అసాధ్యుడు... గంట మోగించాడు....!

Update: 2018-09-03 15:30 GMT

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తన ముచ్చట తీర్చుకున్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సరిహద్దులు చెరిపేయాలనుకున్న సరదా తీరిపోయింది. ఇక ఎన్నికలే తరువాయి. ఒక్కో సందర్భంలో ఒక్కో లక్ష్యంతో ఎత్తుగడలు వేస్తూ ముందుకు సాగుతుంటారు కేసీఆర్. ఈసారి మాత్రం బహుముఖ లక్ష్యం. దానిని పరిపూర్తి చేసుకునే లక్ష్యంతో తలపెట్టిన రాజకీయ శంఖారావమే ప్రగతి నివేదన. ఇరవై అయిదు లక్షల మందితో భారత దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని సభను తలపెట్టారు. జన సమీకరణ లక్ష్యం నాలుగోవంతుకే పరిమితమైనా అనుకున్న ఆశయమైతే నెరవేరింది. రాజకీయ సంగ్రామానికి ఒక ఊపు తెచ్చారు. పార్టీలో ఉత్సాహాన్ని నింపారు. ప్రజలను ప్రభుత్వంతో,పార్టీతో అనుసంధానం చేయాలనుకున్న కోరిక నెరవేర్చుకునే క్రమంలో తొలి అడుగు వేశారు. గత ఏడాది ఏప్రిల్లో వరంగల్ లో జరిగిన ప్రగతి నివేదనతో పోలిస్తే ఈ సారి నిర్వహించిన సభకు ఎంతో రాజకీయ ప్రాధాన్యం ఉంది. ఇంతటి పెద్ద సభ సార్వత్రిక ఎన్నికలకు ముందు మరొకటి ఉండకపోవచ్చు. కాంగ్రెసు వంటి ప్రత్యర్థి పార్టీలకు సాధ్యం కాకపోనూ వచ్చు.

మూడే ముక్కల్లో...

కేసీఆర్ ఏది చేసినా , చెప్పినా ముక్కుసూటిగా ఉంటుంది. అయితే అందులో వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహం అమలై దాని ఫలితం లభించినప్పుడు మాత్రమే దాని ఆంతర్యం అర్థమవుతుంది. కేసీఆర్ మాటల్లోని సారాంశం అనుభవైకవేద్యమవుతుంది. ముందుగా విషయం అంతుబట్టకపోవడం వల్లనే ప్రత్యర్థి రాజకీయ పార్టీలు, ప్రత్యర్థి నాయకులు బొక్కబోర్లా పడుతుంటారు. ప్రగతి నివేదన సభతోనూ మరోసారి అదే చాకచక్యాన్ని ప్రదర్శించారు. ప్రతిపక్షాలపై రాజకీయాస్త్రాన్ని ప్రయోగించారు. నిన్నటి స్వప్నం అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం నేటి వాస్తవం. బంగరు తెలంగాణను ఆవిష్కరించడం రేపటి భవిష్యత్తు. ఈ మూడింటిని ప్రజలతో ముడిపెట్టి తనదైన వాగ్బాణాలతో మంత్రముగ్ధం చేయడం ఆయనకే చెల్లింది. సంక్షేమం, అభివృద్ధి, సాధికారత అనే తారకమంత్రాన్ని పఠించారు. సంక్షేమ పథకాల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. రాష్ట్రంలో కోటిమందికిపైగా వ్యక్తిగత లబ్ధి పథకాలు అమలు చేయడం చిన్న విషయం కాదు. రైతుబంధు, ఆసరా పించన్లు, బీమా, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, విద్యార్థులకు పీజు రీఎంబర్స్ మెంట్ వంటి పథకాలపై ఏటా నలభైవేల కోట్లరూపాయలకుపైగా ఖర్చు చేస్తోంది. ఇదంతా ఒకే వేదికపై నుంచి చాటిచెప్పాలనుకున్న కేసీఆర్ ఆశ నెరవేరింది.

మూడుపేటల బంధం...

ముఖ్యంగా ఎన్నికల కాలం సమీపిస్తుండటంతో కేసీఆర్ చాలా వేగంగా కదులుతున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిని పొందుతున్నవారిని పార్టీకి అనుసంధానం చేసుకోవాలి. అందుకే ఇంటికొక్కరు కదలిరావాలని పిలుపునిచ్చారు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోనూ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులున్నారు. మూడుకోట్ల డెబ్భైలక్షల జనాభా ఉంటే కోటి మంది వరకూ ప్రభుత్వ పథకాల వ్యక్తిగత లబ్ధిదారులున్నారు. కుటుంబానికి సగటున 3.6 మంది ఉన్నారు. అంటే ఏవో కొన్ని లక్షల కుటుంబాలను మినహాయిస్తే ప్రతి ఇంట్లోనూ ప్రభుత్వ లబ్ధిదారులున్నట్లే చెప్పుకోవచ్చు. వారందరినీ టీఆర్ఎస్ సానుభూతిపరులుగా మార్చాలనేది లక్ష్యం. ప్రగతి నివేదన సభలో తాము ప్రజలకు అందిస్తున్న సాయాన్ని గుర్తించి తమకు విశ్వాసపాత్రంగా ఉండాలని అంతర్లీనంగా అభ్యర్థించారు. ప్రజలు, ప్రభుత్వం, పార్టీ వీటి మధ్య ఉండే సన్నని గీతను మరింత పలుచన చేసేశారు. ఏర్పాట్లు మొదలు సభను విజయవంతం చేయడం వరకూ ప్రభుత్వ యంత్రాంగం కీలకపాత్ర పోషించింది.

తీన్మార్ పాలిటిక్స్...

రాజకీయంగా ఎన్నికల గంట మోగించేశారు. హోరెత్తించేశారు. ఇక అసెంబ్లీని రద్దు చేయడమే తరువాయి. ప్రత్యర్థి పార్టీల గురించి ప్రజలు ఆలోచన సైతం చేయకుండా నిరోధించడమే లక్ష్యంగా కేసీఆర్ తలపెట్టిన రాజకీయ యజ్ణం మొదలైంది. ప్రగతి నివేదన తొలి అడుగు. రానున్న మూడు నెలల్లో ఈ చదరంగం లో ఎన్ని ఎత్తులు పడతాయో తెలియదు. బీజేపీ, కాంగ్రెసు, టీడీపీ, వామపక్షాలు, తెలంగాణ జనసమితి వంటి ప్రత్యర్థులు అనేకమంది ఉన్నారు. వారి అనైక్యతే కేసీఆర్ బలం. ప్రజల్లో తనకు ఉన్న మద్దతుకు తోడు ప్రత్యర్థుల బలహీనత సైతం తెలుసు. అందుకే అందరి కంటే ముందుగానే పావులు కదపడం ప్రారంభించారు. ఇటువైపు సైన్యం సిద్ధం. అటువైపు నుంచి ఇంకా బలగాలు సంఘటితం కావాల్సి ఉంది. ప్రత్యర్థులు కకావికలమవుతారా? కలిసికట్టుగా పోరాడతారా? అన్నది తేలాల్సి ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News