ఆరు నెలల పాటు కొనసాగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆరు నెలల్లోపు….

ఆరు నెలల్లోపు ఎన్నికలను జరిపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ దే. లేకుంటే రాజ్యాంగపరమైన చిక్కులు వస్తాయంటున్నారు న్యాయనిపుణులు. అయితే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాధ్ బీజేపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్ లో తమ ప్రభుత్వం కూలిపోయే వరకూ లాక్ డౌన్ ను దేశంలో విధించలేదని కమల్ నాధ్ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాతనే దేశ వ్యాప్త లాక్ డౌన్ ను మోదీ ప్రకటించారని ఆరోపిస్తున్నారు.

అందుకే లాక్ డౌన్…?

కరోనా విషయంలో ఫిబ్రవరి నెలలోనే రాహుల్ గాంధీ గుర్తు చేసినా ప్రభుత్వం పట్టించుకోలదన్నారు. అయితే దీనిపై బీజేపీ నేతలు రియాక్షన్ మరోలా ఉంది. కరోనా, కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడానికి సంబంధమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకుండా ఉండి ఉంటే కూలిపోయేది కాదు గదా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కావాలనే లాక్ డౌన్ పై కమల్ నాధ్ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండి పడుతున్నారు. మొత్తం మీద మధ్యప్రదేశ్ లో కరోనా విజృంభిస్తున్నా రాజకీయాలకు మాత్రం కొదవలేదు. అసలు ఎమ్మెల్యేలను కట్టడి చేసుకుని ఉంటే ఇంతదాకా? వచ్చేదా? అని కమల్ నాధ్ ను సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News