కవితకు ఆ ఛాన్స్ మాత్రం లేదట

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇది ఊహించిన విజయమే. ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు. అయితే ఇప్పుడు కవిత శాసనమండలికి [more]

Update: 2020-10-22 15:30 GMT

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇది ఊహించిన విజయమే. ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు. అయితే ఇప్పుడు కవిత శాసనమండలికి ఎన్నిక కావడంతో గులాబీ పార్టీలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. కవితను ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. కానీ దీనిని మాత్రం సీనియర్ నేతలు కొట్టిపారేస్తున్నారు.

మొన్నటి వరకూ ఢిల్లీలో…..

కవిత మొన్నటి వరకూ ఢిల్లీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి కవిత అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. దాదాపు ఏడాది నుంచి కవిత మౌనంగానే ఉంటున్నారు. అయితే నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కావడంతో కేసీఆర్ ఈ పదవికి కవితను ఎంపిక చేశారు. ఈ పదవికి కేవలం పదిహేను నెలలు మాత్రమే సమయం ఉంది. ఆ తర్వాత మరోసారి ఎన్నిక జరగుతుంది. కవిత అప్పుడూ కోరుకుంటే మరోసారి కూడా ఎమ్మెల్సీ అవుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు.

కేబినెట్ లోకి తీసుకుంటారంటూ….

కానీ కవిత ఇలా ఎమ్మెల్సీగా గెలిచిందో లేదో? కవితకు కేబినెట్ బెర్త్ ఖరారు అన్న వార్తలు వస్తున్నాయి. కవితను మంత్రివర్గంలోకి తీసుకోకుంటే కేసీఆర్ రాజ్యసభకు పంపేవారన్న వాదన కూడా ఉంది. ఒకనొక దశలో కవిత రాజ్యసభ నే కోరుకున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే దీనిని కొట్టిపారేస్తూ కవితను ఢిల్లీకి దూరం చేస్తూ తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకురావాలని కేసీఆర్ భావిస్తున్నారని, అందుకే ఎమ్మెల్సీని చేసి కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకుంటారని కొందరు గట్టిగా పార్టీలోనే నమ్ముతున్నారు.

కానే కాదంటున్న సీనియర్లు…..

అయితే ఈ ప్రచారాన్ని టీఆర్ఎస్ సీనియర్ నేతలు కొట్టిపారేస్తున్నారు. కవితను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే కొందరిని తొలగించాల్సి ఉంటుంది. కేసీఆర్ ఆ పనిచేయరంటున్నారు. మంత్రివర్గంలో 17 మందికే అవకాశముంది. ఇప్పటికే ఆ కోటా పూర్తి కావడంతో మరోసారి విస్తరణ జరిగితే తప్ప కవితకు ఇప్పట్లో మంత్రి అయ్యే ఛాన్స్ లేదంటున్నారు. కేసీఆర్ కూడా కవితను అంత త్వరగా మంత్రివర్గంలోకి తీసుకోరన్నది సీనియర్ నేతల నుంచి విన్పిస్తున్న మాట. మంత్రిపదవి ఇవ్వకపోయినా కేబినెట్ హోదా కలిగిన ఏదో ఒక పదవి ఇవ్వడం మాత్రం గ్యారంటీ అని గులాబీ పార్టీలో గుసగుసలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News