నీకు పోలీసు..నాకు పోలీసు...!!

Update: 2018-10-19 15:30 GMT

గతంలో ఆవేశకావేషాలు రగిలించి కుదిపేసిన డైలాగ్ ఇది. చంద్రబాబునాయుడు ఓటుకు నోటు కేసులో ఆడియోలో దొరికిపోయిన తర్వాత దుమారం చెలరేగింది. హైదరాబాదులో ప్రత్యేక పోలీసు స్టేషన్లు పెట్టాలనే డిమాండు బయటికి వచ్చింది. చట్టం చట్రంలో ఏదో మూలనపడిపోయిన ఆంధ్ర్రప్రదేశ్ పునర్విభజన చట్టం లోని సెక్షన్ ఎనిమిది చర్చకు వచ్చింది. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ, ఆంధ్రా పోలీసులను తెలంగాణ ప్రభుత్వంపై ప్రయోగిస్తానంటూ చంద్రబాబునాయుడు కేసీఆర్ నుద్దేశించి హెచ్చరించారు. నిన్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడంటూ కేసీఆర్ చంద్రబాబునాయుడిని హెచ్చరించారు. ఈ పరస్పర హెచ్చరికలు ఎక్కడికి దారితీస్తాయోనని ప్రజాస్వామ్యహితైషులు ఆందోళనకు గురయ్యారు. కేంద్ర పెద్దల జోక్యంతో ఈ గొడవ టీకప్పులో తుపానుగా ముగిసిపోయింది. మూడేళ్లు ముచ్చటగా గడచిపోయాయి. తాజాగా మరోసారి రచ్చ మొదలైంది. అప్పట్లో మాటలకు పరిమితమైన నీకు పోలీసు, నాకు పోలీసు డైలాగ్ ప్రత్యక్ష కార్యాచరణగా మారింది. రెండు ప్రభుత్వాల పోలీసు ఇంటిలిజెన్సు విభాగాలు తమ ప్రభుత్వాధినేతల మాటలను శిరోధార్యంగా భావిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలపై నిఘా పెట్టి సమాచారం అందించడమే ప్రధానకర్తవ్యంగా విధినిర్వహణలోకి దిగిపోయాయి.

కూటమిపై నిఘా నేత్రం...

అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యర్థులపై నిఘా పెడుతోంది. ఇంటిలిజెన్సు విభాగాలు, స్పెషల్ పోలీసులను కాంగ్రెసు, తెలుగుదేశం, టీజేఎస్, సీపీఐ నేతల కదలికలపై కాపు కాసేందుకు వినియోగిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా మహాకూటమి ఏం చేయబోతోంది? ఆయా పార్టీల కదలికలు ఎలా ఉన్నాయి? విభేదాలు తలెత్తే అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయి? ఏయే స్థానాలు ఏ పార్టీ కోరుతోంది? అక్కడ బలాబలాల సంగతేమిటి? వంటి కీలకాంశాలపై నిఘా సంస్థలకు బాధ్యతలు అప్పగించారు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగుతోంది. నిజానికి ప్రభుత్వాలకు కొన్ని ప్రత్యేకాధికారాలు ఉంటాయి. శాంతిభద్రతల వ్యవహారాలు, ప్రభుత్వానికి ముప్పు వాటిల్లకుండా చూసుకునే అంశాల్లో నిఘాసంస్థలు నిరంతరం సమాచారం సేకరిస్తుంటాయి. తమ విభాగాధిపతుల ద్వారా ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తుంటాయి. అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు అడుగులకు మడుగులొత్తే ధోరణి ఇంటిలిజెన్సు విభాగాల్లో ఇటీవలికాలంలో బాగా పెరిగిపోయింది. తమ ఒరిజినల్ బాధ్యతలను పక్కనపెట్టి ప్రభువులకు సేవ చేయడమే లక్ష్యంగా ఈ విభాగాలు పనిచేస్తున్నాయి. దీనిని అలుసుగా తీసుకుంటున్న ప్రభుత్వాలు ప్రత్యర్థులపై ఆయా విభాగాలను ఉపిగొల్పుతున్నాయి. దీనికి నిదర్శనంగా మహాకూటమి పరిణామాలపైనే ఇంటిలిజెన్సు ద్రుష్టి పెట్టింది. తెలంగాణ ప్రభుత్వానికి బాసటగా నిలుస్తోంది.

తెరాసపై తెరచాటు..

కేవలం తెలంగాణ ప్రభుత్వమే గూఢచర్యపు పనులకు పూనుకుంటే తాము చూస్తూ ఊరుకుంటామా? అన్నట్లుగా తెలుగుదేశం ప్రభుత్వం తయారయ్యింది. హైదరాబాదు ఉమ్మడి రాజధాని. చట్ట ప్రకారం ఎంతోకొంత వాటా పదేళ్ల పాటు ఏపీకి ఉంది. దీంతో హైదరాబాదులో పోలీసు శాఖకు కేటాయించిన భవనాల్లో ఇంటిలిజెన్సు పోలీసులు రంగప్రవేశం చేశారు. టీఆర్ఎస్ కు ప్రజలనుంచి ఎంతమేరకు మద్దతు లభిస్తోంది? ఏరకమైన వ్యూహంతో టీఆర్ఎస్ ముందంజ వేస్తోందనే వివరాలను సేకరించేందుకు ఏపీ ఇంటిలిజెన్సును వినియోగిస్తున్నట్లుగా అనుమానాలున్నాయి. పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఇటీవల సందడి పెరిగింది. ప్రత్యేకించి ఇంటిలిజెన్సు అధికారులు హైదరాబాదు కేంద్రంగా ఉంటున్నారు. వీరంతా టీఆర్ఎస్ కదలికలపై సమాచారం సేకరిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న గూఢచర్యంపై టీఆర్ఎస్ చాలా ఆగ్రహంగా ఉంది. తమ గడ్డపై తమకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారంటూ ఆరోపిస్తోంది. అయితే రెండు ప్రభుత్వాల ఇంటిలిజెన్సు కార్యకలాపాలు అధికారికం కాకపోవడంతో ధృవీకరించుకునే పరిస్థితి లేదు. ఖండన మండనలు తప్ప ప్రజలకు క్లారిటీ రావడం లేదు.

హద్దులు దాటిన దుర్వినియోగం...

తమ రాజకీయ ప్రయోజనాల కోసం అధికారంలో ఉన్న పార్టీలు ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేయడం కొత్త కాదు. అయితే ఇంటిలిజెన్సు శాఖను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నాయి. కీలకమైన శాంతిభద్రతలు,విదేశీ కుట్రలు, మతసామరస్య పరిరక్షణ వంటి అంశాలపై నిఘా పెట్టి సామాజిక శాంతికి ఉపకరించాలి నిఘా వ్యవస్థలు. ఆ పని తప్ప మిగిలిన అన్ని బాధ్యతలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అసెంబ్లీ రద్దు తర్వాత తెలంగాణలో కేవలం రోజువారీ కార్యకలాపాలు చూసేందుకే ప్రభుత్వం పరిమితం కావాలి. కానీ పూర్తిస్థాయి సర్కారు తరహాలోనే అన్నివిభాగాలూ జీహుజూర్ అంటున్నాయి. ఎన్నికల కమిషన్ షెడ్యూలును సైతం ప్రకటించేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసినట్లే. అయినా కమిషన్ కళ్లు మూసుకుంది. రాజకీయ కదంబం మామూలుగానే సాగిపోతోంది. అటు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం సైతం తన పరిధిలోకి రాని తెలంగాణ వ్యవహారాలపై నిఘా పెడుతోంది. టీఆర్ఎస్ రాజకీయ కార్యకలాపాలపై అమితాసక్తి ప్రదర్శిస్తోంది. ఓటుకు నోటు వ్యవహారంలో రికార్డింగు విషయాన్ని ముందుగా పసిగట్టడంలో వైఫల్యం చెందిన ఇంటిలిజెన్సు విభాగం ఈసారి భారీ కసరత్తు చేస్తోంది. దీనిపై గవర్నర్ జోక్యం చేసుకుని రాజ్యాంగ పరిరక్షకునిగా రెండు ప్రభుత్వాలకు, ఇంటిలిజెన్సు విభాగాలకు తగు సూచనలు చేయాలని ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News