ఆ జిల్లాలో డాక్టర్లే పొలిటిక‌ల్ కింగ్‌లు

సాధార‌ణంగా నేను డాక్టర్ కాబోయి.. యాక్టర్ అయ్యాన‌నే హీరోలు మ‌న‌కు తెలిసిందే. ఇలాంటివారు చాలా మందే మ‌న‌కు సినీ ఇండ‌స్ట్రీలో క‌నిపిస్తారు. అయితే రాజ‌కీయాల్లోనూ డాక్టర్లు నేత‌లైన [more]

Update: 2020-12-11 02:00 GMT

సాధార‌ణంగా నేను డాక్టర్ కాబోయి.. యాక్టర్ అయ్యాన‌నే హీరోలు మ‌న‌కు తెలిసిందే. ఇలాంటివారు చాలా మందే మ‌న‌కు సినీ ఇండ‌స్ట్రీలో క‌నిపిస్తారు. అయితే రాజ‌కీయాల్లోనూ డాక్టర్లు నేత‌లైన సంద‌ర్బాలు అనేకం ఉన్నాయి. మ‌న రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో అనేక మంది డాక్టర్లు.. నాయ‌కులుగా అవ‌తారం ఎత్తిన సంద‌ర్భాలు ఉన్నాయి. వైద్యులుగా ప్రజాద‌ర‌ణ పొంద‌డ‌మే కాకుండా.. రాజ‌కీయాల్లోనూ వారు త‌మ‌దైన శైలిని కొన‌సాగించారు. అంతేకాదు త‌మ సేవ‌ల‌తో ప్రజ‌ల‌ను రాజ‌కీయంగా కూడా మెప్పించారు. గ‌త మూడు ద‌శాబ్దాల తెలుగు రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే ఎంతో మంది డాక్ట‌ర్లు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు. ఇక ఏపీలోని ఒక జిల్లా అయితే.. ఎక్కువ మంది డాక్టర్ నేత‌ల‌కు పుట్టినిల్లుగా మారింది. ఇక్కడ నుంచి రాజ‌కీయ అరంగేట్రం చేసిన అనేక మంది నాయ‌కులు పూర్వాశ్రమంలో వైద్యులుగా ప్రజ‌ల‌తో జై కొట్టించుకున్నారు.

వైఎస్సార్ తో పాటు…..

ఇక‌, రాజ‌కీయాల్లోనూ వారు మంచి రాణింపు పొందారు. త‌మ‌కంటూ.. ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. వారు ఎంపీలు, ఎమ్మెల్యేలే కాకుండా మంత్రులు.. చివ‌ర‌కు ముఖ్యమంత్రి స్థాయి వ‌ర‌కు ఎదిగి రాష్ట్ర రాజ‌కీయాల‌ను శాసించారు. ఆ జిల్లానే క‌డ‌ప. క‌డప జిల్లా నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వారిలో డాక్లర్లు ఎక్కువ‌గా క‌నిపిస్తారు. వీరిలో దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరు ఈ రాష్ట్రంలో స‌రికొత్త రికార్డును సృష్టించింది. కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం ఉన్న ఆయ‌న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప‌నిచేశారు. రూపాయి డాక్టర్‌గా ఆయ‌న ఎంతో పేరు తెచ్చుకున్నారు. అదే స‌మ‌యంలో పేద‌ల పెన్నిధిగా కూడా ఆయ‌న పేరు గ‌డించారు. క‌ర్నాట‌క‌లోని గుల్బ‌ర్గాలో ఎంబీబీఎస్ చేసిన వైఎస్‌..త‌ద‌నంత‌ర కాలంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా.. అదే ప్ర‌జాద‌ర‌ణ‌ను కొన‌సాగించారు. ఓట‌మి ఎరుగ‌ని నాయ‌కుడిగా ఆయ‌న నిల‌వ‌డాన్ని బ‌ట్టి ఆయ‌న ఏ రేంజ్‌లో ప్రజ‌ల అభిమానం చూర‌గొన్నారో అర్ధ‌మ‌వుతుంది.

సీనియర్ నేతలందరూ….

ఇక‌, ఇదే జిల్లాకు చెందిన ఎంవీ మైసూరారెడ్డి కూడా డాక్టర్‌. ఈయ‌న కూడా కాంగ్రెస్‌లోనే చ‌క్రం తిప్పారు. త‌ర్వాత కాలంలో టీడీపీలోకి వెళ్లి రాజ్యస‌భ స‌భ్యుడు అయ్యారు. అనంత‌రం వైసీపీలోకి వ‌చ్చినా ఇక్కడ ఇమ‌డ‌లేక పోయారు. అయితే అటు డాక్టర్‌గా.. ఇటు నాయ‌కుడిగా ఆయ‌న చిర‌స్థాయి గుర్తింపు పొందారు. ఇక‌, క‌డ‌ప జిల్లాలో మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు కైవ‌సం చేసుకున్న డీఎల్ ర‌వీంద్రారెడ్డి కూడా పూర్వాశ్రమంలో వైద్యుడే కావ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న కూడా ప్రజ‌ల‌కు చాలా స‌న్నిహితంగా ఉంటూ.. వైద్య సేవ‌ల‌ను అందించారు. రాజ‌కీయంగా ఆయ‌న కూడా వ‌రుస విజ‌యాలు సాధించారంటే.. ప్రజ‌ల‌కు ఏ రేంజ్‌లో చేరువ అయ్యారో తెలుస్తుంది.

ప్రజలకు వైద్య సేవలందించి….

ర‌వీంద్రారెడ్డికి కూడా పేద‌ల డాక్టర్‌గా మంచి పేరుంది. ఆయ‌న ఆరుసార్లు మైదుకూరు ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో పాటు మంత్రిగా కూడా ప‌నిచేశారు. కాంగ్రెస్ లో ఉన్న ఆయ‌న రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. స‌రైన నిర్ణ‌యం తీసుకోలేద‌నే వ్యాఖ్యలు వినిపించాయి. దీంతో ఆయ‌న రాజ‌కీయంగా స్తబ్దత‌లో ఉన్నారు. ఇక‌, మాజీ ఎమ్మెల్యేలు క‌సిరెడ్డి మ‌ధుసూద‌న్‌రెడ్డి, ఎంవీ.ర‌మ‌ణారెడ్డి కూడా పూర్వాశ్రమంలో వైద్యులుగా ప్రజ‌ల‌కు సేవ‌లందించారు. ఇటు రాజ‌కీయంగా కూడా త‌మ‌దైన గుర్తింపు సాధించారు.

ఎక్కువ మంది వారే…..

ఇక ప్రస్తుతం జ‌మ్మల‌మ‌డుగు ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్‌రెడ్డి సైతం వైద్యుడే. ఆయ‌న డాక్టర్ గా ఉంటూ జ‌మ్మల‌మ‌డుగులో మంచి పేరు తెచ్చుకున్నారు. అక్కడ రామ‌సుబ్బారెడ్డి, ఆదినారాయ‌ణ రెడ్డి లాంటి ఇద్దరు నేత‌ల‌ను ఢీ కొట్టి మ‌రీ గెలిచారు. యువ‌కుడిగా ఉన్న సుధీర్‌రెడ్డి రాజ‌కీయంగా ఇప్పుడిప్పుడే దూకుడుగా వెళుతున్నారు. ఇలా మొత్తంగా క‌డ‌ప జిల్లాలో చాలా మంది వైద్య వృత్తిలో రాణించి.. ఆ త‌ర్వాత రాజ‌కీయ నాయ‌కులుగా మారి స‌త్తా చాటారు. గ‌త నాలుగు ద‌శాబ్దాల నుంచి ఇక్కడ డాక్టర్లే రాజ‌కీయ నేత‌లుగా చ‌క్రం తిప్పుతున్నారు.

Tags:    

Similar News