దిగిపోక తప్పదా?

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాధ్ టార్గెట్ అయ్యారు. వరసగా కాంగ్రెస్ నేతల పని పడుతున్న కమలం పార్టీ ఈసారి కమల్ నాధ్ ను ఎంచుకున్నట్లు కన్పిస్తుంది. ఇప్పిటికే [more]

Update: 2019-09-11 18:29 GMT

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాధ్ టార్గెట్ అయ్యారు. వరసగా కాంగ్రెస్ నేతల పని పడుతున్న కమలం పార్టీ ఈసారి కమల్ నాధ్ ను ఎంచుకున్నట్లు కన్పిస్తుంది. ఇప్పిటికే సీనియర్ నేతలు డీకే శివకుమార్, చిదంబరంలు జైల్లో ఊచలు లెక్కపెడుతుండగా కమల్ నాధ్ నెక్స్ట్ టార్గెట్ అయనట్లు కన్పిస్తుంది. పాత కేసును తిరగదోడుతుండటంతో ఆయన వాటి నుంచి తప్పించుకునే అవకాశాలు లేవన్నది పార్టీ నేతలు సయితం అంగీకరిస్తున్నారు. దీంతో కమల్ నాథ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. కమల్ నాధ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్. సోనియా కోటరీలో ముఖ్యుడు.

సిట్ ఏర్పాటు…

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అంటేనే కమల్ నాధ్ గుర్తుకు వస్తారు. గాంధీ కుటుంబానికి అత్యంత వీర విధేయుడిగా పేరుంది. అయితే ఇప్పుడు కమల్ నాథ్ ఇబ్బందులు ఎదుర్కొన బోతున్నారు. 1984 నాటి సిక్కుల ఊచకోత కేసును కేంద్ర ప్రభుత్వం తిరిగి విచారించాలని నిర్ణయించింది. ఇందుకోసం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేసింది. త్వరలోనే సిట్ తన పనిమొదలు పెట్టబోతోంది. అకాలీదల్ మన్జీందర్ సింగ్ హోంమంత్రిత్వ శాఖకు పెట్టుకున్న పిటీషన్ ను పరిశీలించి తిరిగి ఈ కేసును విచారించాలని నిర్ణయించింది.

ఇందిర హత్యతో…..

1984 అక్టోబరు 31 వతేదీన ఇందిరాగాంధీ హత్య జరిగింది. ఖలిస్తాన్ ఉగ్రవాది భింద్రన్ వాలేను పట్టుకునేందుకు భారత సైన్యం అప్పట్ల సిక్కులు పవిత్రంగా భావించే స్వర్ణదేవాలయంలోకి బూట్లతో అడుగుపెట్టారు. దీంతోనే ఇందిరాగాంధీ సెక్యూరిటీ గార్డులైన బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్ లు ఇందిరాగాంధీని హత్య చేశారు. ఇందిరాగాంధీ హత్యతో దేశమంతా అట్టుడికి పోయింది. దేశ వ్యాప్తంగా ఉన్న సిక్కులపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగాయి. వారి ఆస్తులను ధ్వంసం చేశాయి.అనేక రాష్ట్రాల్లో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఘటనలో 2800 మంది సిక్కులు మరణించారు.

ఆధారాలున్నాయంటున్న….

అయితే దేశవ్యాప్తంగా ఈ ఘటనపై అనేక కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో మాత్రం రాకాబ్ గంజ్ గురుద్వారా వద్ద జరిగిన హత్యాకాండ వెనక కమల్ నాధ్ ప్రమేయం ఉందన్నది ప్రధాన ఆరోపణ. కమల్ నాధ్ ఘటనాస్థలిలోనే ఉన్నారు. అప్పటి ప్రభుత్వం నానావతి కమీషన్ ను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఆధారాలు లేకపోవడంతో కమల్ నాధ్ ను నిర్దోషిగా నిర్ణయించింది. అయితే ఈ ఘటనలో కమల్ నాథ్ ఏడుగురు నిందితులకు కూడా ఆశ్రయం కల్పించారన్న ఆరోపణలున్నాయి. దీంతో కమల్ నాథ్ పై కేసు తిరగదోడితే ఆయన పదవి ఊడటం ఖాయంగా కన్పిస్తోంది.

Tags:    

Similar News