కాలు దువ్వుతుంది అందుకేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ పై దూకుడుగా వెళుతున్నారు. గత ఐదేళ్ల పాటు బీజేపీతో సఖ్యతను ప్రదర్శించిన కేసీఆర్ ఇటీవల మాత్రం వ్యతిరేకతను వెళ్లగక్కుతున్నారు. దీనికి కారణాలపై [more]

Update: 2020-09-29 00:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ పై దూకుడుగా వెళుతున్నారు. గత ఐదేళ్ల పాటు బీజేపీతో సఖ్యతను ప్రదర్శించిన కేసీఆర్ ఇటీవల మాత్రం వ్యతిరేకతను వెళ్లగక్కుతున్నారు. దీనికి కారణాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఏ అడుగు వేసినా రాజకీయంగానే ఆలోచిస్తారు. అలాగే తనకు మైలేజీ వస్తుందనుకుంటేనే స్టెప్ తీసుకుంటారు. అలాంటి కేసీఆర్ వాయిస్ బీజేపీపై ఒక్కసారిగా వాయిస్ మార్చడం వెనక ఏముంది?

తెగిడినా… పొగిడినా…..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెగిడినా, పొగిడినా ఒక రేంజ్ లో ఉంటుంది. మోదీని కూడా ఒక రేంజ్ లోనే మొన్నటి వరకూ పొగిడారు. కరోనా సమయంలో ప్రధాని మోడీని బీజేపీ ముఖ్యమంత్రులు సయితం పొగడని విధంగా ఆకాశానికెత్తేశారు. కేంద్ర మంత్రులు సయితం తెలంగాణ వచ్చి కేసీఆర్ సర్కార్ ను, పథకాలను పొగిడి వెళ్లేవారు. రాష్ట్ర బీజేపీ నేతలను కేసీఆర్ మొన్నటి వరకూ లెక్క కూడా చేసే వారు కాదు. వారి కామెంట్స్ కు టీఆర్ఎస్ నేతలు స్పందించే వారు కాదు.

కొంతకాలంగా ఫైర్…..

కానీ గత కొన్నాళ్లుగా కేసీఆర్ కమలం పార్టీ పై కాలుదువ్వుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్తు బిల్లులను తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ తిరస్కరించారు. విద్యుత్ బిల్లులు రైతాండానికి ఉరికొయ్యలుగా మారతాయని చెప్పారు. ఇక పార్లమెంటు సమావేశాల్లో డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో పాల్గొనకుండా తమ పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేశారు. కానీ అదే సమయంలో వ్యవసాయ బిల్లులను మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. రైతులకు జరుగుతున్న నష్టంపై జాతీయ స్థాయిలో ఉద్యమం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.

ఎన్నికల కోసమేనా?

అయితే దీనికి ప్రధాన కారణం త్వరలో జరగనున్న ఎన్నికలే కారణమంటున్నారు. దుబ్బాక శాసనసభ ఉప ఎన్నిక జరగనుంది. దీంతో పాటు రెండు పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పాటు హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అవుతుందని సర్వే ఫలితాలు తేల్చడంతో బీజేపీపై ఇటీవల కాలంలో ఫైర్ అవుతున్నారంటారు. ఎన్నికల తర్వాత మళ్లీ కేసీఆర్ కేంద్రపై మామూలు పద్ధతిని అవలంబిస్తారన్నది రాజకీయ వర్గాల టాక్.

Tags:    

Similar News