జగన్ ని ముంచేస్తున్నారా

తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాజకీయ ఉద్దండుడు. ఆయన చంద్రబాబు కంటే నాలుగాకులు ఎక్కువ చదివారు. కాబట్టి మంత్రి పదవి తనకు ఇవ్వని బాబుకు ఉమ్మడి ఏపీలో [more]

Update: 2019-08-16 02:00 GMT

తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాజకీయ ఉద్దండుడు. ఆయన చంద్రబాబు కంటే నాలుగాకులు ఎక్కువ చదివారు. కాబట్టి మంత్రి పదవి తనకు ఇవ్వని బాబుకు ఉమ్మడి ఏపీలో మళ్ళీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోనీయకుండా చేశారు. అదే సమయంలో తాను కోరుకున్నట్లుగానే తెలంగాణా తెచ్చుకుని ఇప్పటికి రెండవమారు కూడా బంపర్ మెజారిటీతో అధికారం అనుభవిస్తున్నారు. ఎప్పటికి ఏది అవసరమో ఆ మేరకు వియ్యం నెయ్యం నెరిపే కేసీఆర్ మోడీ, షా జోడీకే గట్టి ఝలక్ ఇచ్చిన వారు. ముందస్తు ఎన్నికలు పెట్టించుకునేందుకు మోడీ సాయం తీసుకున్న కేసీఆర్ సీఎం సీటు పట్టగానే జాతీయ రాజకీయలంటూ ఫెడరల్ ఫ్రంట్ పేరు మీద హడావుడి చేశారు. ఇక తెలంగాణ ఇచ్చి అన్ని విధాలుగా నష్టపోయిన సోనియాగాంధికి సైతం హ్యాండ్ ఇచ్చిన ఘనత కూడ కేసీఆర్ దే. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు కేసీయార్ వ్యూహాత్మక రాజకీయాల గురించి మాట్లాడాల్సివస్తే.

జగన్ తో స్నేహం…

జగన్ తండ్రి దివంగత వైఎస్సార్ తో కేసీఆర్ కి అసలు పొసిగేది కాదు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తును ఢిల్లీ పెద్దలు కుదిర్చారు తప్ప అటూ ఇటూ ఎవరికీ ఇష్టం లేదు. ఆ తరువాత కేసీఆర్ కి బ్రేకులు వేసేలా వైఎస్సార్ సీఎం హోదాలో చేయని ప్రయత్నం లేదు. కేసీఆర్ సైతం కాంగ్రెస్ జాతీయ నాయకత్వంతో బంధం పెంచుకుని వైఎస్సార్ కి సవాల్ చేశారు. ఇలా ఈ ఇద్దరి మధ్యన రాజకీయ యుధ్ధం ఓ రేంజిలో సాగింది. ఇక జగన్ విషయానికి వస్తే ఆయన్ని తెలంగాణాలో ఓదార్పు యాత్ర చేయనీయకుండా అడ్డుకున్నది ఈ కేసీఆర్ పార్టీ అన్న సంగతి తెలిసిందే. మరి ఎపుడు కుదిరిందో ఇద్దరి మధ్యన మంచి దోస్తీ ఇపుడు సాగుతోంది. ఇద్దరికీ ఉమ్మడి శత్రువుగా బాబు ఉండడం వల్లనే ఇది సాధ్యపడిందన్నది కూడా వాస్తవం. ఇక జగన్ చూస్తే రాజకీయంగా అనుభవం తక్కువ కలిగిన వారు. వ్యూహాలు పెద్దగా తెలిసిన వారు కాదు, అదే సమయంలో జనాదరణ పుష్కలంగా ఉండడంతో ముఖ్యమంత్రి కాగలిగారు. అది కూడా ఆయన తండ్రి వైఎస్సార్ చరిష్మా జగన్ కి బాగా ఉపయోగపడింది.

కేసీఆర్ వ్యూహంతో రచ్చ….

జగన్ సీఎం అయ్యాక కేసీఆర్ ఏపీ పర్యటనలు బాగా పెరిగాయి. అంతవరకూ బాగానే ఉన్నా కూడా కేసీఆర్ ఆంధ్రాకు సంబంధించి ఇస్తున్న ప్రకటనలు ఏపీ ప్రజలకు పుండు మీద కారం జల్లినట్లుగా ఉంటున్నాయని అంటున్నారు. పైగా తాము ఎన్నుకున్న ముఖ్యమంత్రి జగన్ ని తక్కువ చేసేలా కేసీఆర్ కామెంట్స్ ఉంటున్నాయని కూడా భావిస్తున్నారు. రాయలసీమను రతనాల సీమగా చేస్తాను అంటూ కేసీఆర్ తాజాగా ఏపీ టూర్లో చేసిన ప్రకటన జగన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలా ఉందని అంటున్నారు. కేసీఆర్ పొరుగు రాష్ట్రం సీఎం. ఆయన ఏపీకి రావచ్చు. వెళ్లవచ్చు, సీఎం జగన్ తో చర్చలు జరపవచ్చు, ఇలా ఓపెన్ గా పక్క రాష్ట్ర సీఎం మరో రాష్ట్రం సమస్యల గురించి మాట్లాడడం ఎంతవరకు సబబు అని వైసీపీ నేతలే గుస్సా అవుతున్నారు.

జగన్ బదనామేనా :

సోషల్ మీడియాలో కూడా దీని మీద గట్టిగానే కేసీఆర్ కి సెటైర్లు పడుతున్నాయి. ఇంతే కాకుండా జగన్ ని తాను ఏదో గైడ్ చేస్తున్నట్లుగా కేసీఆర్ ఇస్తున్న బిల్డప్ కూడా ఏపీ జనాలకు చిర్రెత్తుకొస్తొందని అంటున్నారు. జగన్ ని జూనియర్ గా, కుర్ర నేతగా కేసీఆర్ భావిస్తున్నట్లుగా ఆయన ప్రకటనలు ఉన్నాయని అంటున్నారు. జగన్ ని నిండా ముంచేలా కేసీయర్ రాజకీయం ఉందని కూడా భావిస్తున్నారు. కేసీఆర్ వాచాలత్వం వల్ల జగన్ కి ఏమీ తెలియదని జనం ముందు ప్రొజెక్ట్ చేయడం జరుగుతోందని, దాన్ని టీడీపీ వారు అవకాశంగా తీసుకుంటే రాజకీయంగా జగన్ బాగా నష్టపోతారని కూడా అంటున్నారు. మరి కేసీఆర్ వ్యవహారశైలిని జగన్ సైతం కొంత కంట్రొల్ చేయాల్సిన బాధ్యత ఉందని సూచనలు అందుతున్నాయి.

Tags:    

Similar News