కమల్ అసహనం… వార్నింగ్ అందుకేనా?

సినిమా వాళ్లు రాజకీయాలు చేయలేరు. అది అతికొద్దిమందికే సాధ్యం. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలత వంటి వాళ్లే రాజకీయాల్లో రాణించగలిగారు. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో సొంత పార్టీలు [more]

Update: 2020-08-20 17:30 GMT

సినిమా వాళ్లు రాజకీయాలు చేయలేరు. అది అతికొద్దిమందికే సాధ్యం. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలత వంటి వాళ్లే రాజకీయాల్లో రాణించగలిగారు. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో సొంత పార్టీలు పెట్టుకున్న సినిమా హీరోలు పోలింగ్ బాక్సాఫీస్ లో ఫట్ అయిపోయారు. హిట్ కాలేకపోయారు. అలాంటి వారిలో కమల్ హాసన్ ఒకరు. సినిమా హీరోలకు బయట ప్రపంచం పెద్దగా తెలియదు. వారికి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడూ ఆత్మనూన్యతతో వ్యవహరిస్తుంటారు. తాము తప్ప మరెవ్వరూ ఎదగడానికి వీల్లేదు అనుకోవడమే ఇందుకు కారణం.

పార్టీ పెట్టిన నాటి నుంచి….

తమిళనాడులో కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీ పెట్టారు. ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఫట్ అయింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ సొంతంగా పోటీ చేసే ధైర్యం చేయడం లేదు. ఏదో ఒక పార్టీతో కలసి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఆ పార్టీ అంగీకరించిన సీట్లకే కమల్ హాసన్ పరిమితమవ్వాల్సి ఉంటుంది. దీంతో సహజంగానే పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. పొత్తులో భాగంగా తమకు సీటు వస్తుందో? రాదో? అన్న ఆందోళన వారిని చివరి వరకూ టెన్షన్ కు గురి చేస్తుంది. కమల్ హాసన్ పార్టీలోనూ అదే జరుగుతుంది.

నేతలతో సమావేశాలు….

కమల్ హాసన్ పార్టీ నేతలతో నెలరోజులకొకసారి టచ్ లోకి వెళుతున్నారు. కరోనా కారణంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అనేక మంది నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటి నుంచే పోటీ పడుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరి నుంచి ముగ్గురు వరకూ టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. కమల్ హాసన్ కు ఇది ఆందోళన కల్గిస్తోంది. తాను పార్టీ పెట్టింది ప్రజాసేవ చేయడానికని, రాజకీయాలు చేయడం కోసం కాదని పదే పదే చెబుతున్నా నేతల్లో మార్పు రావడం లేదు. ఇది కమల్ హాసన్ ను కలవర పరుస్తుంది.

మూసేస్తానని వార్నింగ్….

ఇది భవిష్యత్తులో పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని భావించిన కమల్ హాసన్ ఇప్పటి నుంచే వారిని కట్టడి చేసే ప్రయత్నంలో పడ్డారు. తాను చెన్నైలో ఉన్నప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో నేతల పై నిఘా ఉందని హెచ్చరిక జారీ చేశారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించాలి కాని, బలహీనపర్చకూడదని చెప్పారు. ఇలాగే కంటిన్యూ చేస్తే పార్టీని మూసివేయడానికి కూడా వెనుకాడనని కమల్ హాసన్ వార్నింగ్ ఇచ్చారు.పార్టీ ఇంకా వేళ్లూనుకోకముందే నేతలు గాడి తప్పుతుండటంతోనే కమల్ హాసన్ ఈ వార్నింగ్ లు ఇచ్చారని తెలుస్తోంది.

Tags:    

Similar News