కేకే కు ఆ పట్టు ఎలా దొరికిందో….?

కె.కేశవరావు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్ద మంచి పట్టు సంపాదించారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న కే. కేశవరావు ఏనాడూ ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. [more]

Update: 2021-02-22 00:30 GMT

కె.కేశవరావు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్ద మంచి పట్టు సంపాదించారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న కే. కేశవరావు ఏనాడూ ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. జర్నలిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించిన కే. కేశవరావు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ లోనూ రాజ్యసభ పదవిని కేకే పొందగలిగారు. రాష్ట్ర విభజన సమయంలోనూ కే. కేశవరావు ముఖ్య పాత్ర పోషించారు. తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు.

ఎనలేని ప్రాధాన్యత…..

టీఆర్ఎస్ లో కేసీఆర్ కే. కేశవరావు కు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. సాధారణంగా కేసీఆర్ దగ్గరకు తీస్తే కొంతకాలమే అన్న టాక్ పార్టీలో విన్పిస్తుంది. అలాంటి కే. కేశవరావు ను కేసీఆర్ రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు. 2006 నుంచి కే. కేశవరావు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నా రెండు దఫాలు ఆయనకు కేసీఆర్ అవకాశం ఇవ్వడంపై పార్టీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు.

పార్టీలోనూ కీలక పదవి…..

కే. కేశవరావుకు పార్టీలోనూ అత్యున్నత పదవిని కట్టబెట్టారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ గా నియమించారు. ఎన్నికల సమయంలో కీలకమైన మ్యానిఫేస్టో కమిటీ కూడా కే. కేశవరావు నేతృత్వంలోనే పనిచేసింది. ఇక పార్లమెంటరీ పక్ష నేతగా కూడా కే. కేశవరావుకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. కేసీఆర్ చెప్పిన పనిని ఢిల్లీలో చక్క బెట్టే బాధ్యతను కే. కేశవరావు తీసుకుంటారు. ఆయన అప్పగించిన పనిని సక్సెస్ ఫుల్ గా చేస్తారు.

కుమార్తెకు మేయర్ పదవి…..

అందుకే కే. కేశవరావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. తాజాగా కే. కేశవరావు కుమార్తె విజయలక్ష్మికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కేసీఆర్ ఎంపిక చేశారు. నిజానికి జనరల్ మహిళకు ఈ పదవి కేటాయించినా బీసీ సామాజిక వర్గానికి చెందిన కే. కేశవరావు కుమార్తెను ఎంపిక చేయడంతో ఆయనకు ఎంత ప్రాధాన్యత పార్టీలో లభిస్తుందో చెప్పకనే తెలుస్తోంది. కేసీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఇంతటి ప్రాధాన్యత ఏ నేతకూ ఇవ్వలేదని పార్టీ నేతలే విస్తుబోతున్నారు.

Tags:    

Similar News