మామా అల్లుళ్ల సవాల్...!

Update: 2018-09-23 16:30 GMT

పురాణాల్లో, ఇతిహాసాల్లో కొన్ని పాత్రలు కనిపిస్తాయి. ఇచ్చిన మాట కోసం , నమ్ముకున్న వారికోసం తనకు ఆరాధ్య దైవం వంటివారిపైనే తిరగబడిన ఘట్టాలు చాలా ఉత్సుకత రేకెత్తిస్తుంటాయి. రామాంజనేయ యుద్ధం, కృష్ణార్జున యుద్ధం వంటి వాటిని ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవాలి. హనుమంతుడికి గుండెను చీల్చితే కనిపించేది రాముడే. అర్జునుడిని విజేతను చేసిన సారథి కృష్ణుడే. అయినా తమకు దైవసమానులైన వారిపైనే తిరుగుబాటు చేయకతప్పని పాత్రలు సృష్టించారు మన పౌరాణికులు. వాటికి ఒక ఉదాత్తతను కల్పించారు. ఆధునిక రాజకీయాల్లోనూ అటువంటి ఘట్టాలే పునరావృతమవుతాయా? అన్నసందేహాలు తలెత్తుతున్నాయి. తెలంగాణలో ఉద్యమ సమయం నుంచీ టీఆర్ఎస్ లో నంబర్ టు గా పేరొందిన హరీశ్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ తో తీవ్రంగా విభేదిస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. క్యాడర్ నుంచి లీడర్ వరకూ అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు హరీశ్. కేసీఆర్ పరోక్షంలో గతంలో ఆయనే చక్రం తిప్పేవారు. ట్రబుల్ షూటర్ గా, పొలిటికల్ ఫైటర్ గా పేరుంది. అనేక సంక్షోభ సమయాల్లో ఆయననే రంగంలోకి దించేవారు. కానీ ఆ ప్రాధాన్యత ప్రస్తుతం కోల్పోయారు. ‘చేదోడువాదోడుగా, రైట్ హ్యాండ్ గా నిన్నామొన్నటివరకూ నిలిచిన హరీశ్ ఈరోజున పార్టీకి భారమైపోయారు. అధినేతకు అంటరానివాడైపోయాడు.’ అని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

పుట్టి ముంచుతుందా? పుత్రప్రేమ...

పార్టీలో, ఉద్యమంలో, ప్రభుత్వంలో,వయసులో హరీశ్ చాలా సీనియర్. కేసీఆర్ వారసుడు కేటీఆర్ కంటే మంచి నాయకుడిగా పార్టీలోనూ, ప్రజల్లోనూ గుర్తింపు పొందారు. అయితే ఆ ఆదరణే ఇప్పుడు అతని కొంప ముంచింది. కేటీఆర్ ను అన్ని మార్గాల్లోనూ అధినేత ప్రమోట్ చేస్తున్నప్పటికీ ఇంకా పార్టీ శ్రేణుల్లో హరీశ్ కు ఆదరణ తగ్గలేదు. ద్వితీయశ్రేణి నాయకత్వం భయం కొద్దీ కేటీఆర్ కు జీహుజూర్ అంటున్నప్పటికీ వారిలో భక్తి భావం కనిపించడం లేదు. అయినప్పటికీ ఆయనకు ఎన్నికల తర్వాత కీలక బాధ్యతలు అప్పగించాలని అధినేత నిర్ణయించినట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. కేసీఆర్ జాతీయ పాత్రలోకి మారితే పార్టీ పగ్గాలు, ముఖ్యమంత్రి పీఠం కుమారుడికే కట్టబెడతారని విశ్వసిస్తున్నారు. అయితే తాజాగా మాజీలుగా మారిన ఎమ్మెల్యేల్లో 30 మంది వరకూ హరీశ్ రావుకు సన్నిహితులున్నారు. జిల్లాలలో ఉన్న నియోజకవర్గ నేతలు, మండల స్థాయి నేతల్లో వేలాదిమంది అభిమానులున్నారు. వీరెవరికీ కేటీఆర్ నాయకత్వ సామర్థ్యంపై నమ్మకం లేదు. కేసీఆర్ తిరుగులేని నేత. ఆయన తర్వాత పార్టీని నడపగల సమర్థుడు హరీశ్ అనేది వారి విశ్వాసం. ఒక్కసారిగా రెండు పదవులు కేటీఆర్ కే దక్కుతాయని తెలిస్తే క్యాడర్ కొంత డీలాపడిపోయే ప్రమాదం ఉంది. నిజానికి పార్టీతో అనుబంధం ఉన్న హరీశ్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు పదవి, కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తే బాగుంటుందనే సూచనలు వచ్చాయి. అయినప్పటికీ గడచిన రెండేళ్లుగా ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వకుండా మెదక్ జిల్లాకే హరీశ్ ను పరిమితం చేశారు. అంతచేసినా క్యాడర్ లో ఆయనకు ఆదరణ తగ్గలేదు. పార్టీ బాధ్యతలు అప్పగిస్తే మొత్తం ఆయన గుప్పెట్లోకి వెళ్లిపోతుందనే భయాందోళనలున్నాయి. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ కేటీఆర్ నామమాత్రంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకునే హరీశ్ ను దూరంగా పెట్టాలని నిశ్చయించినట్లు ప్రచారం సాగుతోంది. అసలీ విడత హరీశ్ ను అసెంబ్లీకే పోటీ చేయించకుండా ఉంటే బాగుంటుందనే దిశలోనూ చర్చలు సాగినట్లుగా వదంతులు వ్యాపిస్తున్నాయి.

నమ్ముకున్న వారికి న్యాయం..

‘మీ అభిమానాన్ని చూస్తుంటే ఇక రాజకీయాలనుంచి తప్పుకోవాలనిపిస్తోంది.’ అంటూ హరీశ్ భావోద్వేగానికి గురైన ఘట్టం వెనక లోతైన కారణాలే ఉన్నాయి. ప్రజలే కాకుండా ఆయనను అంతగా అభిమానించే ద్వితీయశ్రేణి నాయకులూ ఉన్నారు. ఈసారి అసెంబ్లీ టిక్కెట్ల కేటాయింపులో తన వర్గానికి చెందినవారికి ఏమాత్రం న్యాయం చేసేందుకు ప్రయత్నించలేదని హరీశ్ అలకబూనినట్లుగా సమాచారం. కొండా సురేఖ వంటివారికి గతంలో గట్టి హామీలిచ్చి పార్టీలోకి తెచ్చారు. కేటీఆర్ తిరస్కరణతో వారికి టిక్కెట్టు దక్కలేదు. తన కోటరీకి చెందిన వారికెవరికీ ప్రభుత్వంలో ప్రాధాన్యం దక్కడం లేదు. భవిష్యత్తులో తన అనుచరులకు పదవీభాగ్యం పడుతుందన్న నమ్మకమూ కుదరడం లేదు. అసలు తన భవితవ్యమే డోలాయమానంలో పడింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఇక రాజకీయం చాలించేస్తాను అంటూ హరీశ్ వ్యాఖ్యానించారనేది సమాచారం. పార్టీలో, ప్రభుత్వంలో ఉండి తనను నమ్ముకున్నవారికి న్యాయం చేయలేకపోయినప్పుడు సాధించేదేమిటి? అంటూ సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. ఒకవేళ హరీశ్ కనుక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సన్యాసం ప్రకటిస్తే దాని ప్రభావం టీఆర్ఎస్ పై తీవ్రంగానే పడుతుంది. 20 నియోజకవర్గాల్లో గెలుపును ప్రభావితం చేస్తుందని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. మొత్తమ్మీద హరీశ్ సెంటిమెంట్ స్పీచ్ కేసీఆర్ లో ఎటువంటి కదలిక తెస్తుందనేది ఆసక్తికరపరిణామం. అందరూ వేచి చూస్తున్న ఘట్టం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News