కొంచెం లాభం...కొంచెం నష్టం...!

Update: 2018-08-24 15:30 GMT

ముందస్తు పేరుతో గడబిడగా సాగిన టీఆర్ఎస్ హడావిడికి హఠాత్తుగా బ్రేకు పడింది. అయినా వేడి తగ్గకుండా కేసీఆర్ కార్యాచరణ ప్రకటించారు. గడచిన కొంతకాలంగా తమ అధినేత దూకుడు చూసి ప్రజాప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరిగెట్టడం మొదలైంది. ఎట్టిపరిస్థితుల్లోనూ డిసెంబరులో శాసనసభ ఎన్నికలు ఖాయమన్న వాతావరణం సృష్టించారు. పక్కా లెక్కలు వేసి సెప్టెంబరు రెండో తేదీలోపు అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేస్తారని రాజకీయ వర్గాలు విశ్వసించాయి. దీనిపై కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించారనే ప్రచారమూ సాగింది. నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ ప్రత్యర్థులకు అంతసులభంగా దొరికిపోయే రకం కాదు. ముందస్తుకు వెళితే రాజకీయంగా ఎటువంటి ప్రయోజనం ఉంటుంది? ఒకవేళ సాధారణ కాలవ్యవధిలోనే ఎలక్షన్స్ కు వెళితే ప్రయోజనం ఉంటుందా? అన్న అంశాలను ఫీలర్స్ రూపంలో ప్రజలకు వదిలేశారు. ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. నిర్ణయాన్ని తన వద్ద అట్టే పెట్టుకున్నారు.

యుద్ధానికి సిద్దమా?

మంత్రులు, సీనియర్ నేతలతో తాజాగా కేసీఆర్ భేటీ అయ్యారు. అంతా రెడీయేనా అంటూ సన్నద్ధతను తెలుసుకున్నారు. నిజానికి ముందస్తు ఎన్నికల వల్ల కొంత నష్టపోతామేమోననే భయం టీఆర్ఎస్ నేతలను వెన్నాడుతోంది. ముఖ్యంగా రైతు బంధు ఒక విడత మాత్రమే ఇంతవరకూ పంపిణీ సాగింది. అందులోనూ కొన్నిలోపాలు చోటు చేసుకున్నాయి. వాటన్నిటినీ సరిదిద్దుకుని నవంబరు నాటికి మలి విడత రైతు బంధు చెక్కుల పంపిణీని పూర్తి చేసుకుంటే కొంత స్పష్టత వస్తుందని నాయకులు భావిస్తున్నారు. 58 లక్షలమంది రైతులతో ముడిపడిన ఈ పథకాన్ని ఓటు బ్యాంకుగా అంచనా వేస్తున్నారు. కానీ ప్రచారం ఇంకా విస్తృతం కావాల్సి ఉంది. దేశంలో కేవలం తెలంగాణలో మాత్రమే అమలవుతోంది. అదీ కేసీఆర్ పుణ్యమేనన్న విషయం ప్రజల్లోకి వెళ్లాలి. ఈ విషయంలో ఎమ్మెల్యేలకు కొన్ని సందేహాలు ఉన్నాయి. దాంతో వెనకంజ వేస్తున్నారు. పైపెచ్చు అసెంబ్లీ, లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు వస్తే ఖర్చు పంచుకోవడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యేల గెలుపునకు సైతం నిధులు వెచ్చిస్తారు. రెండు ఓట్లకు కలిపి డబ్బుల పంపిణీ సాగుతుంది. అదే విడిగా అయితే ఎమ్మెల్యేలే మొత్తం ఖర్చు భరించాలి.

సమీకరణలు సరిపోతాయా?...

విడిగా, ముందస్తుగా వెళ్లడం లో ఉద్దేశమొకటే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్ సభ ఫలితాలపై పడకూడదు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఏకైక శక్తిగా కేంద్రీకృతం అవుతూ అప్రతిహత విజయం సాధించాలంటే విడిగా ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమనే భావన టీఆర్ఎస్ అధినేతలో నెలకొంది. జాతీయ ఎన్నికలతో కలిపితే రాహుల్ గాంధీ, మోడీ లలో ప్రధాని గా ఎవరిని ఎంచుకోవాలనే అంశం ఓటర్ల ముందుకు వస్తుంది. దళితులు, మైనారిటీల ఓట్లు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెసు వైపు పోలరైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ ప్రభావం ఎంతో కొంతమేరకు టీఆర్ఎస్ పైనా పడుతుంది. అందులోనూ బీజేపీకి టీఆర్ఎస్ చేరువ అవుతోందనే ప్రచారం బాగా పుంజుకుంది. దీనివల్ల ప్రతికూల ఫలితాలను టీఆర్ఎస్ చవిచూడాల్సి వస్తుందనే అంచనా ఉంది. అందువల్లనే విడిగా ముందస్తు ఎన్నికలకు వెళితే టీఆర్ఎస్ స్పష్టమైన అజెండాతో ప్రజల మద్దతు పొందవచ్చు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి బీజేపీకి చేరువ కావాలో , దూరం కావాలో నిర్ణయించుకోవచ్చు. ఈరకమైన అంచనాతోనే వ్యూహాత్మకంగా కేసీఆర్ ముందస్తు సందడిని షురూ చేశారు.

అయిననూ హస్తినకు...

కేసీఆర్ తో భేటీ అయిన మంత్రుల్లో మెజార్టీ సభ్యులు ముందస్తు ఎన్నికలపై విముఖత వ్యక్తపరిచారు. అంతిమంగా అధినేత నిర్ణయమే శిరోధార్యమని చెప్పేశారు. రాజకీయపరమైన సమీకరణలు సరిచూసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటానని ఆయన వారికి భరోసానిచ్చారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల మాటను ఆయన మన్నిస్తారా? లేక తన సొంత వైఖరితో ముందుకు వెళతారా? అన్నది ఇప్పుడు టీఆర్ఎస్ లో చర్చనీయంగా మిగిలింది. ఒకవేళ అసెంబ్లీని రద్దు చేస్తే కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు అవకాశం ఉందని నిశ్చయమైతే మాత్రమే కేసీఆర్ ముందడుగు వేస్తారు. లేకపోతే సార్వత్రికంగా లోక్ సభతో పాటే ఎన్నికలకు వెళతారు. ఈవిషయాన్ని అటో ఇటో తేల్చుకునేందుకు హస్తిన యాత్ర తలపెడుతున్నారు టీఆర్ఎస్ అధినేత. ఈ పర్యటన తర్వాత ఆంతరంగికంగా కేసీఆర్ ఒక నిర్ణయానికి వస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News