ఓ నమస్కారం పెట్టినట్లేనా?

జానారెడ్డి. సుదీర్ఘకాలం మంత్రిగా బాధ్యతలను చేపట్టిన నేత. కానీ 2018 ఎన్నికల తర్వాత జానారెడ్డి దాదాపు రాజకీయాలకు దూరమయినట్లే కన్పిస్తుంది. టీఆర్ఎస్ చేతిలో ఓటమి పాలు కావడంతో [more]

Update: 2020-02-09 18:29 GMT

జానారెడ్డి. సుదీర్ఘకాలం మంత్రిగా బాధ్యతలను చేపట్టిన నేత. కానీ 2018 ఎన్నికల తర్వాత జానారెడ్డి దాదాపు రాజకీయాలకు దూరమయినట్లే కన్పిస్తుంది. టీఆర్ఎస్ చేతిలో ఓటమి పాలు కావడంతో ఆయన పూర్తిగా వైరాగ్యంలోకి వెళ్లిపోయారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రాంతంలో ప్రచారానికే పరిమితమయ్యారు. ఇక పార్టీ కార్యాలయానికి, కార్యక్రమాలకు కూడా జానారెడ్డి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుత రాజకీయాలు తనకు సరిపడేలేవన్నది జానారెడ్డి మాట. అందుకే దాదాపు రాజకీయాలకు ఆయన దూరమయినట్లే కన్పిస్తుంది.

ముక్కుసూటి నేతగా…..

జానారెడ్డి… ముక్కుసూటి నేత. తమ ప్రత్యర్థులను కూడా ప్రశంసలతో ముంచెత్తగలరు. కేసీఆర్ ను ఆయన పథకాలను పలుమార్లు పొగిడి అనేకసార్లు వార్తల్లోకి ఎక్కారు. జానారెడ్డి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1978 నుంచి జానారెడ్డి ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత హాలియా పేరు మీద ఉన్న నియోజకవర్గం పునర్వ్యవస్థీకరణ తర్వాత నాగార్జున సాగర్ గా మారింది. అక్కడి నుంచే జానారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవులు కూడా చేపట్టారు. 1994లో మాత్రం జానారెడ్డి ఓటమిపాలయ్యరు. తర్వాత 2018లో మళ్లీ జానారెడ్డిని ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా…..

2014 ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జానారెడ్డి అంచనా వేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వడంతో ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారని నమ్మారు. తెలంగాణ ఉద్యమంలో జానారెడ్డి అన్ని పార్టీలకూ పెద్దమనిషిగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయిపోదామని జానారెడ్డి కలలు కన్నారు. కానీ జానారెడ్డి కల ఫలించలేదు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు పట్టం కట్టారు. అప్పుడు జానారెడ్డి సీఎల్పీ లీడర్ పదవికి మాత్రమే పరిమితమయ్యారు.

పార్టీ కార్యక్రమాలకు…..

ఇక 2018 ఎన్నికల్లో జానారెడ్డి ఓటమి పాలు కావడం, కాంగ్రెస్ మరో సారి అధికారంలోకి రాలేకపోవడంతో పెద్దాయన ఇక పెదవి విప్పడం లేదు. వరస ఓటములతో కాంగ్రెస్ తెలంగాణలో కకావికలమైంది. కాంగ్రెస్ పార్టీ బాగున్నప్పుడే తన కుమారుడిని రాజకీయ అరంగేట్రం చేయాలనుకున్నా అధిష్టానం సూచనలతో అది కుదరలేదు. దీంతో జానారెడ్డి సుదీర్ఘ రాజకీయాలకు ఇక తెరపడినట్లేనని చెబుతున్నారు. చాలా అరుదుగా గాంధీ భవన్ కు వస్తున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి కూడా పెద్దగా వెళ్లడం లేదు. హైదరాబాద్ కే పరిమితమయ్యారు. దీంతో జానారెడ్డి రాజకీయ జీవితం ఇక ముగిసినట్లేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News