కమల్ కు ఫుల్ కలెక్షన్

తమిళనాడు రాజకీయాలు పొంతన లేకుండా జరుగుతున్నాయి. శాసనసభ ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర ఏళ్లు సమయం ఉండటంతో అన్ని పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధానంగా అందరి [more]

Update: 2020-02-04 18:29 GMT

తమిళనాడు రాజకీయాలు పొంతన లేకుండా జరుగుతున్నాయి. శాసనసభ ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర ఏళ్లు సమయం ఉండటంతో అన్ని పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధానంగా అందరి దృష్టి కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ పైనే ఉంది. రానున్న శాసనసభ ఎన్నికల్లో కమల్ హాసన్, రజనీకాంత్ లు కలసి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో పెద్దయెత్తున క్యాడర్ మక్కల్ నీది మయ్యమ్ లో చేరుతున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో రజనీకాంత్, కమల్ హాసన్ కూటమికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలియడంతో పోటీ పెరిగింది.

రెండేళ్లు గడుస్తున్నా…..

కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీ పెట్టి దాదాపు రెండేళ్లు కావస్తోంది. అయితే శాసనసభ ఎన్నికల వరకూ వెయిట్ చేయకుండానే కమల్ హాసన్ ఎన్నికల బరిలోకి దిగారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అలాగే శాసనసభ ఉప ఎన్నికల్లోనూ మక్కల్ నీది మయ్యమ్ అభ్యర్థులను కమల్ హాసన్ బరిలోకి దింపారు. అయితే పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు కమల్ హాసన్ దూరంగా ఉన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో…..

అయితే తాజాగా మున్సిపల్ ఎన్నికలు తమిళనాడులో జరగనున్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యమ్ పోటీ చేయలేదు. ఆ ఎన్నికల్లో దినకరన్ పార్టీ అభ్యర్థులు గణనీయంగా గెలిచారు. దీంతో దినకరన్ పార్టీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇదే విషయాన్ని కమల్ హాసన్ కు పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే పార్టీ శాసనసభ ఎన్నికల సమయం నాటికి పుంజుకుంటుందని పలువురు కమల్ హాసన్ కు సూచిస్తున్నారు. దీంతో కమల్ హాసన్ కూడా అంగీకరించే పరిస్థితి ఉందంటున్నారు.

చేరికలకు రెడీ…..

దీనికి తోడు కమల్ హాసన్ త్వరలోనే సుదీర్ఘకాలం యాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు ఏడాది పాటు జరగనున్న ఈ యాత్రలో తమిళనాడు మొత్తం పర్యటించనున్నారు. ఇప్పటికే అనేకమంది అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కూడా మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వైపు చూస్తున్నారు. రజనీకాంత్ ఇంకా పార్టీని ప్రకటించకపోవడంతో కమల్ హాసన్ పార్టీలో ముందుగానే కర్చీఫ్ వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద కమల్ హాసన్ పార్టీ తమిళనాడులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

Tags:    

Similar News