మౌనం వీడేదెన్నడో…?

రాజకీయాలు ఆమెకు కొట్టిన పిండి. మాటలు కూడా పదునైన బాణాలు. అయినా ఆమె గతకొద్దికాలంగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. తన మెట్టినిల్లుగా భావించే నిజామాబాద్ కు [more]

Update: 2019-12-15 00:30 GMT

రాజకీయాలు ఆమెకు కొట్టిన పిండి. మాటలు కూడా పదునైన బాణాలు. అయినా ఆమె గతకొద్దికాలంగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. తన మెట్టినిల్లుగా భావించే నిజామాబాద్ కు దూరంగా ఉంటున్నారు కల్వకుంట్ల కవిత. రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టేశారు. హైదరాబాద్ కే పరిమితమయ్యారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఏ సంఘటనపైనా కవిత స్పందించడం లేదు. రాజకీయాలంటేనే చిరాకు పడుతున్నారు కవిత.

పది నెలలు గడుస్తున్నా….

పార్లమెంటు ఎన్నికలు జరిగి దాదాపు పది నెలలు కావస్తోంది. ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన కవిత మళ్లీ నిజామాబాద్ వైపు చూడలేదు. గత కొన్నేళ్లుగా నిజామాబాద్ రాజకీయాలను శాసించిన కవిత గత పది నెలలుగా పట్టించుకోవడం మానేశారు. నిజామాబాద్ నేతలకు, క్యాడర్ కు దూరంగా ఉంటున్నారు. ఓటమిని కల్వకుంట్ల కవిత ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తాను ఎంత అభివృద్ధి చేసినా ప్రజలు విశ్వసించకపోవడాన్ని కవిత తట్టుకోలేకపోతున్నారు. కొందరు నాయకులు కూడా ఎన్నికల సమయంలో రాజకీయంగా తనను మోసం చేసినట్లు గుర్తించిన కవిత వారిని కూడా దరిదాపులకు రానివ్వడం లేదు.

ముఖ్యమైన నేతలకు తప్పించి….

కల్వకుంట్ల కవిత అంటే ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసి ఊరు వాడ తిరిగారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. నిజామాబాద్ నుంచి తొలిసారి పోటీ చేసిన గెలిచిన కవిత జిల్లా రాజకీయాలను ఒంటిచేత్తో నడిపేవారు. అయితే కేసీఆర్ సూచనల మేరకే కవిత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని తెలిసింది. ముఖ్యమైన నేతలకు మినహాయిస్తే ఎవరికీ కవిత అందుబాటులో ఉండటం లేదు. ముఖ్యమంత్రి కూతురిగా ఓటమి పాలయినప్పటికీ అధికారాన్ని చెలాయించే వీలున్నప్పటికీ కవిత మౌనం ఎందుకన్నది అర్థంకాకుండా ఉంది.

వేరే నియోజకవర్గానికి…..

నిజామాబాద్ ను వదిలేసి వేరే నియోజకవర్గాన్ని కవిత ఎంచుకుంటారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. అయితే వచ్చే ఏడాది రాజ్యసభ పదవులు ఖాళీ అవుతున్నాయి. రాజ్యసభ పదవికి కవితను ఎంపిక చేసే అవకాశం ఉందని కూడా గులాబీ పార్టీలో గుస గుసలు విన్పిస్తున్నాయి. అందుకే ఆమె రాజకీయంగా మౌనంగా ఉన్నారని చెబుతున్నారు. పార్టీ నిర్ణయం మేరకే రాజకీయాలకు దూరంగా ఉన్నారని, త్వరలోనే తీపి కబురు కవిత విషయంలో వింటారని కూడా ముఖ్యనేతలు అంటున్నారు. మరి కవిత రాజకీయంగా మౌనాన్ని ఎన్నడు వీడతారనేది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News