అందరికీ టిక్కెట్లు.. హంబగ్....!

Update: 2018-09-14 15:30 GMT

‘తాంబూలాలిచ్చేశాం..తన్నుకు చావండి’ అన్నట్లుగా ఏక్ దమ్ 105 మందికి టిక్కెట్లు ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కేసీఆర్. నిజంగా వారంతా నెగ్గే క్యాండిడేట్లేనా? అంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గెలుపు గుర్రాలను ఎంచుకోవడంలో ఆరితేరిన ముఖ్యమంత్రి ఎందుకిలా చేశారు? ఎవరి సత్తా ఏమిటో తేల్చే వ్యూహం దాగి ఉందంటున్నారు పార్టీనాయకులు. ఆషామాషీగా అభ్యర్థులను ప్రకటించలేదు. అభ్యర్థులను మార్చం. పనిచేసుకోండి అంటూ చాలాకాలంగా కేసీఆర్ చెబుతూ వస్తున్నారు. ఆ మాటపై భరోసాతో చాలామంది ఎమ్మెల్యేలు తమకేమీ ఫర్వాలేదనే భరోసాతో ఉన్నారు. చాలామంది పనితీరును మెరుగుపరుచుకోలేదు. ఇదంతా కేసీఆర్ దృష్టిలో ఉంది. నియోజకవర్గాల వారీ బలమైన క్యాండిడేట్ల జాబితా కూడా ఆయన వద్ద ఉంది. ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయంగా ఎవరిని బరిలోకి దింపాలనే విషయంలోనూ స్పష్టత ఉంది. అయినా అవే పేర్లు ప్రకటించేశారు. ఇందులోని మర్మమేమిటంటూ అందరూ తలలు పట్టుకుంటున్నారు. తీవ్రస్థాయి అసంతృప్తి, తిరుగుబాట్లు , ఆందోళనలు కనిపిస్తున్నప్పటికీ కేసీఆర్ చిద్విలాసంగా ఉన్నారు.

వ్యూహంలో భాగమే...

ఎన్నికలకు ముందుగా నాయకుల సత్తా తేల్చేపనిలో పడ్డారు కేసీఆర్. తానిచ్చిన మాట ప్రకారం అందరూ పాతవాళ్లకే టిక్కెట్లిచ్చేస్తున్నట్లు చెప్పేశారు. అప్పుడు మొదలైంది గందరగోళం. ఆత్మాహుతుల వరకూ పరిస్థితి తీవ్రంగా కనిపిస్తోంది. ఈ బెడదను తట్టుకుని తమను తాము నిరూపించుకుని అసమ్మతిని అణచిగలిగినవాళ్లే రంగంలో నిలుస్తారు. అధిష్టానం ఒకస్థాయి వరకూ మద్దతు ఇస్తుంది. అయితే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైతే అభ్యర్థులను కొనసాగించే ప్రసక్తే లేదని అగ్రనాయకులకు కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు. చాలాకాలం ముందుగానే తాను క్యాండిడేట్ల విషయాన్ని కన్పర్మ్ చేసినప్పటికీ నియోజకవర్గాల్లో అందరినీ కలుపుకుని పోయేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నించలేదని అంచనాకు వచ్చారు. ఇప్పటికైనా తమ బలాన్ని నిరూపించుకునేందుకు ఒక అవకాశం ఇచ్చినట్లే. టిక్కెట్లు ఆశిస్తున్న కొందరు నాయకులు తిరుగుబాటు లేవనెత్తినప్పటికీ దానిని సర్దుబాటు చేసుకోవాల్సిన బాధ్యత అభ్యర్థులదే అని కేసీఆర్ తేల్చేశారు. సొంతపార్టీని ఒక బాటలోకి తేలేకపోతే బలమైన ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొంటారని కేసీఆర్ కొందరిని ప్రశ్నించారు. ఒకవేళ నియోజకవర్గాల్లో అసమ్మతి నాయకులు దారికి రాకపోతే వారి ప్రధాన అనుచర వర్గాన్ని ఆకట్టుకుని ముఖ్యనాయకులను బలహీనపరచాలని సూచించారు. వీటన్నిటినీ తట్టుకుని నిలబడిన వారికే టిక్కెట్లు చివరి వరకూ నిలుస్తాయి.

క్రమశిక్షణకు కొలమానం....

చివరి క్షణాల్లో చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయంటూ ప్రచారం సాగుతోంది. 25 నుంచి 30 నియోజకవర్గాల్లో అభ్యర్థుల సీట్లు గల్లంతు కావచ్చునంటున్నారు. మరో 15 రోజుల్లో ఈ జాబితా సిద్దమైపోతుందని పార్టీ వర్గాల సమాచారం. అసమ్మతిని సక్సెస్ ఫుల్ గా అణచివేసి తమ ప్రాబల్యాన్ని నిరూపించుకున్నవారి టిక్కెట్లకు ఎటువంటి ఢోకా లేదు. ఒక మోస్తరు అసంత్రుప్తి మాత్రమే ఉన్నచోట్ల అధిష్టానం మాట్లాడి సర్దుబాటు చేస్తుంది. పెద్ద ఎత్తున తిరుగుబాటు కనిపించిన నియోజకవర్గాల్లో పరిస్థితులు సద్దుమణగకపోతే క్యాండిడేట్లు మారిపోతారు. అయితే ఆందోళనకు నాయకత్వం వహించిన వారికి కాకుండా ఇతరపార్టీల నుంచి మంచి అభ్యర్థులను తీసుకుని వచ్చి పోటీ చేయించాలనే యోచనలో ఉంది టీఆర్ఎస్. క్రమశిక్షణకు భిన్నంగా వ్యవహరించినవారిని ఉపేక్షించే ప్రసక్తేలేదని తద్వారా చాటిచెప్పాలని చూస్తున్నారు. బలహీనంగా ఉన్న అభ్యర్థికి, తిరుగుబావుటా ఎగరేసిన అసమ్మతి వాదికి కాకుండా మూడో వ్యక్తి టిక్కెట్టు ఎగరవేసుకుపోవడం ఖాయమంటున్నారు.

కాసింత భయమే...

పైకి ఎంత గాంభీర్యాన్ని నటించినా తెలుగుదేశం, కాంగ్రెసు కలుస్తాయంటే టీఆర్ఎస్ కొంత ఆందోళనకు గురవుతోంది. తెలుగుదేశానికి కొంతమేరకు స్వాభావికమైన ఓటు బ్యాంకు ఉంది. 23 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యేల కంటే బలమైన నాయకులు టీడీపీకి ఉన్నారు. టీఆర్ఎస్ తో పోల్చి చూస్తే కాంగ్రెసులో సైతం బలమైన నాయకులకు కొదవలేదు. కేవలం కేసీఆర్ బలంపై ఆధారపడి మాత్రమే అధికారపార్టీ అభ్యర్థులు నెగ్గాల్సిన పరిస్థితులున్నాయి. అయిదువేల వరకూ కనీస వ్యక్తిగత ఓటు బ్యాంకు ఉన్నవారిని వేళ్లమీద లెక్కించవచ్చు. అందువల్ల వారిని నమ్ముకుని టీఆర్ఎస్ రంగంలోకి దిగలేదు. పూర్తి బాధ్యతను కేసీఆర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈపరిస్థితుల్లో స్థానికంగా తిరుగుబాట్లు,అసమ్మతి వంటివి తీవ్రంగా ఉంటే గెలుపు అవకాశాలపై పెను ప్రభావం పడుతుంది. ప్రస్తుతం టీఆర్ఎస్ ను వేధిస్తున్న భయమిదే. అందువల్లనే ఆచితూచి అడుగులు వేయకతప్పదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News