మోడీని ఢీ కొట్టడం వెనక ?

కేసీఆర్ ఏది చేసినా ఒక వ్యూహం ప్రకారం చేస్తారు. అందులో రెండవ మాటకు సందేహమే లేదు. మోడీని మెచ్చుకున్నా నొచ్చుకున్నా కూడా కేసీఆర్ మార్క్ పాలిటిక్సే వేరు. [more]

Update: 2020-05-20 16:30 GMT

కేసీఆర్ ఏది చేసినా ఒక వ్యూహం ప్రకారం చేస్తారు. అందులో రెండవ మాటకు సందేహమే లేదు. మోడీని మెచ్చుకున్నా నొచ్చుకున్నా కూడా కేసీఆర్ మార్క్ పాలిటిక్సే వేరు. మోడీ గ్రాఫ్ ఇపుడు తగ్గుతోందని గ్రహించడం వల్లనే కేసీఆర్ ధైర్యంగా ఇటీవల కాలంలో కేంద్రాన్ని టార్గెట్ చేశారని అంటున్నారు. మోడీ రెండవసారి ప్రధాని అయ్యారు. గతసారి కంటే కూడా మంచి మెజారిటీ వచ్చింది, కానీ మళ్ళీసారి అంటే 2024లో ఇదే మ్యాజిక్ రిపీట్ అయ్యే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ లెక్కలను బాగా బట్టిపట్టినందువల్లనే కేసీఆర్ మోడీని అసలు ఖాతరు చేయడంలేదని అంటున్నారు.

అందుకేనా వ్యతిరేకతా..?

నిజానికి మోడీ లాక్ డౌన్ మొదటిసారి ప్రకటించినపుడు దేశమంతా మద్దతుగా నిలిచింది. ఎందరో కరోడాల్లాంటి వారిని ఓడించేసిన మోడీకి కరోనా ఒక లెక్క కాదని 135 కోట్ల మంది జనమూ భావించారు. ఒక్కసారి చప్పట్లు కొడితే కరోనా హుష్ కాకీ అవుతుందనుకున్నారు. దీపాలు వెలిగిస్తే అందులో పడి కరోనా వైరస్ మాడి మసి అవుతుందని కూడా ఆశపడ్డారు. కానీ అంతకంతకు కరోనా వైరస్ కేసులు పెరిగిపోయాయి. చివరికి ఏం జరిగింది అంటే 500 లోపు కేసులు ఉన్నపుడు తలుపులు వేసుకున్న భారతం ఇపుడు లక్ష కేసులు అయ్యాక భయంగా బయటకు రావాల్సివస్తోంది. కరోనా వైరస్ విషయంలో గణాంకాలు లెక్కలు భారత్ కట్టడి చేసిందని ఎంత చెప్పుకున్నా సామాన్యుల్లో మాత్రం భయం అలాగే ఉంది. పైగా కరోనా కంటే కూడా ఆకలి బాధ ఎక్కువైపోయింది. ఉపాధి లేదు, ఆదాయం లేదు. దాంతో మార్చి నాటికి, మే నాటికి చూసుకుంటే జనం ఆలోచనా ధోరణిలో బాగా మార్పు కనిపిస్తోంది.

జనం గొంతుకగా ….

సరిగ్గా ఈ సమయంలో జనం పల్స్ పట్టుకున్న కేసీఆర్ మోడీ మీద ఘాటైన పదజాలం వాడుతున్నారు. మోడీ ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజిని ఆయన తూలనాడుతున్నారు. అదంతా ఒట్టి ట్రాష్ అనేస్తున్నారు. రాష్ట్రాలను బిచ్చగాళ్లను చేస్తారా అని నిందిస్తున్నారు. ఓ విధంగా దేశమంతా సైలెంట్ గా ఉన్న వేళ మోడీని టార్గెట్ చేసి మొనగాడు అనిపించుకుంటున్నారు. ఇది ఓ విధంగా జనంలో ఉన్న అసహనానికి సంకేతంగా కూడా భావించాలి. రాష్ట్రాలు డబ్బులు లేక ఇబ్బందుల్లో ఉన్నాయి. జనం కూడా తమ బాధలకు కారకులుగా ముందు రాష్ట్రాలనే నిందిస్తాయి. దానినుంచి వారిని తప్పించడానికి, మోడీ మీదకు జనాగ్రహాన్ని డైవర్ట్ చేయడానికి కేసీఆర్ తెలివిగా వేసిన ఎత్తుగడగా కూడా దీన్ని చెబుతున్నారు. కేసీఆర్ బాగా మోడీని అడుగుతున్నారని, కడిగేస్తున్నారని ఇంప్రేషన్ కూడా జనంలో రావడంతో పాటు మొత్తం ఫెయిల్యూర్స్ కి కారణం కేంద్రం అన్నది కూడా చెప్పేసినట్లవుతుంది.

చాంపియన్ గా….

ఇపుడు మోడీ కత్తికి ఎదురులేదని అంతా అనుకుంటున్నారు. ఆయన నంది అంటే నంది అనే పరిస్థితి ఉంది. అయితే మోడీ గాడి తప్పేశారని ఓ వైపు ఆర్ధికవేత్తలు అంటున్నారు. మరో వైపు రాజకీయ పార్టీల నేతలు కూడా మోడీ బాట తప్పులతడక అని చెబుతున్నారు. కానీ ఎవరూ బలంగా గళమెత్తి మాట్లాడే సీన్ లేదు. దాంతో కేసీఆర్ ముందుకు వచ్చి ప్రధానికి వ్యతిరేకంగా గొంతు విప్పడం ద్వారా జాతీయ స్థాయిలో పొలిటికల్ చాంపియన్ కావాలని భావిస్తున్నట్లుగా ఉంది. ఈ రెండు నెలల లాక్ డౌన్ పర్యవశానాలు మరో మూడు నాలుగేళ్ళ పాటు గట్టిగానే ఉంటాయి. దాంతో దేశ జీవన చిత్రమే మారుతుంది. దాంతో పాటుగానే ప్రజల ఆలోచనలు మారి రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా మార్చే వీలుంది. అందుకే కేసీయార్ ఈసారి చాలా తొందరగానే కేంద్రం మీద దండెత్తారని, 2019లో పట్టాలెక్కని ఫెడరల్ ఫ్రంట్ కి ఈసారి ముందుకు తెచ్చేందుకు ఇంతకు మించిన ముహూర్తం ఉండదని కూడా అంచనా వేసుకునే ఇలా చేస్తున్నారని అంటున్నారు.

Tags:    

Similar News