కేసీఆర్ కు జమిలీ ....ఝలక్...!

Update: 2018-09-01 15:30 GMT

‘ఒకే దేశం ఒక్కసారే ఎన్నికలు’ నినాదాన్ని ఎత్తుకున్న కేంద్రప్రభుత్వ విధానం తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు ముకుతాడు వేయబోతోంది. రాజ్యాంగపరమైన ఆటంకాలు తొలగిస్తే రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు తమకెటువంటి అభ్యంతరం లేదని ఎన్నికల కమిషన్ ఇప్పటికే తేల్చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగు మెషీన్లు, వీవీపాట్ ల వంటివి పెద్ద సమస్యే కాదు. అదనపు వనరులు సమకూరిస్తే ఆరునెలల్లోపు మొత్తం తయారీ చేయవచ్చని సాంకేతిక నిపుణులు హామీ ఇచ్చేశారు. సమీప ఎన్నికలను కలిపేయడం ద్వారా 2024 నాటికి శాసనసభ, లోక్ సభలకు సార్వత్రిక ఎన్నికలు దేశంలో రెండు విడతలుగా జరిగేలా చేయవచ్చని ఒక అంచనాకు వచ్చేశారు. ఈ ఆరుసంవత్సరాల కాలవ్యవధిని తెలివిగా వినియోగిస్తే రాజకీయ పార్టీలు సైతం తీవ్రంగా ఇబ్బంది పడకుండానే ఏకాభిప్రాయం సాధించవచ్చని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఈ కోణం నుంచి చూస్తే తెలంగాణ ప్రభుత్వ హడావిడి అనవసర శ్రమగా మిగిలిపోయే సూచనలు గోచరిస్తున్నాయి.

ముందస్తుకు ముప్పు...

దాదాపు ఏడాదికాలంగా టీఆర్ఎస్ కోయిల ముందస్తు గానం చేస్తూ వస్తోంది. ఇటీవల దానిని తారస్థాయికి తీసుకెళ్లింది. ప్రధానితో భేటీలు, ఎన్నికల కమిషన్ కు వినతులురాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. కేంద్రంతో దాదాపు ఒక అంగీకారానికి వచ్చేశారనేది రాజకీయ సమాచారం. అయితే ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందనేది ముఖ్యం. ముందుగా ఎన్నికలకు వెళ్లడం ఎన్నికల సంఘానికి సుతరామూ ఇష్టం లేదు. అయితే ఆరు నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేస్తే రాజ్యాంగ పరంగా తన బాధ్యతను తాను నిర్వర్తించాల్సిందే. ఈ బలహీనతను అడ్డుపెట్టుకునే కేసీఆర్ పులిజూదం మొదలుపెట్టారు. ఆరునెలల లోపు కచ్చితంగా ఎన్నికలు పెట్టాలని గతంలో సుప్రీం కోర్టు తీర్పులు సైతం ఉన్నాయి. కానీ ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు ముందస్తుకు ఆటంకంగా పరిణమిస్తున్నాయంటున్నారు. కేంద్రప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జమిలీ, ఏక కాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభిస్తోంది. అందులోనూ టీఆర్ఎస్ ప్రభుత్వ గడువు ముగియవస్తోంది. రాష్ట్రంలో రెండు సార్లు ఎన్నికలు పెట్టడం కంటే మార్చి నెల నుంచి ఎలాగూ సార్వత్రిక ఎన్నికల దశ మొదలవుతుంది. అందువల్ల ప్రత్యేక అనుమతితో ఎన్నికల సంఘం సార్వత్రికంతో తెలంగాణను కలిపేయవచ్చు. అదే జరిగితే టీఆర్ఎస్ అనుకున్నదొకటి. జరిగేది మరొకటి అవుతుంది.

న్యాయకమిషన్ నకారాలు...

ఒకేసారి ఎన్నికలు జరపాలనే విషయంలో కేంద్ర న్యాయకమిషన్ నిర్దిష్టమైన విధానం ప్రకటించింది. 2019 నాటికి 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాన్ని కలిపి ఒకేసారి ఎన్నికలు జరపాలనేది సూచన. వాటి కాలవ్యవధి ముగిసిపోవడానికి దరిదాపుల్లో ఉంటాయి. అలాగే 2021లో మిగిలిన రాస్ట్రాల శాసనసభల ఎన్నికలన్నిటినీ కలిపేయాలనేది అంచనా. అంటే కాలవ్యవధి ముగిసిపోవడానికి దగ్గరగా ఉన్న అసెంబ్లీలు, కాలవ్యవధి గడువు ముగిసినా కొన్నింటిని కొంత పొడిగించి వాటన్నిటినీ కలిపి ఒకే దఫా ఎన్నిక పెట్టాలనేది సూచన. ఎక్కువ సంఖ్యలో ఎన్నికలు జరిపకూడదనే కేంద్ర ప్రభుత్వ యోచనకు అనుగుణంగానే కమిషన్ సిఫార్సులు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రెండు నెలల కాలవ్యవధిలోనే రెండు ఎన్నికలకు వెళ్లాలనే ప్రయత్నం చేస్తోంది. మార్చిలోపు అసెంబ్లీ ఎలక్షన్ జరిపేసి, మళ్లీ ఏప్రిల్, మే నెలల్లో లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలనేది యోచన. దేశం మొత్తానికే ఒకేసారి ఎన్నికలు పెట్టేయాలని చూస్తున్నాయి కేంద్రం, ఎన్నికల సంఘం. ఆ ఆలోచనకు దన్నుగా నిలుస్తోంది లా కమిషన్. తెలంగాణ ప్రభుత్వ ఆలోచనకు ఇవన్నీ ప్రతిబంధకాలే.

పునర్విభజన సంకటం...

రాష్ట్రవిభజన అంశాలు సైతం ముందస్తు ఎన్నికలకు ఒక కోణంలో అడ్డుగా నిలుస్తున్నాయి. ఏపీలో కలిపేసిన ఏడు మండలాలకు సంబంధించి కేంద్ర నోటిఫికేషన్ ఇంతవరకూ విడుదల కాలేదు. అదొక సాంకేతికపరమైన అవరోధం. ఓటర్ల జాబితా సవరణకు జనవరి నాలుగో తేదీ వరకూ సమయం ఉంది. ఇదొక నిబంధన. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే పాత ఓటర్ల జాబితాతోనే వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు ఎన్నికల కమిషన్ సానుకూలంగా ఉంటుందా? లేదా ? అన్నది వేచి చూడాలి. నిజానికి సెప్టెంబరు పదో తేదీలోపు రాష్ట్ర శాసనసభను రద్దు చేసినప్పటికీ ఎన్నికల కమిషన్ కు మార్చి పదో తేదీవరకూ సమయం ఉంటుంది. అంటే దాదాపు సార్వత్రిక ఎన్నికల సమయమే. కేవలం విడిగా ఎన్నిక జరిపినట్లు అవుతుందే తప్ప లోక్ సభ ఎన్నికల కాలవ్యవధితో పెద్దగా తేడా రాదు. ఇవన్నీ ఆటంకాలే. దీనివల్ల కేసీఆర్ సాధించేదేమిటనే విమర్శలూ ఉన్నాయి. కేవలం జాతీయాంశాలు ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతోనే ఎన్నికలకు వెళుతున్నారనే వాదన సైతం సమంజసంగా కనిపించడం లేదంటున్నారు. రెండు ఎన్నికలు కలిసి పెట్టినా 2014లో టీఆర్ఎస్ కే మెజార్టీ సీట్లు దక్కాయి. అందువల్ల జమిలీ ఎన్నిక ను చూసి భయపడాల్సిన పని లేదు. వేరే ఉద్దేశంతోనే కేసీఆర్ అసెంబ్లీ రద్దు యోచన చేస్తున్నారంటున్నారు. అయితే ఆ నిర్ణయం ఏమిటన్నది ఆయనకు తప్ప వేరెవ్వరికీ తెలియదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News