కమల్ ఎత్తుగడ ఫలిస్తే….?

తమిళనాడు ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రోజురోజుకూ ఎన్నికల హీట్ పెరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ అధికార అన్నాడీఎంకే కూటమి, విపక్ష డీఎంకే కూటమి మధ్యే పోటీ ఉంది. [more]

Update: 2020-11-19 17:30 GMT

తమిళనాడు ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రోజురోజుకూ ఎన్నికల హీట్ పెరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ అధికార అన్నాడీఎంకే కూటమి, విపక్ష డీఎంకే కూటమి మధ్యే పోటీ ఉంది. పదేళ్ల పాటు అన్నాడీఎంకే అధికారంలో ఉండటం, నాయకత్వ లేమితో ఆ పార్టీ పరిస్థితి బాగా లేదు. ఇక డీఎంకే సయితం కరుణానిధి మరణంతో స్టాలిన్ నాయకత్వ బాధ్యతలను చేపట్టిన తర్వాత కొంత మెరుగైన ఫలితాలు సాధించింది.

డీఎంకే దూసుకుపోతున్నా…..

ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేకే ఎక్కువ విజయావకాశా లున్నాయి. అయితే ఈ రెండు ప్రాంతీయ పార్టీలకు ప్రత్యామ్నాయం లేనేలేదు. రెండు పార్టీలకు జాతీయ పార్టీలు అండగా నిలిచాయి. అయితే తమిళనాడులో కొత్త ట్రెండ్ ప్రారంభమయింది. జయలలిత, కరుణానిధి మరణం తర్వాత రాజకీయ శూన్యత ఏర్పడింది. దీంతో కమల్ హాసన్, రజనీకాంత్ వంటి నటులు రాజకీయాల్లోకి వచ్చారు.

క్షేత్రస్థాయిలో…..

అయితే రజనీకాంత్ పార్టీ ఇంతవరకూ ప్రకటించలేదు. కమల్ హాసన్ మాత్రం మక్కల్ నీది మయ్యమ్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తొలుత కమల్ హాసన్ డీఎంకేతో సఖ్యతగా మెలిగారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని సయితం ఢిల్లీ వెళ్లి కలసి వచ్చారు. ఈ నేపథ్యంలో డీఎంకే తో కమల్ హాసన్ కలసి నడుస్తారని అందరూ ఊహించారు.

కొత్త నిర్ణయంతో…..

కానీ కమల్ హాసన్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. తానే పొలిటికల్ స్క్రీన్ పై లీడ్ రోల్ చేయాలని కమల్ హాసన్ భావిస్తున్నారు. అందుకే తన సారథ్యంలోనే తృతీయ కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. డీఎండీకే, పీఎంకే వంటి పార్టీలతో పాటు రజనీకాంత్ పార్టీలతో కలసి నడవాలని భావిస్తున్నారు. కమల్ హాసన్ ఆలోచన ఆచరణలోకి వస్తే మాత్రం తమిళనాడులో రెండు ప్రధాన పార్టీలకు ఇబ్బంది తప్పదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.

Tags:    

Similar News