టీడీపీలో క‌నిపించ‌ని `క‌ళ‌`.. రీజ‌న్ ఇదేనా..?

విష‌యం ఏదైనా.. ఏదో ఒక విధంగా నిత్యం మీడియా ముందుకు వ‌చ్చే నాయ‌కుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు క‌ళా వెంక‌ట్రావు. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న సీఎం జ‌గ‌న్‌కు [more]

Update: 2020-03-21 00:30 GMT

విష‌యం ఏదైనా.. ఏదో ఒక విధంగా నిత్యం మీడియా ముందుకు వ‌చ్చే నాయ‌కుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు క‌ళా వెంక‌ట్రావు. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న సీఎం జ‌గ‌న్‌కు లేఖలు రాస్తూ నిత్యం మీడియాలోనే ఉంటున్నారు. అయితే, ఆయ‌న హ‌ఠాత్తుగా మీడియా ముందుకు రావ‌డం మానేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌డంతో టీడీపీ నుంచి నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చిఏదో కామెంట్లు చేస్తున్నారు. అయితే, క‌ళా వెంకట్రావు మాత్రం క‌ళ‌త‌ప్పిన‌ట్టు వ్యవ‌హ‌రించ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి కొంచెం లోతుగా ఆరాతీస్తే.. కీల‌క ప‌రిణామాలు క‌నిపించాయి. ప్రస్తుతం జ‌రుగుతున్న స్థానిక ఎన్నిక‌ల్లో శ్రీకాకుళంలో టీడీపీ ప‌ట్టు సాధిస్తుంద‌ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆశ‌లు పెట్టుకున్నారు. దీనికి ప్రధాన కారణం పార్టీ అధ్యక్షుడు క‌ళా వెంకట్రావు శ్రీకాకుళానికి చెందిన నాయకుడే కావ‌డం.

నామినేషన్లు కూడా వేయించలేక…..

అయితే, ఇక్కడ ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం ఎచ్చెర్లలోనే పార్టీ త‌ర‌ఫున నామినేష‌న్లు వేసే వారు కరువ‌య్యారు. పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న క‌ళా వెంకట్రావు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో రేగిడి మండ‌లం ఎంపీపీని వైసీపీ ఏక‌గ్రీవంగా గెలుచుకుంది. ఇది క‌ళాకు ఘోర అవ‌మానంలాంటిదే. వాస్తవానికి గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర పరాజయం చవి చూసినప్పటికీ పార్టీ అధ్యక్షుడిగా తన పెత్తనం సాగిస్తున్నారు. అయితే, ఆయ‌న త‌న‌ సొంత మండలంలో కనీసం పట్టు సాధించలేకపోయారు. తాజాగా జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికల్లో సొంత మండలమైన రేగిడిలో కొన్ని ఎంపీటీసీ స్థానాల‌కు తన పార్టీ అభ్యర్థుల చేత నామినేషన్‌ వేయించలేకపోయారు.

అందుకే దూరమయ్యారట…..

నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కేడ‌ర్ క‌ళా వెంకట్రావును ధిక్కరించ‌డం గ‌మనార్హం. క‌ళా చెపుతున్నా ఇక్కడ మండ‌ల పార్టీ అధ్యక్షులు సైతం ఆయ‌న్ను భేఖాతార్ చేస్తున్నట్టు జిల్లా పార్టీ వ‌ర్గాలే చ‌ర్చించు కుంటున్నాయి. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీటీసీ స్థానాల‌కు నామినేషనే వేయలేదంటే అక్కడ టీడీపీ కార్యకర్తలే లేరా అనే సందేహం వ‌స్తుంది. అయితే, ఉన్నారు. కానీ, రాష్ట్రంలో వెనకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందేందుకు దోహదపడే పరిపాలన వికేంద్రీకరణకు అడ్డుతగలడం, మూడు రాజధానులు వద్దు – అమరావతే ముద్దు అని చంద్రబాబు అజెండాను భుజానికెత్తుకుని ముందుకెళ్లడం వలన పార్టీకి నాయ‌కులు దూర‌మ‌య్యార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

రాజాంలోనే ఉంటూ….

ఈ ప‌రిణామాల ఎఫెక్ట్‌తో త‌ల ఎత్తుకోలేక క‌ళా వెంకట్రావు మీడియా ముందుకు కూడా రావ‌డం లేద‌ని టీడీపీలోని ఓ వ‌ర్గం ఆఫ్ ది రికార్డుగా ప్రచారం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇక ఎన్నిక‌ల్లో పార్టీ ఘోర ఓట‌మితో పాటు క‌ళా వెంకట్రావు నియోజ‌క‌వ‌ర్గంలో నిర్లిప్తంగా ఉండ‌డం.. ఎచ్చెర్ల వ‌దిలేసి రాజంలో ఉండ‌డం కూడా ఆయ‌న‌కు మైన‌స్ అయ్యింది. ఇక ఆయ‌న్ను రాష్ట్ర పార్టీ ప‌గ్గాల నుంచి త‌ప్పించేసి అచ్చెన్నాయుడు లేదా రామ్మోహ‌న్ నాయుడికి ఇస్తార‌ని కూడా టాక్‌.

Tags:    

Similar News