సర్..జీ.... అంత ఈజీ కాదట...!

Update: 2018-10-22 15:30 GMT

పార్టీగా ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ తెలంగాణలో కాంగ్రెసు పార్టీకి మంచి ఆదరణే లభిస్తోంది. అధికార తెలంగాణ రాష్ట్రసమితి ఎన్ని సంక్షేమ పథకాలు చేపట్టినా సమకూరాల్సిన బలం రావడం లేదు. ఆశ్రిత పక్షపాతం,కుటుంబ పాలన , అవినీతి వంటి విపక్షాల ఆరోపణలకు ప్రజల నుంచి కొంతమేరకు మద్దతు లభిస్తోంది. నిన్నామొన్నటివరకూ నల్లేరుపై బండి నడకగా విజయం ఖాయమనుకుంటున్న తెలంగాణ రాష్ట్రసమితికి గడ్డు రోజులు ఎదురవుతున్నాయి. పరస్పర విరుద్ధ సైద్దాంతిక నేపథ్యం కలిగిన బీజేపీ, ఎంఐఎం రెంటితోనూ సత్సంబంధాలు నెరుపుతున్న టీఆర్ఎస్ వ్యూహం వికటిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అటుఇటు రెంటితోనూ అంటకాగాలనుకుంటున్న అధికారపార్టీ ఎత్తుగడను బయటపెట్టే ప్రతివ్యూహంతో కాంగ్రెసు ముందడుగు వేస్తోంది. స్వతస్సిద్దమైన బలానికి తోడు అదనపు బలం చేకూర్చే కునే దిశలోనూ కాంగ్రెసు ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్ కు చిర్రెత్తుతున్న వ్యవహారమిదే. నెల రోజుల క్రితం వరకూ పదిహేను స్థానాల్లో మాత్రమే కాంగ్రెసు పార్టీ బలంగా ఉన్నట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ హస్తం పార్టీకి పట్టు చిక్కుతోంది. తన బలాన్ని ఈ ముప్ఫై రోజుల్లోనే రెట్టింపు చేసుకున్నట్లుగా సర్వేలు చాటిచెబుతున్నాయి.

రెండు పడవలు...

తెలంగాణ రాష్ట్రసమితి రెండు పడవల ప్రయాణం లోని ఉద్దేశాన్ని వెలికితీయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది కాంగ్రెసు పార్టీ. రాష్ట్రంలో 12 శాతం వరకూ ముస్లిం మైనారిటీలున్నారు. షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన వారి సంఖ్య 22 శాతం పైచిలుకు ఉంది. బీజేపీకి ముస్లింలు దూరంగా ఉంటున్నారు. షెడ్యూల్డు కులాలు, తెగల్లోని మెజార్టీ శాతానికీ కమలం అంటే గిట్టదు. హైదరాబాదు పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల్లో ఎంఐఎందే నేటికీ పైచేయిగా ఉంది. ఆ సీట్లలో కాంగ్రెసు, టీఆర్ఎస్ లకు పెద్దగా వాటా లేదు. ఎంఐఎంకి పెద్దగా బలం లేకపోయినా రాష్ట్రంలోని మరో 18 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు ప్రభావశీల సంఖ్యలో ఉన్నాయి. వీటిని తన ఖాతాలో వేసుకునేందుకుగాను ఎంఐఎంతో టీఆర్ఎస్ స్నేహసంబంధాలు నెరపుతోంది. ఈవిషయాన్ని దాచుకోకుండా బహిరంగంగానే ప్రకటించింది. మరోవైపు జాతీయ అవసరాల దృష్ట్యా బీజేపీతో పరోక్షమైత్రి కొనసాగిస్తోంది. బీజేపీ బలంగా ఉన్న ఒక పార్లమెంటు స్థానం, ఆరు అసెంబ్లీ నియోజవర్గాల్లో టీఆర్ ఎస్ బలహీనమైన అభ్యర్థులను నిలపబోతున్నట్లుగా ప్రచారం ఊపందుకుంది. బీజేపీకి సహకరించేందుకు , కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పుకునేందుకు, అవసరమైతే భవిష్యత్తులో కమలానికి మద్దతు ఇచ్చేందుకే ఈ ఏర్పాటు అనే విమర్శలున్నాయి. కానీ టీఆర్ఎస్ వీటిని పట్టించుకోవడం లేదు. ప్రధాని మోడీని విమర్శించడం లేదు. అమిత్ షాను, ఇతర రాష్ట్రస్థాయి బీజేపీ నాయకులపైనే విమర్శలు గుప్పిస్తోంది.

రాహుల్ రాణించినట్లే....

కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభలను కామారెడ్డి, భైంసా, చార్మినార్ ప్రాంతాల్లో పార్టీ ఏర్పాటు చేసింది. కేసీఆర్ పై బలంగానే రాహుల్ ధ్వజమెత్తారు. ప్రధానంగా ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో సభలను ఏర్పాటు చేయడంలోని ఉద్దేశం బహిరంగ రహస్యమే. బీజేపీ, టీఆర్ఎస్ లు చెట్టపట్టాలు వేసుకుని నడుస్తున్నాయన్న అంశాన్ని ఎండగట్టడమే లక్ష్యం. ముస్లింలు కాంగ్రెసుకు ఆనవాయితీగా అండగా ఉంటూ వస్తున్నారు. 2014లో సైతం మొగ్గు కాంగ్రెసు వైపే ఉంది. అయితే ఎంఐఎం మైత్రి ద్వారా ఈ ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు అధికారపార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. దీనిని ప్రతిఘటించేందుకు మైనారిటీ వర్గాల్లో తమపట్టు నిలుపుకునేందుకు కాంగ్రెసు నేతలు రాహుల్ ను రంగంలోకి దింపారు. ఆయన తనవంతు ప్రయత్నంగా షెడ్యూల్డుకులాలకు సైతం టీఆర్ఎస్ పాలనలో అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఒక్క దెబ్బకు రెండు ప్రయోజనాలు ఆశిస్తూ, ముస్లిం మైనారిటీ షెడ్యూల్డు కులాలు రెంటికీ కాంగ్రెసు మాత్రమే అండ అని తేల్చేశారు. రాహుల్ సభలకు స్పందన బాగానే లభించిందని తటస్థ రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతూ రావడంతో ప్రదాన కూటమిగా రూపుదాల్చనున్న కాంగ్రెసు పట్ల ప్రజల్లో ఆసక్తి వ్యక్తమవుతోందనేది విశ్లేషకుల భావన.

అత్యవసర చర్యలు...

కాంగ్రెసు సభలకు మంచి ఆదరణ లభించిందన్న సమాచారాన్ని ప్రభుత్వం పసిగట్టింది. హస్తం పార్టీ చేస్తున్న ప్రజాకూటమి ప్రయత్నాలకూ ప్రజల నుంచి మద్దతు వస్తోందని ఇంటిలిజెన్సు వర్గాలు నివేదించాయి. ఈ పూర్వరంగంలోనే అత్యవసర దిద్దుబాటు చర్యలకు టీఆర్ఎస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు. ప్రతి నియోజకవర్గంలో సగటున అరవైవేలమంది వరకూ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులున్నారు. వారి వివరాలను టీఆర్ఎస్ అభ్యర్థులకు అందచేశారు. ఎన్నికల లోపు వారందరినీ స్వయంగా కలిసి తిరిగి టీఆర్ఎస్ కు అధికారం కట్టబెట్టాల్సిన ఆవశ్యకతను వివరించాలని ఆదేశించారు. డబ్బు, ప్రచార సామగ్రి విషయంలో వెనకడుగు వేయవద్దంటూ అధిష్ఠానం అభయమిచ్చింది. సెంచరీ కొడతామంటూ అభ్యర్థుల్లో ధైర్యం నింపే ప్రయత్నం సాగింది. అదే సమయంలో లోపాలను చెప్పడానికే ఎక్కువ సమయం వెచ్చించినట్లు సమాచారం. మొత్తమ్మీద కాంగ్రెసు పార్టీ జోరు , హుషారు అధికార పార్టీలో కాక పుట్టిస్తోంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News